
'నేను టార్గెట్ అయితే.. నేరుగా ఎదుర్కోండి'
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకోవాలనుకుంటే నేరుగా తననే ఎదుర్కోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన కుటుంబంపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం, ఆయన సన్నిహితుల సంస్థలపై మంగళవారం ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.
'కేంద్ర ప్రభుత్వం నన్ను లక్ష్యంగా చేసుకోవాలనుకుంటే నేరుగా ఎదుర్కోవాలి. అంతేకాని నా కుమారుడి స్నేహితులను వేధించరాదు. వారి వ్యాపారాలకు రాజకీయాలతో సంబంధం లేదు' అని చిదంబరం అన్నారు. కేంద్ర ప్రభుత్వ దాడులను ఎదుర్కొనేందుకు తాను, తన కుటుంబ సబ్యులు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చెన్నైలో కార్తీ చిదంబరం సీఈవోగా ఉన్న సంస్థలపై ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేశారు.