టీ లేఖపైనే నిలబడ్డాం: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు
సీమాంధ్రకు ప్యాకేజీ కంటితుడుపు చర్యే
లోటున్న ప్రాంతం మనుగడ ఎలా?
ఎన్నికలపై చర్చించేందుకు తెలంగాణ, సీమాంధ్ర నేతలతో భేటీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంశంలో అన్ని రాజకీయ పార్టీలు అటు ఇటూ అయినా తెలుగుదేశం ఎప్పుడూ చాలా స్పష్టంగా ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా పార్టీ ఇచ్చిన లేఖను ఎప్పుడూ వెనక్కి తీసుకోలేదని గుర్తుచేశారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎప్పుడూ తాను ప్రశ్నించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీనే విభజన ప్రక్రియలో కుట్ర పూరితంగా ఆలోచన చేసిందని విమర్శించారు. సీమాంధ్ర ప్రాంతానికి ప్యాకేజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కంటితుడుపు చర్యలను మాత్రమే చేపట్టిందని ఆరోపించారు. ఇంకా ఆయనేమన్నారంటే..
సీమాంధ్ర ప్రాంతానికి 17,435 కోట్ల రూపాయలు లోటు ఏర్పడుతుందని చెప్పారేకాని, అంత లోటున్నప్పుడు ఆ ప్రాంతం ఎలా మనుగడ సాధిస్తుందని ఆలోచించలేదు.
సీమాంధ్రకు హైదరాబాద్ కంటే పెద్ద రాజధానినే కట్టిపెడతామంటూ మాటలు చెప్పారేగానీ.. అలాంటి నగరానికి ఎంత ఖర్చు అవుతుందన్నది ఏ మాత్రం పట్టించుకోలేదు. విభజన ప్రక్రియ చేపడుతున్న మీకే చిత్తశుద్ధి లేనప్పుడు తరువాత అధికారంలోకి వచ్చేవారు ఎందుకు చేయాలి?
విద్యుత్, సాగునీరు వంటి అంశాల్లో పరస్పరం సహకరించుకోవాల్సిన రెండు ప్రాంతాల వారి మధ్య కాంగ్రెస్ పెద్దలు చిచ్చుపెట్టారు.
తండ్రిలా వ్యవహరించాల్సిన కేంద్రం కొందరి విషయంలో దుర్మార్గంగా కట్టుబట్టలతో బయటకు పోయేలా వ్యవహరించింది.
రాష్ట్ర విభజనకు ఆమోదం అనంతర పరిణామాలు, వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు శనివారం తెలంగాణ, సోమవారం సీమాంధ్ర ప్రాంత నేతలతో వేరువేరు సమావేశం నిర్వహిస్తున్నా.
విలేకరుల సమావేశానికి చంద్రబాబు సాక్షి ప్రతినిధిని ఆహ్వానించలేదు. సాక్షి ప్రతినిధిని ఆహ్వానించి ఉంటే టీడీపీ అధినేతకు ఈ ప్రశ్నలు వేసి సమాధానం కోరేది.
1. విభజన తీరును తప్పుపడుతున్నామని మీరంటున్నారు. ఈ బిల్లుకు ఉభయ సభల్లోనూ మీ పార్టీ ఎంపీలు మద్దతు తెలిపారు. అలాంటి వారిపై మీరెందుకు చర్య తీసుకోవడం లేదు?
2. విభజన ప్రక్రియ సామరస్య పూర్వకంగా లేదని విమర్శలు చేస్తున్న మీరు... మీ పార్టీకే చెందిన రెండు ప్రాంతాల ఎంపీలు (నామా నాగేశ్వరరావు, మోదుగుల) ఒకరు అనుకూలంగా మరొకరు వ్యతిరేకంగా లోక్‌సభ సాక్షిగా పరస్పరం దాడులు చేసుకున్నా మౌనం పాటించారెందుకు?
3. మీరు ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు తెలంగాణ ఇవ్వాలంటున్నారా? వద్దంటున్నారా? అని జాతీయ మీడియా అడిగితే సమాధానం చెప్పకుండా సమన్యాయం కావాలని చెప్పారు. అప్పటినుంచి ఇప్పటివరకు సమన్యాయమంటే ఏంటో చెప్పలేదని మిగిలిన అన్ని పక్షాలు ప్రశ్నిస్తున్నా మీరెందుకు స్పందించలేదు?