టిడిపికి రెండు చోట్లా ఎదురుగాలే!
రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుసరించిన రెండుకళ్ల సిద్ధాంతం అసలుకే ఎసరు తెచ్చేట్లుగా మారింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబు సంపూర్ణ మద్దతు తెలపటంతో సీమాంధ్ర ప్రజలు ఆయన తీరుపై మండిపడుతున్నారు. ప్రజల ఆగ్రహావేశాల మధ్యనే ఎన్నికలకు సిద్ధం కావలసిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు చేసిన 'సమైక్యాంధ్ర పోరాటం'లో టీడీపీ ఓడిపోయిందని, అందుకు సీమాంధ్ర ప్రజలకు ఆ పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి క్షమాపణలు చెప్పినప్పటికీ, ఆ పార్టీ నేత చంద్రబాబు అనుసరించిన తీరుపై సీమాంధ్ర ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరో పక్క తెలుగుతమ్ముళ్ల వర్గపోరు చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సీమాంధ్రలో ఓ వైపు సమైక్యవాదుల భయం వెంటాడుతుంటే, మరోవైపు తెలుగుతమ్ముళ్ల అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ కంచుకోటలే బద్ధలవుతాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు అనంతపురం జిల్లా రాజకీయాలే ఉదాహరణగా చెబుతున్నారు.
అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2009 ఎన్నికల వరకు ఇక్కడ టీడీపీ అభ్యర్థులదే పైచేయి. 1985, 1989, 1994 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఈ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. 1996 జరిగిన ఉపఎన్నికల్లో ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అటువంటి హిందూపురంలో టిడిపి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబుపై ప్రస్తుతం హిందూపురం ప్రజలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. హిందూపురం పరిస్థితే ఇలా ఉంటే ఇక ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఏమిటా అని ఆ పార్టీ నేతలకు బెంగపట్టుకున్నట్లు సమాచారం.
జనం ఆగ్రహాన్ని చల్లార్చేందుకు, ఎన్టీఆర్ సెంటిమెంటును మరోసారి తెరపైకి తెచ్చేందుకు చంద్రబాబు వ్యూహాం పన్నుతున్నట్లు సమాచారం. అందుకే హిందూపురం నుంచి నందమూరి కుటుంబీకుల్లో ఒకరిని ఇక్కడి నుంచి పోటీ చేయించే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో స్థానికంగా టిక్కెట్లు ఆశించేవారిలో ఆందోళన మొదలైంది.
ఇక తెలంగాణలో టిడిపి పరిస్థితి మరీ ఆధ్వాన్నంగా తయారైంది. వచ్చే ఎన్నికలతో తెలంగాణలో టిడిపి ఖాళీ అయిపోతుందని ప్రచారం జరుగుతోంది. అధినేత వైఖరిపై తెలుగు తమ్ముళ్లు మండి పడుతున్నారు. పలువురు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి, అతడి సోదరుడు ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కేఎస్ రత్నం టిఆర్ఎస్లో చేరిపోయారు. ఇంకా అనేక మంది అదే ఆలోచనలో ఉన్నారు. అటువంటివారు టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణాలో తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్లిన సీనియర్ నేతలు ఇక టిడిపిలో కొనసాగడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదన్న ఆలోచనతో ఉన్నారు.
దానికితోడు మొన్న హెడ్‌లైన్స్ టుడే నిర్వహించిన సర్వేలో టీడీపీకి తెలంగాణలో 10 సీట్లు కూడా రావని తేలింది. తెలంగాణలో చంద్రబాబును మంచి సిఎంగా కేవలం 30 శాతం మంది ప్రజలు మాత్రమే అంగీకరించారు. ఈ నేపథ్యంలో టిడిపిని నమ్ముకుంటే తెలంగాణలో భవిష్యత్ ఉండదని ఆ ప్రాంత తెలుగు తమ్ముళ్లలో భయం మొదలైంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, నల్లగొండ జిల్లాలో ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, వరంగల్ జిల్లా నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మెదక్ జిల్లాలో బాబుమోహన్ టిడిపిని వీడతారని తెలుస్తోంది. ఈ రకంగా రెండు ప్రాంతాలలోనూ టిడిపికి ఎదురుగాలి వీస్తోంది.