బెంగాల్‌లో దీదీకే జై! | Why Didi was not smiling today? | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో దీదీకే జై!

Published Fri, May 20 2016 3:35 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

బెంగాల్‌లో దీదీకే జై!

బెంగాల్‌లో దీదీకే జై!

* మళ్లీ మమతా బెనర్జీకే బెంగాలీల పట్టం  
* మూడింట రెండొంతులకుపైగా మెజారిటీ
* కాంగ్రెస్-వామపక్షాల కూటమికి చావుదెబ్బ  
* మూడు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రజలు మళ్లీ దీదీకే పట్టం గట్టా రు. ఊహించని స్థాయిలో అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు. కాంగ్రెస్-వామపక్షాల కూటమిని చావుదెబ్బ కొట్టారు. బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తృణమూల్ కాంగ్రెస్ 211 చోట్ల, కాంగ్రెస్-వామపక్ష కూటమి 76 చోట్ల గెలుపొందాయి.

బీజేపీకి మూడు, గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం)కు మూడు స్థానాలు దక్కగా ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 34 ఏళ్ల సుదీర్ఘ వామపక్ష పాలనకు 2011 ఎన్నికల్లో చరమగీతం పాడిన దీదీ... అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేసి 184 సీట్లు సాధించారు. తాజాగా ఒంటరిగా పోటీ చేసి 211 సీట్లు సాధించడం గమనార్హం. ఇక తృణమూల్‌పై విశ్వాసం ఉంచి అద్భుత విజయాన్ని అందించిన పశ్చిమబెంగాల్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. మే 27న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడించారు.
 
విపక్షాల ఆశలు ఆవిరి..
ఈ ఎన్నికల్లో తృణమూల్ ఒంటరిగానే పోటీ చేయగా... కాంగ్రెస్, వామపక్షాలు కలసి కూటమిగా పోటీ చేశాయి. తృణమూల్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడుతోందంటూ విపక్షాలు భారీ స్థాయిలో ప్రచారం చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి నుంచి తీవ్ర పోటీ ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేకత విపక్షాలకు కలసి వచ్చే అవకాశముందన్న అంచనాలను తలకిందులు చేస్తూ దీదీ భారీ విజయాన్ని సాధించారు.

మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లోనూ తృణమూల్ విజయం సాధించడం గమనార్హం. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాతోపాటు దక్షిణ 24 పరగణాల జిల్లా, హౌరా, హూగ్లీ, కూచ్‌బిహార్, జల్పాయ్‌గురి జిల్లాల్లో తృణమూల్ క్లీన్‌స్వీప్ చేసింది. ఉత్తర బెంగాల్ జిల్లాల్లో మాత్రం హోరాహోరీ నడిచింది. ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లో కూటమి ప్రభావం ఎక్కువగా కనిపించింది. డార్జిలింగ్ జిల్లాలో తృణమూల్ ఖాతా తెరవలేదు. ఇక బీజేపీ ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న ఒకే సీటును మూడు సీట్లకు పెంచుకుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సహా ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
 
అన్ని ప్రాంతాల్లోనూ తృణమూల్ హవా
పశ్చిమబెంగాల్ గిరిజన ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు సహా అన్ని చోట్లా తృణమూల్ కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి 25,301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి దీపాదాస్ మున్షీ, నేతాజీ మనవడు చంద్రబోస్ పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత టీఎంసీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న అమిత్ మిత్రా, పార్థ ఛటర్జీ, అరూప్‌రాయ్, సుబ్రతో ముఖర్జీ, ఫర్హాద్ హకీం, మొలోయ్ ఘాటక్, గౌతమ్‌దేవ్ తదితరులు విజయం సాధించగా.. మనీశ్‌గుప్తా, చంద్రిమ భట్టాచార్య, కృష్ణేందు నారాయణ్ చౌదరి, సావిత్రి మిత్రా తదితరులు ఓటమి పాలయ్యారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో అరెస్టై జైల్లో ఉన్న టీఎంసీ నేత మదన్ మిత్రా ఓటమి పాలయ్యారు. టీఎంసీ ఎంపీ సర్వేందు అధికారి తన సమీప ప్రత్యర్థి, లెఫ్ట్ అభ్యర్థి అబ్దుల్ కబీర్‌పై 81,230 ఓట్ల భారీ రికార్డు మెజారిటీతో గెలుపొందారు.
 
చతికిల పడిన కూటమి..
కాంగ్రెస్-వామపక్షాల కూటమి ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసినా, దీదీకి దీటుగా ఆరోపణలు, విమర్శలు గుప్పించినా ఫలితం పొందలేకపోయాయి. ప్రభుత్వ వ్యతిరేకతను ఏ మాత్రం ఒడిసిపట్టుకోలేకపోయాయి. 294 సీట్లున్న అసెంబ్లీలో కనీసం మూడంకెల సంఖ్యను కూడా చేరుకోలేకపోయాయి.

కూటమి అభ్యర్థులు మొత్తంగా 76 స్థానాల్లో గెలుపొందగా... మెరుగ్గా కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోగా.. సీపీఎం 26, ఆర్‌ఎస్‌పీ 3, ఫార్వర్డ్‌బ్లాక్ 2, సీపీఐ 1 స్థానంతో సరిపెట్టుకున్నాయి. కూటమి మద్దతు ఉన్న ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ప్రచారం జరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సుర్యకాంత మిశ్రా నారాయణగఢ్ నియోజకవర్గంలో 13 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
 
కూటమి ఓటమికి కారణమేంటి?
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి ఓటమికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. తృణమూల్‌తో నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేసినా, ఆ పార్టీ మంత్రులు, నేతల అవినీతిని ఎత్తి చూపినా కూటమి పెద్దగా లబ్ధి పొందలేకపోయింది. కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలు ఓట్లు బదిలీ చేసుకోవడంలో విఫలమయ్యాయని... అదే సమయంలో బీజేపీ తమ ఓట్లను వ్యూహాత్మకంగా తృణమూల్‌కు మళ్లించిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీకి 17 శాతం ఓట్లురాగా.. ఇప్పుడది బాగా తగ్గిందని చెబుతున్నారు. ఇక ప్రతికూల రాజకీయ వాతావరణం, బీజేపీ తమ ఓట్లను వ్యూహాత్మకంగా తృణమూల్‌కు మళ్లించడమే కూటమి పరాజయానికి కారణమని కాంగ్రెస్-లెఫ్ట్ మధ్య పొత్తులో కీలకంగా వ్యవహరించిన ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు.
 
మమతా బెనర్జీ.. పశ్చిమబెంగాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఫైర్‌బ్రాండే... తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తన రాజకీయ చతురతకు తిరుగులేదని మరోసారి మమత నిరూపించారు. 61 ఏళ్ల మమత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ను ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకురావడమే కాక.. 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు చరమగీతం పాడారు.

ఈ సారి ఎన్నికల్లో వామపక్షాలన్నీ ప్రత్యర్థి కాంగ్రెస్‌తో జట్టుకట్టి మమతను ఢీకొట్టినా... ప్రధాని మొదలుకొని కేంద్ర మం త్రుల్ని బీజేపీ మోహరించినా... మమత విజయాన్ని అడ్డుకోలేకపోయారు.
 
విద్యార్థి నాయకురాలిగా...
బెంగాల్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు మమత. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. తొలి రోజుల్లో కుటుంబ పోషణ కోసం పాల బూత్‌లో సహాయకురాలిగా పనిచేశారు. 1970ల్లో కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్‌లో విద్యార్థి నాయకురాలిగా రాజకీయ రంగప్రవేశం చేశారు.

1984 లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమత సీపీఎం అగ్రనేత సోమనాథ్‌చటర్జీపై విజయం సాధించడంతో దేశం దృష్టిని ఆకర్షించారు. 1989లో మమత ఓటమిపాలైనా.. 1991లో కోల్‌కతా సౌత్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1996, 1998, 1999, 2004, 2009లో అక్కడి నుంచే మమత లోక్‌సభకు ఎన్నికయ్యారు.
 
1991లో కేంద్ర మంత్రివర్గంలోకి..
1991లో పీవీ నరసింహారావు కేబినెట్‌లో సహాయ మంత్రిగా పలు శాఖలు నిర్వహించారు. 1998లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. 1999లో ఎన్‌డీఏతో పొత్తు పెట్టుకున్న మమత.. రైల్వే, బొగ్గు గనుల మంత్రిగా పనిచేశారు. 2001లో కాంగ్రెస్‌తో జట్టు కట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినా వామపక్ష కూటమి బలం ముందు గెలవలేకపోయారు.
 
అలుపెరగని పోరాటం
2004 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ నుంచి మమతా బెనర్జీ ఒక్కరే గెలుపొందారు. 2006 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత పార్టీ 30 సీట్లు గెలుపొందింది. ఆ తర్వాత సింగూరు, నందిగ్రామ్‌లో భూ సేకరణకు వ్యతిరేకంగా మమత పోరాడారు. ఆ పోరాటమే 2011లో బెంగాల్ పీఠాన్ని కట్టబెట్టింది.  కాళీఘాట్‌కు సమీపంలోని ఇంట్లో నివసిస్తోన్న మమత కాటన్ చీర, జోలా బ్యాగ్, హవాయి చెప్పులతో సాధారణంగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.
 
కుట్రపై విజయమిది: మమత

పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ విజయం అపూర్వమని, ఇది కాంగ్రెస్-వామపక్షాల కూటమి చేసిన కుట్రపై సాధించిన విజయమని తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. విపక్షాలు చేసిన దుష్ర్పచారాన్ని ప్రజలు తిప్పికొట్టారన్నారు. అసలు కాంగ్రెస్, వామపక్షాలు తమ సిద్ధాంతాలను పక్కనపెట్టి కూటమి కట్టడమే అతిపెద్ద తప్పిదమని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆమె కోల్‌కతాలో మాట్లాడారు. ‘‘నన్ను ఎంతగానో తిట్టారు.

ఎన్నో ఆరోపణలు చేశారు. వారు బాగుండాలని కోరుకుంటున్నా. వారికి ఓపికున్నంత వరకు నాతో పోరాడొచ్చు. అధికార దాహంతో విపక్షాలు నాకు వ్యతిరేకంగా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశాయి. వాటి తీరుతో రాజకీయాలను దిగజార్చాయి. దీన్ని ప్రజలు గుర్తించారు. తమను తప్పుదారి పట్టించాలని చూసిన విపక్షాలకు బుద్ధి చెప్పారు. మాకు వ్యతిరేకంగా చేసిన కుట్రలను మా అభివృద్ధితో తిప్పికొట్టాం..’’ అని వ్యాఖ్యానించారు. గెలుపొందిన తృణమూల్ ఎమ్మెల్యేలంతా శుక్రవారం మధ్యాహ్నం సమావేశమై తమ నేతను ఎన్నుకుంటారని మమత చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement