
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 5న తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేయకుండా కల్పించిన తాత్కాలిక రక్షణ గడువును వచ్చే గురువారం వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. వచ్చే సోమవారం వరకు చిదంబరానికి సీబీఐ కస్టడీ కొనసాగుతుందని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో తమ ముందుంచాలని ఈడీని ఆదేశించింది.
చిదంబరం అరెస్టు శుభవార్తే: ఇంద్రాణి
చిదంబరం అరెస్టుపై ఐఎన్‌ఎక్స్ మీడియా మాజీ ప్రమోటర్ ఇంద్రాణి ముఖర్జియా స్పందించారు. ఐఎన్‌ఎక్స్ కేసులో చిదంబరం అరెస్టు కావడం శుభవార్తే అని వ్యాఖ్యానించారు. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఇంద్రాణిని గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐఎన్‌ఎక్స్ కేసులో చిదంబరాన్ని అన్ని వైపుల నుంచి కట్టడి చేశారని అన్నారు. ఇదే కేసులో కార్తీ చిదంబరానికి మంజూరు చేసిన బెయిల్‌ను కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఇంద్రాణి అప్రూవర్‌గా మారడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment