విభజనకు ఓకే! | i never oppose bifurcation, says chandrababu naidu | Sakshi
Sakshi News home page

విభజనకు ఓకే!

Published Mon, Sep 23 2013 1:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM

విభజనకు ఓకే!

విభజనకు ఓకే!

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తనకు సమ్మతమేనని కాంగ్రెస్ అగ్రనేతలకు టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు స్పష్టం చేశారు. తెలంగాణకు అనకూలంగా తాను గతంలో రాసిన లేఖకు కట్టుబడి ఉంటానని కూడా వారికి చెప్పారు! విభజన ప్రక్రియలో కాంగ్రెస్‌కు పూర్తిగా సహకరిస్తానంటూ ఆదివారం ఢిల్లీ పెద్దలకు హామీ ఇచ్చారు. కాకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మరికొంత కాలం పాటు ఆలస్యం చేయాలని వారిని కోరారు.
 
 

‘విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో వెల్లువెత్తుతున్న ఆందోళనలు, భావోద్వేగాలు చల్లారేందుకు మీవంతుగా ఏవో కంటితుడుపు చర్యలు చేపట్టండి. తర్వాత ఏం చేయాలో నాకొదిలేయండి’ అని చెప్పుకొచ్చారు! మరోవైపు బాబు తన హస్తిన యాత్రకు అసలు లక్ష్యమైన ‘ఆపరేషన్ జగన్’ను వరుసగా రెండో రోజూ కొనసాగించారు. కాంగ్రెస్‌ను నోటితో మాత్రం తిడుతూ, చీకట్లో ఆ పార్టీతో అన్ని విషయాల్లోనూ చేతులు కలిపే తంత్రాన్ని కూడా యథావిధిగా పూర్తిస్థాయిలో ప్రదర్శించి అందరికీ వినోదం పంచారు! రాష్ట్రం అగ్నిగుండం కావడానికి కాంగ్రెసే కారణమంటూ పైకి విలేకరుల సమావేశంలో దునుమాడిన బాబు, లోలోపల మాత్రం కాంగ్రెస్ పెద్దలతో జోరుగా బేరసారాలు సాగించారు. ‘వైఎస్సార్‌సీపీ అధినేత బయటికొస్తే మీకూ (కాంగ్రెస్‌కు), మాకూ ఇబ్బందే.
 
 

మన రెండు పార్టీలకూ ఆంధ్రప్రదేశ్‌లో పుట్టగతులుండవు. కాబట్టి ఏదో ఒకటి చేసి ఆయనకు బెయిల్ రాకుండా మరికొంతకాలం అడ్డుకోండి. బదులుగా మీకు నేను కొన్నేళ్లుగా ఇస్తూ వస్తున్న మద్దతును ఇకపై కూడా యథాతథంగా కొనసాగిస్తాను’ అంటూ వారికి ప్రతిపాదించారు. ఒకవైపు ఇదంతా చేస్తూనే, మరోవైపు ఎందుకైనా మంచిదనే ‘ముందుచూపు’తో బీజేపీని దువ్వే ప్రయత్నాలకు కూడా బాబు పదును పెంచారు. ఆదివారం ఒక ప్రముఖ ఆంగ్ల చానల్‌తో మాట్లాడిన ఆయన, బీజేపీతో టీడీపీ చేతులు కలపనుందా అని ప్రశ్నించగా ఆ అవకాశాలను ఎంతమాత్రమూ తోసిపుచ్చలేదు! మరోవైపు జేడీ(యూ), సీపీఎం, సీపీఐ అగ్ర నేతలతోనూ ఆదివారం భేటీలు జరిపారు. తద్వారా మూడో ఫ్రంట్  ‘సావకాశాలను’ కూడా బేరీజు వేసుకుంటూ గడిపారు. అయితే బీజేపీతో దోస్తీ యత్నాలపై సదరు నేతలు బాబును కాస్త గట్టిగానే కడిగేసినట్టు సమాచారం!
 
 

రాహుల్ దూతలతో బాబు భేటీలు: రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఒక కాంగ్రెస్ నేతతో ఆదివారం ఉదయం బాబు అల్పాహారపు భేటీ జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాహుల్ కోర్ బృందం సభ్యునిగా ఇటీవలే పదోన్నతి పొందిన సదరు నేతతో గంటకు పైగా బాబు మంతనాలు సాగించారు. జగన్‌ను వీలైనంత కాలం జైల్లోనే ఉంచాల్సిందిగా ఆయన ద్వారా రాహుల్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చగలిగిన సంఖ్యాబలం ఉండి కూడా అలా చేయకపోగా, కొన్నేళ్లుగా దానికి అన్ని విషయాల్లోనూ తానెలా అండాదండగా ఉంటున్నదీ గుర్తు చేశారు. దాంతోపాటు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి వెళ్లిన రాహుల్ రాజకీయ సలహాదారుతో కూడా బాబు చర్చలు జరిపారు. సీమాంధ్రకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలే ఈ భేటీని కుదిర్చినట్టు తెలిసింది. ఆయనతో కూడా జగన్, తెలంగాణ అంశాలపైనే బాబు సుదీర్ఘంగా చర్చించారు.
 
 వీరితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో శనివారం రాత్రి పొద్దుపోయాక, కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరంతో ఆదివారం ఉదయం బాబు ఫోన్ మంతనాలు సాగించారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో తన భేటీకి ఎలాంటి ప్రాధాన్యతా లేదని వారికి ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. బీజేపీతో చేతులు కలపాలని టీడీపీ నేతల్లో పలువురి నుంచి తీవ్రంగా తనపై ఒత్తిళ్లు వస్తున్నాయని బాబు అంగీకరించినట్టు సమాచారం. కానీ తాను మాత్రం ఆ పార్టీతో ఎలాంటి ముందస్తు పొత్తులూ పెట్టుకోబోనని నమ్మబలికారంటున్నారు.
 
 ‘జగన్’పై జోక్యముండబోదన్న శరద్ యాదవ్
 
 జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఐ అగ్రనేత ఏబీ బర్ధన్‌లతో ఆదివారం బాబు భేటీ అయ్యారు. అయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ను అడ్డుకునే ప్రయత్నాలకు మద్దతివ్వాలని శరద్ యాదవ్‌ను కోరిన బాబుకు ఆయన చేతిలో చేదు అనుభవం ఎదురైంది. జగన్ అంశంలో తమ పార్టీ ఎలాంటి జోక్యమూ చేసుకోబోదని బాబు ముఖమ్మీదే శరద్ యాదవ్ కుండబద్దలు కొట్టారు. దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టులేనని స్పష్టం చేశారు. అంతేగాక ‘రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీ, విభజనకు అనుకూలంగా వైఖరి ప్రకటించిన పార్టీలదే బాధ్యత’ అని ఈ విషయంలో టీడీపీ వైఖరిని కూడా ఆయన పరోక్షంగా తప్పుబట్టారని తెలిసింది. సమస్యను చక్కదిద్దే బాధ్యత కూడా వాటిపైనే ఉందని చెప్పారంటున్నారు. మరోవైపు ఎన్డీఏకు, బీజేపీకి దగ్గరయ్యేందుకు బాబు చేస్తున్న ప్రయత్నాలను శరద్‌తో పాటు కారత్, బర్ధన్ తదితరులు ఆయనతోనే అన్యాపదేశంగా ప్రస్తావించారు. ‘ముందుగా మీ ప్రాథమ్యాలను సరిచూసుకోండి’ అంటూ వారు స్పష్టం చేసినట్టు కూడా తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement