సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితికి కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాలే కారణమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ సొంత వ్యవహారం కాదని, అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘సాగు, ఉద్యోగాలు, ఉపాధి, హైదరాబాద్ తదితరాలపై రెండు ప్రాంతాల ప్రజల్లో అపోహలు, కొన్ని వాస్తవాలున్నాయి. వాటిని చర్చిస్తే అపోహలు పోయి వాస్తవాలు బయటికొస్తాయి. కాబట్టి దీనిపై ఇరుప్రాంతాల వారూ కలిసి మాట్లాడుకోవాలి’’ అన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం సాయంత్రం బాబు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘విభజన సమస్యపై రాష్ట్రపతిని, పలు పార్టీల నేతలను కలిసిన మీరు, ఏమైనా పరిష్కార మార్గాన్ని చూపారా?’ అని ప్రశ్నించగా, అది తన చేతుల్లో లేదని బదులిచ్చారు.
అందరితో మాట్లాడి కేంద్రమే పరిష్కారాన్ని చూపాలన్నారు. తెలంగాణపై తాను యూ టర్న్, టీ టర్న్ తీసుకోలేదని, పీపుల్స్ టర్న్ తీసుకున్నానని చెప్పుకొచ్చారు. విభజనపై కాంగ్రెస్ డ్రామాలాడుతోందన్నారు. ఆ పార్టీలో టీఆర్‌ఎస్ విలీనమవుతోందని, వైఎస్సార్‌సీపీ కూడా ఎన్నికల ముందో, తర్వాతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుందని అన్నారు. ఎన్డీఏతో టీడీపీ పొత్తు అవకాశాలపై పలుమార్లు ప్రశ్నించినా రాజకీయాలు మాట్లాడనంటూ దాటవేశారు. విభజనను సమర్థిస్తున్నారా, లేదా సూటిగా చెప్పండని ప్రశ్నించిన విలేకరిని, ‘మీకు ఎంతమంది పిల్లలు?’ అంటూ బాబు ఎదురు ప్రశ్నించారు. ప్రెస్‌మీట్ జరుగుతుండగానే సీమాంధ్ర నేతలు కొందరు హాల్లోకి వచ్చి, ‘సమైక్యాంధ్ర’ అని బాబుతో చెప్పిం చాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు, టీడీపీ నేతలు వారికి సర్దిచెప్పి బయటకు పంపారు.