ఛాలెంజ్.. పళనీ ప్రభుత్వం ఇంటికే..: దినకరన్
చెన్నై: తాను తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతానని అన్నాడీఎంకే బహిష్కృతనేత టీటీవీ దినకరన్ శపథం చేశారు. తమిళనాడు ప్రజలను, కార్యకర్తలను ముఖ్యమంత్రి పళనీ స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం దారుణంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సమావేశమైన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ పార్టీ చీఫ్, డిప్యూటీ చీఫ్ పదవుల నుంచి శశికళ, దినకరన్‌లను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దినకరన్ మధురై నుంచి మీడియాతో మాట్లాడుతూ..
‘నేను ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాను. పళని స్వామికి ఎవరూ ఓటేయలేదు. మరోసారి మేం అమ్మ పరిపాలనను తీసుకొస్తాం. పోటీ అనేది మాకు, డీఎంకేకి మధ్య మాత్రమే పోరాటం జరుగుతుంది. పళనీస్వామిని సీఎం కుర్చీలో నేను చూడలేను. పన్నీర్ సెల్వం కారణంగా మా ఎన్నికల గుర్తు పోయింది. కార్యకర్తలు మా వెంటే ఉన్నారు. మేం పన్నీర్, పళనిలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. వారికి కావాల్సిందల్లా పదవిలో ఉండటం.. దానిని అనుభవించడం మాత్రమే. నేనే నిజమైన అమ్మ వారసుడిని.. ప్రజలు కూడా నన్నే అమ్మ విశ్వసనీయుడిగా పరిగణిస్తారు. వారికి బలమే లేదు. ఆ విషయం కోర్టు తేలుస్తుంది. ఇప్పటికే 21మంది ఎమ్మెల్యేలకు పళనీస్వామిపై తమకు నమ్మకం లేదని గవర్నర్‌కు లేఖ పంపించాం.
నిజంగా వారికి మెజారిటీ ఉంటే బలపరీక్షకు దిగాలి. ఒక వేళ నిజంగా ఆయన సీఎం కాగలిగితే సీఎం పదవికి రాజనామా చేసి మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావచ్చుకదా. దమ్ముంటే మీరు ఎన్నికలు రండి.. నేను సవాల్ చేస్తున్నా. ఈ ప్రభుత్వానికి ఈ 117మంది ఎమ్మెల్యేల బలం లేదని ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని దినకరన్ చెప్పారు. మరోపక్క, అసలు తమను విమర్శించడానికి దినకరన్‌కు ఎలాంటి అర్హత లేదని సీఎం పళనీస్వామి అన్నారు. ‘‘మమ్మల్ని విమర్శించడానికి దినకరన్‌కు ఎలాంటి అర్హత లేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆయనను 10 యేళ్ల నుంచి పార్టీకి దూరంగా ఉంచారు’ అని గుర్తు చేశారు.