న్యూఢిల్లీ : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి భారతావని నీరాజనాలు అందుకున్న భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్ మరోసారి దేశ సేవ పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు. నాలుగు వారాల పాటు సెలవులు లభించినప్పటికీ ఇంట్లో గడపకుండా తన స్క్వాడ్రాన్‌తో కలిసి ఉండటానికే మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఆయన శ్రీనగర్‌లోని వాయుదళం చెంతకు చేరుకున్నట్లు సమాచారం. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్నారు.(చదవండి : ఎవరీ విక్రమ్ అభినందన్?)
ఈ నేపథ్యంలో శత్రు సైన్యం చెర నుంచి విముక్తి పొందిన అభినందన్ మానసిక స్థితిని విశ్లేషించేందుకు డీబ్రీఫింగ్ సెషన్(తీవ్రమైన ఒత్తిడికి గురైన సైనికుడికి నిర్వహించే వైద్య పరీక్షలు) నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని అభినందన్‌కు వైద్యులు సూచించారు. ఆర్మీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో దాదాపు రెండు వారాల పాటు వైద్య పరీక్షలన్నీ పూర్తైన అనంతరం 12 రోజుల క్రితం ఆయనకు సెలవు ఇచ్చారు. ఈ క్రమంలో కుటుంబంతో గడిపేందుకు అభినందన్ చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అయితే చెన్నైకి వెళ్లకుండా తన స్క్వాడ్రాన్, మిషన్లతో కలిసి పనిచేయడమే తనకు ఇష్టమని ఆయన చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.(చదవండి : ‘అభినందన్ దగ్గర గన్ లేకుంటే కొట్టి చంపేవాళ్లం’)
కాగా ప్రస్తుతం అభినందన్ అభీష్టం ప్రకారం ఆయన శ్రీనగర్ చేరుకున్నప్పటికీ నాలుగు వారాల సిక్ పీరియడ్ పూర్తైన తర్వాత మెడికల్ బోర్డు ఆయనకు మరోసారి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తుంది. వీటి ఫలితంపైనే అభినందన్ యుద్ధ విమానాన్ని నడపగలరా లేదా అన్న విషయం ఆధారపడి ఉంటుంది.(పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..!)
Comments
Please login to add a commentAdd a comment