![Modi Said Some People Lose Their Sleep When India Hits Back At Terrorists - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/5/narendra_modi.jpeg.webp?itok=tuGJVZyf)
లక్నో : భారత్ ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం చెప్పడం కొందరికి నచ్చడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యనించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ ప్రతిపక్షాల మీద విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగిస్తూ.. ఉగ్రదాడి జరిగాక నేను మౌనంగా ఉండలా.. లేదా ప్రతి దాడి చేయాలా అంటూ పుల్వామా ఉగ్రదాడిని ఉద్దేశిస్తూ జనాలను ప్రశ్నించారు.
అనంతరం ఆయన కొనసాగిస్తూ.. ‘ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం చెప్పాం. కానీ భారత దేశ చర్యల వల్ల కొందరికి నిద్ర కరువయ్యింది. పాకిస్తాన్ భారత్ చేసిన మెరుపు దాడుల గురించి ప్రపంచ దేశాల ముందు చర్చించినప్పుడు వీరు పాక్‌కు మద్దతుగా మాట్లాడారు’ అని ఆరోపించారు. అంతేకాక కాంగ్రెస్ కావచ్చు.. ఎస్పీ, బీఎస్పీ పార్టీ ఏదైనా సరే వారు ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో మాయావతి, అఖిలేశ్ యాదవ్‌లు ఉగ్రవాదులుగా అనుమానించబడే వ్యక్తులను విడుదల చేశారని ఆరోపించారు.
తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో దేశం తలవంపులకు గురయ్యే పని ఒక్కటి కూడా చేయలేదని మోదీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో యూఏఈ ప్రభుత్వం తనకు బహుకరించిన జాయేద్ మెడల్ గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం మోదీకి దక్కిన గౌరవం కాదు.. ఇది భారత ప్రజలకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment