పాకిస్తాన్‌కు వార్నింగ్‌ ఇచ్చా | Narendra Modi warned Pakistan of consequences if Abhinandan Varthaman not returned | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు వార్నింగ్‌ ఇచ్చా

Published Mon, Apr 22 2019 3:51 AM | Last Updated on Mon, Apr 22 2019 3:52 AM

Narendra Modi warned Pakistan of consequences if Abhinandan Varthaman not returned - Sakshi

పటన్‌/జైపూర్‌: పాకిస్తాన్‌కు తాము చేసిన తీవ్ర హెచ్చరికల ఫలితంగానే భారత వైమానిక దళ(ఐఏఎఫ్‌) పైలట్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్తమాన్‌ను సురక్షితంగా వెనక్కి పంపించిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో ఉగ్రవాదం అంతం కావాలంటే బీజేపీకే ఓటేయాలని ప్రజలను కోరారు. గుజరాత్‌లోని అన్ని స్థానాల్లోనూ బీజేపీనే గెలిపించాలని, లేకుంటే దేశవ్యాప్తంగా అదే పెద్ద చర్చకు దారి తీస్తుందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని పటన్, రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని ప్రసంగించారు.

బాలాకోట్‌ దాడి అనంతరం పాక్‌ ప్రతీకార యత్నం, ఆ దేశ ఎఫ్‌–16 విమానాన్ని కూల్చివేసే క్రమంలో అభినందన్‌ పాక్‌ సైన్యానికి పట్టుబడటం, ఆ తర్వాత విడుదలైన తీరును ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘అభినందన్‌ శత్రుదేశానికి పట్టుబడటంపై ప్రతిపక్షాలు నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాయి. దీంతో ప్రధాని పదవి ఉన్నా పోయినా ఒకటే. అయితే నేనైనా ఉండాలి లేదా ఉగ్రవాదులైనా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే, మీడియా సమావేశం పెట్టి, మా పైలట్‌కు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని, ఆ తర్వాత మోదీ ఏం చేశాడో మీరు ప్రపంచానికి చెప్పుకోవాల్సి ఉంటుందని పాక్‌ను హెచ్చరించా. ‘పాక్‌పై దాడి చేసేందుకు మోదీ వద్ద 12 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. దాడి జరిగితే పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అంటూ ఆ మరునాడే అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. దీంతో దిగివచ్చిన పాక్, అభినందన్‌ను వెనక్కి పంపుతున్నట్లు ప్రకటించింది. లేకుంటే పాక్‌కు ఆ రాత్రి కాళరాత్రే అయి ఉండేది’ అని మోదీ వ్యాఖ్యానించారు.

‘పుల్వామా ఘటన అనంతరం ప్రజలు మోదీ నుంచి ఏం ఆశించారు? ముంబై ఉగ్రదాడుల తర్వాత మన్మోహన్‌సింగ్‌ మాదిరిగా వ్యవహరించి ఉంటే దేశం నన్ను క్షమించేదా? అందుకే సైన్యానికి పూర్తి అధికారాలిచ్చా. పాకిస్తాన్‌ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ, హనుమాన్‌ భక్తుల్లాగా మన వాళ్లు బాలాకోట్‌పై విరుచుకుపడి, వాళ్ల అంతు చూశారు’ అని తెలిపారు. బాలాకోట్‌ దాడి ప్రతిపక్షాలకు అసౌకర్యంగా మారిందన్న ప్రధాని..భారత్‌ తమపై దాడి చేసిందంటూ పాక్‌ పదేపదే చెబుతుంటే మన ప్రతిపక్షాలు కూడా బాలాకోట్‌ భారత్‌లోనే ఉందన్నట్టుగా ఆధారాలు చూపాలంటూ గగ్గోలు పెట్టాయని ఆరోపించారు.  ప్రధాని మోదీ ఎప్పుడు ఎలా స్పందిస్తారోనని తనకు భయంగా ఉందన్న ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. ‘రేపు మోదీ ఏం చేస్తాడో శరద్‌ పవార్‌కే తెలియనప్పుడు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎలా తెలుస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. శరద్‌పవార్‌ తనకు రాజకీయ గురువు అని గతంలో ప్రధాని మోదీ ప్రకటించారు.

కమలంతో ఉగ్రవాదం అంతం
‘కష్ట సమయంలో శ్రీలంక ప్రజలకు తోడుగా ఉంటాం. వారికి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధం’ అని ప్రకటించారు. ‘మీరు పోలింగ్‌ బూత్‌కు వెళ్లి, కమలం(బీజేపీ ఎన్నికల చిహ్నం) గుర్తు మీట నొక్కేటప్పుడు.. అది ఉగ్రవాదాన్ని అంతం చేసే మీట అని గుర్తుంచుకోండి. మీ వేలికి అంతటి శక్తి ఉంది. మీరు మీట నొక్కడం ద్వారా ఉగ్రవాదంపై పోరాడాలన్న నా సంకల్పం బలపడుతుంది’ అని అన్నారు.

అన్ని సీట్లూ నాకే ఇవ్వండి
బీజేపీని గెలిపించాలని గుజరాత్‌ ప్రజలను కోరిన ప్రధాని.. ‘ఈ గడ్డపై పుట్టిన బిడ్డ యోగక్షేమాలు చూసుకోవడం నా సొంత రాష్ట్రం ప్రజల ధర్మం. రాష్ట్రంలోని 26 లోక్‌సభ స్థానాలను నాకు ఇవ్వండి. మీ సహకారంతో నా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది. ఒకవేళ మీరు బీజేపీకి 26 సీట్లు ఇవ్వకుంటే ఎందుకలా జరిగిందంటూ మే 23వ తేదీ(ఎన్నికల ఫలితాల రోజు)న టీవీల్లో చర్చలు మొదలవుతాయి’ అని పేర్కొన్నారు.
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో అభిమానులు బహూకరించిన తన చిత్తరువుతో ప్రధాని మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement