indrani mukherjia
-
పీటర్ ముఖర్జియా విడుదల
ముంబై: 2012నాటి సంచలన షీనా బోరా హత్య కేసులో గత నాలుగేళ్లుగా జైళ్లో ఉంటున్న పీటర్ ముఖర్జియాకు శుక్రవారం విడుదల అయ్యారు. బాంబే హైకోర్టు ఆయనకు ఫిబ్రవరిలోనే బెయిల్ ఇచ్చినప్పటికీ.. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఆరువారాల పాటు ఆ బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఆ స్టే గడువు గురువారంతో ముగిసింది. సీబీఐ అప్పీల్ చేసుకోకపోవడంతో ఆయన శుక్రవారం విడుదల అయ్యారు. సొంత కూతురు హత్యకు సంబంధించిన ఈ కేసులో ముఖర్జియా మాజీ భార్య ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన ముద్దాయి. పీటర్ ముఖర్జియా ఈ నేరంలో పాలు పంచుకున్నట్లుగా ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని బెయిల్ ఉత్తర్వుల్లో బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. -
చిదంబరం కేసులో 5న సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 5న తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేయకుండా కల్పించిన తాత్కాలిక రక్షణ గడువును వచ్చే గురువారం వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. వచ్చే సోమవారం వరకు చిదంబరానికి సీబీఐ కస్టడీ కొనసాగుతుందని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని ఈడీని ఆదేశించింది. చిదంబరం అరెస్టు శుభవార్తే: ఇంద్రాణి చిదంబరం అరెస్టుపై ఐఎన్ఎక్స్ మీడియా మాజీ ప్రమోటర్ ఇంద్రాణి ముఖర్జియా స్పందించారు. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం అరెస్టు కావడం శుభవార్తే అని వ్యాఖ్యానించారు. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఇంద్రాణిని గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరాన్ని అన్ని వైపుల నుంచి కట్టడి చేశారని అన్నారు. ఇదే కేసులో కార్తీ చిదంబరానికి మంజూరు చేసిన బెయిల్‌ను కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇంద్రాణి అప్రూవర్‌గా మారడం తెల్సిందే. -
వారి వాంగ్మూలంతో బిగిసిన ఉచ్చు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా వ్యవస్థాపకులు ఇంద్రాణీ ముఖర్జీ–పీటర్ ఈ మనీలాండరింగ్ కేసులో అప్రూవర్లుగా మారడంతో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మెడకు ఉచ్చు బిగుసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) కోసం అనుమతులు ఇవ్వాలంటే తన కుమారుడు కార్తీకి వ్యాపారంలో సహకరించాలని 2008లో అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కోరినట్లు ఇంద్రాణీ, పీటర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. తన కుమారుడికి సాయం చేస్తే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) నుంచి అనుమతులు వచ్చేస్తాయని చిదంబరం చెప్పారన్నారు. దీంతో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తాము కార్తీతో సమావేశమయ్యామనీ, ఈ సందర్భంగా తనకు 10 లక్షల డాలర్లు చెల్లిస్తే ఎఫ్‌ఐడీల కోసం అనుమతులు లభిస్తాయని కార్తీ చెప్పినట్లు ఇంద్రాణి ముఖర్జీ వెల్లడించారు. కార్తీకి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కంపెనీ ఖాతాలో రూ.10 లక్షలు జమచేసినట్లు పీటర్ ముఖర్జీ వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని ‘క్విడ్ ప్రో కో’గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభివర్ణించింది. అయితే 10 లక్షల డాలర్లలో మిగతా మొత్తాన్ని ఇంద్రాణీ–పీటర్లు కార్తీకి చెల్లించారా? లేదా? అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ఇంద్రాణీ–పీటర్ ముఖర్జీలు ఎవరో తెలియదు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐ అధికారులు పి.చిదంబరాన్ని అరెస్ట్ చేశారని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం తెలిపారు. చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్న కార్తీ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీలను కలుసుకోలేదు. సీబీఐ విచారణలో భాగంగా ఓసారి బైకుల్లా జైలులో కలిశా. అలాగే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ)లో ఎవ్వరితోనూ నేను భేటీకాలేదు. కాంగ్రెస్ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. -
సీబీఐ కస్టడీకి..చిదంబరం
కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి నాలుగు రోజుల (ఆగస్టు 26 వరకు) సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో.. గురువారం మధ్యాహ్నమే చిదంబరాన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ.. అది సాయంత్రం వరకు పొడిగించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనంతరం గంటన్నరసేపు న్యాయమూర్తి అజయ్ కుమార్ చౌహాన్ ఇరువర్గాల వాదనలు విన్నారు. పదే పదే అవే ప్రశ్నలతో విసిగిస్తున్నారని చిదంబరం తరపు న్యాయవాదులు కపిల్ సిబల్, సింఘ్వీలు పేర్కొనగా.. కీలకమైన ప్రశ్నలకు ఆయన ఉద్దేశపూర్వకంగానే సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ వాదించారు. వాదనల తర్వాత.. లోతైన దర్యాప్తు కోసం చిదంబరాన్ని నాలుగురోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అంతకుముందు చిదంబరాన్ని సీబీఐ అధికారులు నాలుగు గంటలపాటు విచారించారు. న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య బుధవారం అరెస్టైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంకు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆయనను ఆగస్ట్ 26 వరకు(నాలుగు రోజులు) సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. ‘చిదంబరంపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. లోతైన దర్యాప్తు అవసరం. సంబంధిత పత్రాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అందువల్ల కస్టడీలో ఉంచి విచారణ జరపడం తప్పనిసరని విశ్వసిస్తున్నాం’ అని ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ స్పష్టం చేశారు. చిదంబరంను కొత్తగా అడిగేందుకు సీబీఐ వద్ద ప్రశ్నలేవీ లేవని, బుధవారం ఉదయం గతంలో విచారణ సందర్భంగా వేసిన ప్రశ్నలనే మళ్లీ అడిగారని, అందువల్ల కస్టడీ అవసరం లేదని చిదంబరం తరఫు న్యాయవాదులు చేసిన వాదనను ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. సీబీఐ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతీరోజు అరగంట పాటు చిదంబరంను ఆయన కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలుసుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. కాగా, చిదంబరం అరెస్ట్‌పై రాజకీయం మరింత వేడెక్కింది. ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప మరేం కాదని, ఈ కేసులో చార్జిషీటు వేసేందుకు అవసరమైన ఆధారాలు సీబీఐ వద్ద లేవని కాంగ్రెస్ ఆరోపించింది. చట్టం తనపని తాను చేసుకుపోతోందని బీజేపీ పేర్కొంది. జవాబులను దాటవేస్తున్నారు.. ముందస్తు బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన, అరెస్ట్ నుంచి తక్షణ ఊరట కల్పించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. హైడ్రామా అనంతరం బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితుల నడుమ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సీబీఐ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సీబీఐ గెస్ట్‌హౌజ్‌లో ఆ రాత్రి ఉంచారు. గురువారం ఉదయం నుంచి నాలుగు గంటలపాటు పలు దఫాలుగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే, చాలా ప్రశ్నలను చిదంబరం దాటవేశారని, కొన్ని ప్రశ్నలకు ముక్తసరిగా జవాబిచ్చారని సీబీఐ వర్గాలు తెలిపాయి. చిదంబరం ఖండించిన కొన్ని అంశాలకు సంబంధించిన ఆధారాలను అధికారులు ఆయనకు చూపడంతో.. ఆయన మౌనం దాల్చారని వెల్లడించాయి. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో పటిష్ట భద్రత మధ్య చిదంబరంను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తి, చిదంబరం తరఫు న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ తదితరులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. కోర్టులో దాదాపు గంటన్నరకు పైగా వాడి వేడి వాదనలు కొనసాగాయి. చిదంబరం కస్టడీ అవసరం లేదని, ఆయన బెయిల్‌కు అర్హుడని సిబల్, సింఘ్వీ వాదించగా.. కేసుకు సంబంధించిన మరింత లోతైన కుట్ర మూలాలను వెలికి తీసేందుకు, చిదంబరం దగ్గరున్న రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు కనీసం 5 రోజుల కస్టడీ అవసరమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ వాదనలను తిప్పికొట్టారు. అనంతరం తీర్పు రిజర్వ్‌లో ఉంచిన న్యాయమూర్తి.. సాయంత్రం 7 గంటల సమయంలో చిదంబరంను 4 రోజులు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చారు. అనంతరం చిదంబరంను మళ్లీ సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. వాదనలు ఇలా.. సిబల్, సింఘ్వీ (చిదంబరం తరఫున) ► ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన ఇతర నిందితులందరూ.. చిదంబరం కొడుకు కార్తి సహా బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్టైన వ్యక్తి కార్తికి చార్టర్డ్ అకౌంటెంట్ అయిన భాస్కర్ రామన్. ఆయన బెయిల్‌పై ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ వేరే కేసులో జైలులో ఉన్నారు. అంటే ఈ కేసుకు సంబంధించి వారు బెయిల్‌పై ఉన్నట్లే భావించాలి. ► విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్ఐపీబీ)కి అనుమతులు ఇచ్చింది సీనియర్ అధికారులు. వారెవ్వరినీ అరెస్ట్ చేయలేదు. ► బెయిల్ మంజూరు అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమే. ► చిదంబరం విదేశాలకు పారిపోయే వ్యక్తి కాదు. ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని సీబీఐ కూడా చెప్పడం లేదు. ► ఈ కేసు అంతా అప్రూవర్ గా మారిన ఇంద్రాణి ముఖర్జీ చెప్పిన విషయాలపైనే ఆధారపడి ఉంది. ► తాను ఏం వినాలనుకుంటోందో.. అదే చిదంబరం చెప్పాలని సీబీఐ కోరుతోంది. అది సాధ్యం కాదు. ► జవాబులు దాటవేస్తున్నారనే కారణం చూపి కస్టడీ కోరడం సరికాదు. ► కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే కస్టడీ లోకి తీసుకోవాలి. ఈ కేసులో అలా అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన అంశాలేవీ లేవు. ► చిదంబరంను గతంలో విచారణ సందర్భంగా అడిగిన పాత ప్రశ్నలనే బుధవారం కూడా మళ్లీమళ్లీ అడిగారు. ► సీబీఐ చెప్పేవన్నీ వాస్తవాలే అని అనుకోకూడదు. ► ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నట్లయితే తమకు అందజేయాలని కోరుతూ చిదంబరంకు సీబీఐ లేఖ రాస్తే సరిపోయేది. సొలిసిటర్ జనరల్ తుషార్ (సీబీఐ తరఫున) ► చిదంబరం సరిగ్గా సమాధానాలివ్వలేదు. కొన్నింటికి డొంకతిరుగుడు సమాధానాలిచ్చారు. విచారణలో సీబీఐకి సహకరించలేదు కనుక కస్టడీ అవసరం. ► చిదంబరంతో సీబీఐ నేరాన్ని ఒప్పించడం లేదు.. కేసు మూలాలను తెలుసుకోవాలని మాత్రమే ప్రయత్నిస్తోంది. ► ఈ కుంభకోణంలో ఇతరులతో కలిసి నేరపూరిత కుట్రలో చిదంబరం భాగస్వామి. ► ఇది చాలా సీరియస్ కేసు. ఇందులో తెలివైన వాళ్లు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేసు మూలాల్లోకి వెళ్లలేకపోతే మాకు వైఫల్యమే ఎదురవుతుంది. ► గతంలో కార్తిని కూడా కస్టడీలోకి తీసుకునే విచారణ జరిపాం. ► చిదంబరం చాలా తెలివైనవాడు. ఈ కేసు విచారణలో సహకరించకుండా ఉండేందుకు ఆయనకు చాలా మార్గాలున్నాయి. ► ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ ఓపెన్ కోర్టులో బహిరంగంగా వెల్లడించలేం. ► చట్టం ముందు అంతా సమానమే. ► చిదంబరం తరఫున సమర్థులైన న్యాయవాదులున్నారు. కాబట్టి ఆయన సొంతంగా వాదించుకోవాల్సిన అవసరం లేదు. ► చిదంబరం ముందస్తు బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. నగదు అక్రమ చలామణికి సంబంధించి ఈ కేసు గొప్ప ఉదాహరణ అని స్పష్టమవుతోంది అని ఢిల్లీ హైకోర్టు అభివర్ణించింది. చిదంబరం ప్రధాన నిందితుడనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయంది. ► ఈ కేసులో చోటు చేసుకున్న క్విడ్ ప్రోకొ విషయాలు, కుట్ర అంశాలు తేలాల్సి ఉంది. ఆధారాలను చిదంబరం ముందు ఉంచి ప్రశ్నించాల్సి ఉంది. అందువల్ల ఆయన కస్టడీ చాలా అవసరం. 4 గంటలు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గురువారం ఉదయం దాదాపు 4 గంటల పాటు చిదంబరంను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతులు, ఐఎన్ఎక్స్ మీడియా ప్రమోటర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలతో పరిచయం, వారితో జరిపిన సమావేశాలు, కార్తికి చెందిన చెస్ మేనేజ్మెంట్ అండ్ అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ సంస్థ.. తదితర విషయాలపై డెప్యూటీ ఎస్పీ ఆర్ పార్థసారథి నేతృత్వంలోని అధికారుల బృందం ఆయనను లోతుగా ప్రశ్నించింది. అయితే, వారి ప్రశ్నలకు చిదంబరం సూటిగా జవాబివ్వలేదని, చాలా ప్రశ్నలకు అసలు సమాధానమే ఇవ్వలేదని, కొన్ని ప్రశ్నలను దాటవేశారని, మరికొన్ని ప్రశ్నలకు డొంకతిరుగుడుగా జవాబిచ్చారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదే కేసుకు సంబంధించి చిదంబరంను గత సంవత్సరం కూడా ఒకసారి ప్రశ్నించారు. బుధవారం రాత్రి ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం చిదంబరంను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడి గెస్ట్‌హౌజ్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న సూట్ నంబర్ 5ను ఆయనకు కేటాయించారు. గురువారం ఉదయం అల్పాహారం అనంతరం 10.20 గంటల సమయంలో ఇంటరాగేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. భవనంలోకి మీడియాను కూడా పరిమితంగానే అనుమతించారు. వారి వాంగ్మూలంతో బిగిసిన ఉచ్చు కోర్టు ముందు భారీ బందోబస్తు కోర్టు విచారణ తర్వాత చిదంబరంను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తున్న అధికారులు చిదంబరంను కోర్టుకు తీసుకొస్తున్న కారు ట్రాఫిక్‌లో చిక్కుకున్న దృశ్యం -
‘ఇంద్రాణి స్టేట్మెంట్తో చిదంబరానికి చిక్కులు’
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం అరెస్ట్‌పై సీబీఐ, కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఎండగట్టింది. చిదంబరం ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆయనను టార్గెట్ చేశారని ఆరోపించింది. చిదంబరంపై నమోదైన ఆరోపణలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని దర్యాప్తు సంస్థ అధికారులను సవాల్ చేసింది. చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలను లక్ష్యంగా చేసుకున్న సీబీఐ అధికారులు కార్తీ చిదంబరంపై నాలుగు సార్లు దాడులు చేయడంతో పాటు 20 సార్లకు పైగా సమన్లు జారీ చేసి వేధించారని మండిపడింది. అప్రూవర్‌గా మారి ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న మహిళ స్టేట్మెంట్పై ఆధారపడి సీబీఐ ఈ కేసులో విచారణ సాగిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా దుయ్యబట్టారు. కుమార్తెను హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నమహిళపై విశ్వాసం ఉంచిన సీబీఐ చిదంబరంపై భరోసా లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. సొంత కుమార్తెను హత్య చేసిన ఆరోపణలున్న మహిళ స్టేట్మెంట్ ఆధారంగా సీనియర్ రాజకీయ నేతను అరెస్ట్ చేశారని పరోక్షంగా ఇంద్రాణి ముఖర్జియాను ప్రస్తావిస్తూ సుర్జీవాలా సీబీఐపై విరుచుకుపడ్డారు. కుమార్తెను హత్య చేసిన కేసులో ఐఎన్ఎక్స్ మీడియా అధిపతులైన పీటర్, ఇంద్రాణి ముఖర్జియా దంపతులు 2015 ఆగస్ట్‌లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. -
‘నా చావుకి సీబీఐ బాధ్యత వహిస్తుందా..?’
ముంబై : ఒక వేళ నేను మరణిస్తే.. నా మరణానికి సీబీఐ బాధ్యత వహిస్తుందా అంటూ ప్రశ్నించారు ఇంద్రాణి ముఖర్జియా. ప్రస్తుతం ఇంద్రాణి, కన్నకూతురు షీనా బోరాను హత్య చేసిన ఆరోపణలతో జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యంగో బాధపడుతున్న తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె సీబీఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బెయిల్ పిటిన్‌ను ఈ రోజు కోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఆమె వాదిస్తూ, 'అనారోగ్యంతో ఉన్న నాకు బెయిల్ చాలా అవసరం. నేను మెదడులో నరాల సమస్యతో బాధపడుతున్నాను. బెయిల్ వచ్చిన వెంటనే స్పెషలిస్టుల చేత వైద్యం చేయించుకుంటాను. ఒక వేళ నేను చనిపోతే దానికి సీబీఐ బాధ్యత తీసుకుంటుందా?' అని ప్రశ్నించింది. అయితే కోర్టు ఆమె వాదనలను పట్టించుకోలేదు. ఇంద్రాణికి బెయిల్ మంజూరు చేయలేమంటూ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇంద్రాణి ముఖర్జియా ప్రస్తుతం ముంబైలోని భైకుల్లా జైల్లో శిక్షను అనుభవిస్తోంది. కూతరు శినా బోరాను హత్య చేసిని కేసులో 2015లో ఆమెను అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఆమె బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఆమె మంచి చెడ్డలు చూడటానికి కుటుంబసభ్యులు ఎవరూ లేరని కోర్టు తెలిపింది. -
'ఇంద్రాణికి మెంటల్.. మీరెలా నమ్మారు?'
సాక్షి, చెన్నై : కన్న కూతురును చంపిన కేసులో రెండేళ్లుగా జైలులో ఉంటున్న ఇంద్రాణి ముఖర్జియా మాటలు ఎలా పరిగణనలోకి తీసుకుంటారని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులను ప్రశ్నించారు. మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని అరెస్టు చేసిన సందర్భంగా వారు ఈ ప్రశ్నను సందించారు. ఇంద్రాణి గత రెండేళ్లుగా జైలులో ఉంటోందని, ఆమె మానసిక స్థితి సరిగా లేదని, ఆమె ఏవీ చెబితే వాటిని నమ్మి అరెస్టు చేస్తారా అని దాదాపు 200మంది కాంగ్రెస్ పార్టీ నేతలు వల్లవార్ కొట్టాంలో పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తూ నిరసన నినాదాలు చేశారు. ఇది బీజేపీ చేస్తున్న కక్ష సాధింపు చర్యలు తప్ప మరొకటి కాదని అన్నారు. ఇంద్రాణి మాటలను కోర్టు స్థాయిలో పరిశీలించాల్సి ఉంటుందని, ఆమె సరైన మానసిక స్థితిలో ఉండి చెప్పారో లేదో నిర్ధారించిన తర్వాతే పోలీసులు చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా ఇష్టం వచ్చినట్లు చేయడం ఏమిటని నిలదీశారు. 'మీరు ఇంద్రాణి వాంగ్మూలాన్ని ఎలా విశ్వాసంలోకి తీసుకుంటారు? ఆమె మానసిక పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉంది. రెండేళ్లుగా ఆమె జైలులో ఉంటోంది. ఆమె వాంగ్మూలాన్ని కోర్ట్ ఆఫ్ లా ప్రకారం మరోసారి ప్రశ్నించాల్సి ఉంటుంది. ఈ కేసు బీజేపీ రాజకీయ కక్ష సాధింపు మాత్రమే' అని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీటర్ అల్ఫాన్స్ అన్నారు. క్విడ్ ప్రో కో కింద చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు కార్తీ పెద్ద మొత్తంలో లంఛాలు తీసుకొని ఇంద్రాణి, ఆమె భర్త ముఖర్జియాకు మేలు కలిగేలా చేశారని, కొన్ని కేసుల నుంచి తప్పించారని దీంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం జరిగిందనే కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. -
'ఆ హత్యలో నాకూ భాగం ఉంది.. నాకన్నీ తెలుసు'
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో కీలక పురోగతి వైపు మళ్లింది. ఈ కేసులో కీలక నిందితుడు, ఇప్పటికే అరెస్టయి జైలులోనే ఉన్న విచారణ ఖైదీ.. ఇంద్రాణీ డ్రైవర్ శ్యాంవర్ రాయ్ అప్రూవర్ గా మారాడు. కోర్టులో పలు నిజాలు చెప్పేందుకు అంగీకరించాడు. తాను ఇప్పటి వరకు చెప్పని అంశాలు ఇప్పుడు కోర్టు ముందు ఉంచుతానని అన్నాడు. ఈ నేరానికి సంబంధించిన విషయాలు తనకు తెలుసని, ఈ హత్యలో తాను కూడా ఒక భాగస్తుడినని తెలిపాడు. షీనా బోరాను గొంతునులిమి ఊపిరి ఆగకుండా చేసి హత్య చేసినట్లు కోర్టుకు చెప్పాడు. -
'మైఖెల్ చంపాడు.. నేను అండగా ఉన్నాను'
ముంబయి: తన కుమార్తె షీనాబోరాను తన మాజీ భర్త మైఖెల్ హత్య చేశాడని, ఆ సమయంలో తాను సహాయం మాత్రమే చేశానని ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా భర్త పీటర్ ముఖర్జియాకు తెలిపినట్లు తెలిసింది. దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ఇంద్రాణిని 2015 ఆగస్టులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె నేరాన్ని అంగీకరించలేదు. జైలుకు తీసుకెళ్లిన తర్వాత పీటర్ ఓసారి ఆమెను జైలులో కలిశారు. ఆ సమయంలో తాను ఆ హత్య చేయలేదని, మైఖెలే చేశాడని, మృతేదేహాన్ని కనిపించకుండా చేసేందుకే సహాయపడినట్లు ఆయనతో చెప్పారని పీటర్ సోదరుడు గౌతమ్ ముఖర్జియా తెలిపారు. అనవసరంగా తన సోదరుడు పీటర్‌ను ఈ కేసులో ఇరికించారని, 250 ఆధారాలు ఉన్నా అందులో ఏ ఒక్కటీ పీటర్ పాత్ర ఉందని రుజువు చేయలేకపోతున్నాయని అన్నారు. -
'ఇక ఇంద్రాణి స్టేట్ మెంట్ రికార్డు చేసుకోవచ్చు'
ముంబయి: త్వరలోనే ఇంద్రాణి ముఖర్జియా పోలీసులకు స్టేట్మెంట్ ఇస్తుందని ఆమెను పర్యవేక్షిస్తున్న సీనియర్ డాక్టర్ టీపీ లహానే చెప్పారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుందని వైద్యులతో కూడా మాట్లాడుతోందని ఆయన వివరించారు. కన్న కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉండి విచారణ నిమిత్తం జైలు అధికారుల కస్టడీలో ఉన్న ఇంద్రాణి మోతాదుకు మించిన మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను జేజే ఆస్పత్రిలో చేర్పించగా ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షించింది. ప్రస్తుతం ఆ వైద్యుల అనుమతితోనే ఆమె డిశ్చార్జి అయ్యి పోలీసులకు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైద్యులు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేశారు. త్వరలోనే ఆమెను డిశ్చార్జి చేస్తామని, పోలీసులు వాంగ్మూలం నమోదు చేసుకోవచ్చని ఇప్పుడామె శరీరం అన్ని రకాలుగా సహకరిస్తుందని వివరించారు. -
'కస్టడీ ముగిసినా ఖన్నా జైలుకు ఎందుకు?'
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో ప్రధాన నిందితుడు, ఇంద్రాణి ముఖర్జియా మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు మంగళవారం మరోసారి ముంబయిలోని ఖర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి కోర్టు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే, దీనిపై ఆయన తరుపు లాయర్లు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకు కస్టడీ ముగిసి 24 గంటలు పూర్తవుతున్నా అతడిని కోర్టులో హాజరుపరచకుండా నేరుగా స్టేషన్‌కు తరలించడం అంగీకరించకూడని నిర్ణయమని కోర్టులో పిల్ వేయనున్నారు. కేసులో కీలక విచారణ కోసం సంజీవ్ ఖన్నాను పోలీసులు కోల్‌కతా తీసుకువెళ్లి ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన కస్టడీ ఆదివారమే పూర్తయిందని, సోమవారం కూడా అదుపులో ఉంచుకోవడం చట్ట విరుద్ధమని కోర్టులో ఫిర్యాదు చేయనున్నారు.