ఇంద్రాణీ ముఖర్జీ, పీటర్
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా వ్యవస్థాపకులు ఇంద్రాణీ ముఖర్జీ–పీటర్ ఈ మనీలాండరింగ్ కేసులో అప్రూవర్లుగా మారడంతో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మెడకు ఉచ్చు బిగుసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) కోసం అనుమతులు ఇవ్వాలంటే తన కుమారుడు కార్తీకి వ్యాపారంలో సహకరించాలని 2008లో అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కోరినట్లు ఇంద్రాణీ, పీటర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.
తన కుమారుడికి సాయం చేస్తే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) నుంచి అనుమతులు వచ్చేస్తాయని చిదంబరం చెప్పారన్నారు. దీంతో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో తాము కార్తీతో సమావేశమయ్యామనీ, ఈ సందర్భంగా తనకు 10 లక్షల డాలర్లు చెల్లిస్తే ఎఫ్‌ఐడీల కోసం అనుమతులు లభిస్తాయని కార్తీ చెప్పినట్లు ఇంద్రాణి ముఖర్జీ వెల్లడించారు. కార్తీకి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కంపెనీ ఖాతాలో రూ.10 లక్షలు జమచేసినట్లు పీటర్ ముఖర్జీ వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని ‘క్విడ్ ప్రో కో’గా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభివర్ణించింది. అయితే 10 లక్షల డాలర్లలో మిగతా మొత్తాన్ని ఇంద్రాణీ–పీటర్‌లు కార్తీకి చెల్లించారా? లేదా? అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.
ఇంద్రాణీ–పీటర్
ముఖర్జీలు ఎవరో తెలియదు
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐ అధికారులు పి.చిదంబరాన్ని అరెస్ట్ చేశారని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం తెలిపారు. చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్న కార్తీ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీలను కలుసుకోలేదు. సీబీఐ విచారణలో భాగంగా ఓసారి బైకుల్లా జైలులో కలిశా. అలాగే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ)లో ఎవ్వరితోనూ నేను భేటీకాలేదు. కాంగ్రెస్ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment