ఉప రాష్ట్రపతి పోటీలో లేను
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి పదవికి పోటీకి నిర్ణయం తీసుకోలేదు.. అదంతా మీడియా సృష్టి.. దేవుడు ఏదీ తలిస్తే అదే జరుగుతుందని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రంజాన్ ఉపవాసాల సందర్భంగా రాజ్‌భవన్‌లో బుధవారం ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షాలు తెలిపారు.
‘‘ఇదీ చాలా మంచి మాసం..మనుసులోని చెడు భావాలను దూరం చేసి, మలీనం లేకుండా పవిత్రంగా ఉంచే మాసం..ముస్లిలంతా ద్వేష భావాన్ని వీడాలి..చెడు గురించి ఆలోచించ వద్దు..ఉపవాసంతో మంచితనం అలవడుతుంది..సంస్కారం అలవడుతుంది..అందరితో కలిసి సమైక్యంగా జీవించండి’ అని గవర్నర్ కోరారు. ఎవరికీ కీడు చేయవద్దు..దేవుడిని ప్రార్థిస్తూ మంచితనంతో మసలుకోవాలి కోరారు. పరస్పర సోదర భావం పెంపొందించుకొని, మంచి నడవడికతో జీవించాలన్నారు.
జీవితంలో పది మందికి మేలు చేయాలని, సత్ప్రవర్తన, మంచితనం అలవర్చుకోవాలన్నారు. ఈ విందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు , మాజీ ముఖ్యమంత్రులు నాదెళ్ల భాస్కరరావు, కె.రోశయ్య, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కె.మధుసూదన చారి, మండలి చైర్మెన్ స్వామి గౌడ్, విపక్ష నేత కె.జానారెడ్డి, మండలి విపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, ఎండీ మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేటీఆర్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, చందూలాల్, నాయిని నరసింహా రెడ్డి, ఎంపీ కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, ఈఆర్‌సీ చైర్మెన్ ఇస్మాయిల్ అలీఖాన్, ఎమ్మెల్యేలు చింతల రామంచంద్రారెడ్డి, వివేకానంద, సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు సయ్యద్ అమీనుల్ జాఫ్రీ, పల్లారాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, మహమ్మద్ సలీం హాజరయ్యారు.
వైజాగ్‌లో ఉన్నందుకే చంద్రబాబు రాలేకపోయారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్‌లో ఉండడం వల్ల ఇఫ్తార్ విందుకు రాలేకపోయారని, ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని పంపించారని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఇఫ్తార్ విందు ముగింపు సందర్భంగా ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ పలు ప్రశ్నలకు బదులిచ్చారు. గవర్నర్ ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మంగళవారం టీడీపీ నేతలు వచ్చి తనను కలిశారని, గురువారం కాంగ్రెస్ నేతలు వచ్చి కలవనున్నారన్నారు. టీఎస్‌పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇఫ్తార్ విందుకు ఎందుకు హాజరు కాలేదో గురువారం ఆయన కలవడానికి వచ్చిప్పుడు ప్రశ్నిస్తానని సరదాగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు ముస్లింలు ఒక పొద్డు విడిచే సమయంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లు ముస్లిం సోదరులకు ఖజ్జూర పండ్లు, పళ్లు తినిపించారు.
రోశయ్యకు ప్రత్యేక పలకరింపు
గవర్నర్ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా పలకరించారు. రోశయ్య పక్కన కూర్చొని కొద్ది నిమిషాలు మాట్లాడారు. రోశయ్య ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారు.