సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మా గాంధీపై ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరి చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వివరణ ఇచ్చారు. గాడ్సేకు కృతజ్ఞతలు అంటూ పదిహేను రోజుల కిందట ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ‘మన కరెన్సీపై గాంధీ ముఖాన్ని తొలగించడం, ప్రపంచవ్యాప్తంగా ఆయన విగ్రహాలను రూపుమాపడం, ఆయన పేరిట నెలకొల్పిన సంస్ధలు, రహదారుల పేర్లు మార్చడం ఇప్పుడు తక్షణం మనం చేయాల్సిన పని..ఇదే మనం ఆయనకు ఇచ్చే ఘననివాళి..థ్యాంక్యూ గాడ్సే’ అంటూ ఆమె చేసిన ట్వీట్ కలకలం రేపింది. విమర్శలు వెల్లువెత్తడంతో ట్వీట్‌ను ఆమె తొలగించారు. నిధి చౌదరిని ప్రభుత్వ సర్వీసు నుంచి సస్పెండ్ చేయాలని ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ డిమాండ్ చేశారు.
కాగా, గాంధీని అవమానించే వారిపై తన తీవ్ర ఆగ్రహం, ఆందోళనకు తన ట్వీట్ అద్దం పడుతుందని ఆమె వ్యాఖ్యానించారు. గాంధీజీకి ప్రజలు తమదైన భిన్న రీతుల్లో నివాళులు అర్పిస్తుంటారని చెప్పుకొచ్చారు. గాంధీజీ 150 జయంతోత్సవాలను ప్రపంచమంతా జరుపుకునే సమయంలో కొన్ని శక్తులు మహాత్మ గాంధీని కించపరిచేలా, ఆయన అందించిన ఘన వారసత్వాన్ని నిర్మూలించేలా నాథూరాం గాడ్సేను కొనియాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను పదిహేను రోజుల కిందట చేసిన ట్వీట్‌పై ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని నిధి చౌదరి ప్రశ్నించారు. తాను గాంధీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయలేదని, తాను మహాత్ముడి అడుగుజాడల్లో నడుస్తానని, ఆయన ఆటోబయోగ్రఫీ తనకు ఇష్టమైన పుస్తకమని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment