CBI arrest
-
దర్యాప్తు కూడా నామీదే చేయండీ అని అనకండి మేడం!
-
కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. సోమవారం కేజ్రీవాల్, సీబీఐ తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. ‘ఎక్సైజ్ కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్. ఆయన్ను విడుదల చేస్తే సాకు‡్ష్యలను ప్రభావితం చేస్తారు. ఆయన అరెస్టయితేనే ఈ కేసు విచారణ ముగింపునకు వస్తుంది. నెలలోగా చార్జిషిటు వేస్తాం’అని సీబీఐ లాయర్ డీపీ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన తరఫు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఊహాకల్పనలతోనే కేజ్రీవాల్‌కు అరెస్ట్ చేశారే తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సన్ కృష్ణ తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలిచ్చారు. ఆఖరి చార్జిషీటు అంతకుముందు, సీబీఐ అధికారులు మద్యం కుంభకోణం కేసులో ఆఖరి చార్జిషిటును రౌజ్ అవెన్యూ కోర్టులో దాఖలు చేశారు. ఇందులో సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌తోపాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డి, బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా, హవాలా ఆపరేటర్ వినోద్ చౌహాన్, వ్యాపారవేత్త ఆశిష్ మాథుర్పేర్లున్నాయి. -
‘నీట్–యూజీ’ కేసులో దర్యాప్తు వేగవంతం
న్యూఢిల్లీ: నీట్–యూజీ అక్రమాల కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. శనివారం గుజరాత్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. జార్ఖండ్‌లో ఓ హిందీ పత్రిక జర్నలిస్టు జమాలుద్దీన్ అన్సారీని అరెస్ట్ చేశారు. నీట్–యూజీ పేపర్ లీకేజీ కేసులో నిందితులైన హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహసానుల్ హక్, వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ అలామ్‌కు జమాలుద్దీన్ సహకరినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. గుజరాత్‌లోని ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్, గోద్రా జిల్లాల్లో నిందితులకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయ్ జలారామ్ స్కూల్ ప్రిన్సిపాల్ పురుషోత్తమ్, టీచర్ తుషార్, మధ్యవర్తులు వి¿ోర్æ, అరిఫ్‌లను నాలుగు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ గోద్రా కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గోద్రా, ఖేడా జిల్లాల్లో నీట్ పరీక్ష జరిగిన సెంటర్లు జయ్ జలారామ్ సూక్ల్ యాజమాన్యం ఆ«దీనంలో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. -
నీట్ పేపర్ లీకేజీ.. సీబీఐ తొలి అరెస్ట్
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం బీహార్ కేంద్రంగా నీట్ పేపర్ లీకేజీకి పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తొలుత పాట్నాకు చెందిన మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి అరెస్ట్ చేసింది. వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (యూజీ)-2024 పరీక్షలో అవకతవకలపై దూమారం చెలరేగింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు లీకేజీకి ప్రధాన కేంద్రాలుగా అనుమానిస్తున్న బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. సీబీఐ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు..మనీష్ కుమార్ నీట్ ప్రశ్నా పత్రాన్ని క్వశ్చన్ పేపర్‌ను 12మంది విద్యార్ధులు అంతకంటే ఎక్కువ మంది ఇచ్చాడని, అనంతరం మనీష్ కుమార్ తన కారుతో స్వయంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలుస్తోంది.మరో నిందితుడు అశుతోష్.. లీకైన నీట్ పేపర్ చదువుకునేందుకు వీలుగా తన ఇంటిని, నిరుపయోగంగా ఉన్న ఓ స్కూల్‌ను ఉపయోగించినట్లు సీబీఐ గుర్తించింది. #WATCH | NEET paper leak matter | CBI team arrives at CBI office in Patna, Bihar with accused Baldev Kumar alias Chintu and Mukesh Kumar. A Special CBI Court in Patna sent both to CBI remand, yesterday. pic.twitter.com/mvQhG2aplH— ANI (@ANI) June 27, 2024 -
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. న్యూస్ చానెల్ అధికారి అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ తాజాగా మరొకరిని అరెస్ట్ చేసింది. ‘ఇండియా ఏహెడ్’ న్యూస్ చానెల్ కమర్షియల్ హెడ్, ప్రొడక్షన్ కంట్రోలర్ అర్వింద్ కుమార్ జోషిని అదుపులోకి తీసుకుంది. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ ప్రచార బాధ్యతలను చేపట్టిన చారియెట్ మీడియా సంస్థకు ఈయన హవాలా మార్గంలో రూ.17 కోట్లను బదిలీ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. వాట్సాప్ చాటింగ్, హవాలా ఆపరేటర్ల రికార్డులు పరిశీలించిన తర్వాత జోషిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. చారియెట్ మీడియా యజమాని రాజేశ్ జోషిని ఫిబ్రవరిలోనే ఈడీ అదుపులోకి తీసుకుంది. అయితే, సరైన ఆధారాలను సమర్పించలేదంటూ మే 6న ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిలిచ్చింది. -
మమతా బెనర్జీకి మరోసారి షాకిచ్చిన సీబీఐ.. ఎమ్మెల్యే అరెస్ట్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో మరోసారి రాజకీయం వేడెక్కింది. బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో సీబీఐ విచారణలో భాగంగా టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహాను అరెస్ట్ చేశారు. దీంతో, ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు టీఎంసీ నేతలు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరెస్ట్ ఘటన రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్కు సంబంధించి కోల్కత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో బుర్వాన్‌లోని టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా నివాసాలపై సీబీఐ ప్రత్యేక బృందం దాడులు చేసింది. అనంతరం, జిబాన్‌ను సీబీఐ స్పెషల్ టీమ్ దాదాపు 65(ఏప్రిల్ 14 నుంచి దాదాపు మూడు రోజులు) గంటల పాటు విచారించింది. విచారణ తర్వాత.. జిబాన్ కృష్ణను అరెస్ట్ చేస్తున్నట్టు సీబీఐ స్పష్టం చేసింది. అయితే, విచారణ సందర్భంగా జిబాన్.. తమకు సహకరించలేదని అధికారులు తెలిపారు. అంతకుముందు.. కేంద్ర భద్రతా బలగాలతో పాటు సీబీఐ బృందం ముర్షిదాబాద్ జిల్లాలోని ఆయన నివాసానికి చేరుకుంది. అభ్యర్థుల రిక్రూట్మెంట్కు సంబంధించిన అనేక నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ దాడిలో, ప్రభుత్వ పాఠశాలల్లో రెండు సెక్షన్ల రిక్రూట్మెంట్ కోసం రాత పరీక్షల అడ్మిట్ కార్డులతో సహా అనేక నేరారోపణ పత్రాలను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించిన రికార్డులను కలిగి ఉన్న డైరీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, సీబీఐ దాడుల సందర్బంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన ఇంట్లో విచారణ సందర్భంగా, జిబాన్ వాష్‌రూమ్‌కు వెళ్లడానికి అనుమతి తీసుకున్నాడు. తరువాత అతను అకస్మాత్తుగా తన నివాసం పక్కనే ఉన్న చెరువు వైపునకు వెళ్లి తన ఫోన్లను అందులోకి విసిరేసాడు. దీంతో, అధికారులు షాకయ్యారు. ఇక, బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో ఇప్పటికే సీఎం మమతా బెనర్జీకి షాక్ తగిలింది. టీఎంసీ నేతలు సాహా మాణిక్ భట్టాచార్య, పార్థా చటర్జీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్టులోకి మరో ఎమ్మెల్యే జిజాన్ కూడా చేరారు. -
సిసోడియా అరెస్ట్: ఢిల్లీ పోలీసులు అలర్ట్.. ప్లాన్ మార్చిన సీబీఐ!
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిసోడియాను సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సుమారు ఎనిమిది గంటల పాటు ప్రశ్నలు సంధించింది. అనంతరం, సిసోడియా అరెస్ట్‌ను ప్రకటించింది. ఇక, సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో సీబీఐ ఆఫీసు వద్ద 144 సెక్షన్ విధించింది. ఇదిలా ఉండగా.. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సిసోడియాను సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకువెళ్లనున్నారు. కాగా, సిసోడియా అరెస్ట్‌కు నిరసనగా ‘ఆప్’.. దేశవ్యాప్తంగా నిరసలను పిలుపునిచ్చింది. అలాగే, ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చింది. అయితే, ఆప్ ఆందోళనల నేపథ్యంలో సిసోడియాను వర్చువల్‌గా కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. कल @msisodia जी को फर्जी केस में गिरफ्तार करने के बाद आज फिर PM मोदी ने AAP के Office के बाहर भारी संख्या में सुरक्षा बल तैनात कर दिया है। BJP को किस बात का डर है? AAP के हाथों अपने अंत का? pic.twitter.com/f2kngHZZyt — AAP (@AamAadmiParty) February 27, 2023 మరోవైపు.. ఆప్ నేతల ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆప్ కార్యాలయం వద్ద సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించడంతో ఆప్ నేతలు స్పందించారు. బీజేపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో బీజేపీ నేత కపిల్ మిశ్రా స్పందించారు. కేజ్రీవాల్ కేబినెట్ నుంచి మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లను తొలగించాలని మిశ్రా డిమాండ్ చేశారు. CM @ArvindKejriwal जी मनीष सिसोदिया और सत्येंद्र जैन दोनों भ्रष्ट मंत्रियों को तुरंत हटाइए जेल से सरकार चलाने का पाप बंद होना चाहिए कुछ विभाग आप भी सम्भालिये , कब तक बिना काम का CM बनकर बैठे रहेंगे क़ानून अपना काम कर रहा हैं, आप सरकार को ठप्प करके बैठे है pic.twitter.com/fYr9pya3OW — Kapil Mishra (@KapilMishra_IND) February 27, 2023 -
అనుబ్రతా మోండల్‌కు అవమానం!.. ‘షూ’ చూపిస్తూ ‘చోర్’ అంటూ నినాదాలు!
కోల్‌కతా: పశువుల అక్రమ రవాణా కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన టీఎంసీ సీనియర్ నాయకుడు అనుబ్రతా మోండల్‌కు ఛేదు అనుభవం ఎదురైంది. ప్రత్యేక సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఆయనకు నిరసనల సెగ తగిలింది. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు చోర్ చోర్(దొంగ) అంటూ అరిచారు. కొందరు చెప్పులు, బూట్లు విసిరారు. ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు అనుబ్రతా మోండల్‌ను తీసుకొచ్చే క్రమంలో న్యాయస్థానం ముందు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. టీఎంసీ నేత అనుబ్రతా మోండల్ కారు దిగగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు భద్రత మధ్య కోర్టులోకి వెళ్లారు అనుబ్రతా మోండల్. విచారించిన కోర్టు ఆయనకు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. #WATCH | West Bengal: Anger in people as they show shoes, shout slogans of 'chor, chor' during the production of TMC Birbhum district president Anubrata Mondal in a special CBI court of Asansol. Mondal had been arrested by the CBI in a cattle smuggling case. https://t.co/iE0Ui4xTQ6 pic.twitter.com/Z8yqQWI3JE — ANI (@ANI) August 11, 2022 ఏంటీ కేసు? 2020లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పశువుల స్మగ్లింగ్ కుంభకోణం కేసులో అనుబ్రతా మోండల్ పేరు తెరపైకి వచ్చింది. సీబీఐ నివేదిక ప్రకారం.. 2015, 2017 మధ్య కాలంలో 20,000 పశువుల తలలను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. దీంతో పశువుల అక్రమ రవాణా స్కామ్ వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఇదీ చదవండి: Anubrata Mondal Arrested: మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత -
నగదు ఇస్తే గవర్నర్ పదవి !
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో నగదు ముట్టజెప్తే రాష్ట్ర గవర్నర్ పదవి, రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యేలా చేస్తామని పలు పదవులు ఎరచూపిన ఒక ముఠా గుట్టును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రట్టుచేసింది. మొత్తంగా రూ.100 కోట్ల మేర నగదు వసూళ్లకు ఈ ముఠా ప్రణాళిక సిద్ధంచేసుకుందని సీబీఐ తెలిపింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇటీవల పలు చోట్ల దాడులు చేపట్టింది. ఈ ముఠాకు సంబంధించి మహా రాష్ట్రలోని లాతూర్‌లో కమలాకర్ ప్రేమ్‌కుమార్ బంద్గర్, కర్ణాటకలోని బెల్గామ్‌లో రవీంద్ర విఠల్ నాయక్‌ను, ఢిల్లీలో మహేంద్ర పాల్ అరోరా, అభిషేక్ బోరాలను సీబీఐ అరెస్ట్‌చేసింది. ముఠాలో ముఖ్యుడైన కమలాకర్ మిగతావారితో కలిసి పలువురు వ్యక్తులకు పదవులు ఇప్పిస్తామని ఆశచూపాడని సీబీఐ కేసులు పెట్టింది. గవర్నర్ పదవి, రాజ్యసభ సభ్యునిగా ఎంపిక, కేంద్ర ప్రభుత్వ సంస్థల చైర్మన్ పదవులు ఇప్పిస్తామని పలువురు ప్రముఖులను ఈ ముఠా సంప్రదించింది. పలు కేసుల దర్యాప్తు తమకు అనుకూలంగా సాగాలంటూ పోలీసులనూ కమలాకర్ బెదిరించాడని పేర్కొంది. అరెస్ట్ అయిన అందరికీ సీబీఐ కోర్టు బెయిల్ మంజూరుచేయడం గమనార్హం. -
మార్కెట్‌పై చమురు పిడుగు!
ముంబై: అనూహ్యంగా ఎగబాకిన ముడి చమురు ధరలకు ద్రవ్యోల్బణ భయాలు ఆజ్యం పోయడంతో సోమవారం ఈక్విటీ మార్కెట్లు మండిపోయాయి. రష్యా క్రూడ్ ఎగుమతులపై ఆంక్షలు విధించాలని పాశ్చత్య దేశాలు యోచిస్తున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో బలగాలు పోరులోకి దిగుతాయనే వార్తలు వెలుగులోకి రావడంతో ఇకపై యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో అనే భయాలూ వెంటాడాయి. ఇక దేశీయంగా ఫిబ్రవరిలో సేవల రంగం తీరు నిరాశపరిచింది. ఎన్ఎస్ఈ కుంభకోణంలో చిత్రా రామకృష్ణన్‌ను సీబీఐ ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్ చేయడం మార్కెట్ వర్గాలు కలవరపడ్డాయి. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి జీవితకాల కనిష్టానికి చేరుకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఈ పరిణామాలన్నీ సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లో మరో బ్లాక్ మండే నమోదైంది. ఒక్క మెటల్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనవడంతో స్టాక్ సూచీలు 7 నెలల కనిష్టస్థాయిల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 1,491 పాయింట్లు నష్టపోయి 52,843 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 382 పాయింట్లను కోల్పోయి 16వేల దిగువున 15,863 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 1967 పాయింట్లు పతనమై 52,367 వద్ద, నిఫ్టీ 534 పాయింట్లు నష్టపోయి 15,711 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,482 కోట్ల షేర్లను అమ్మేయగా.. దేశీ ఇన్వెస్టర్లు రూ.5,331 కోట్ల షేర్లను కొన్నారు. ప్రపంచ మార్కెట్లూ పతనమే... పదోరోజూ ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పతనాన్ని చవిచూశాయి. ఆసియాలో అన్ని దేశాల స్టాక్ సూచీలు నష్టంతో ముగిశాయి. హాంగ్‌కాంగ్ మార్కెట్ అత్యధికంగా నాలుగుశాతం క్షీణించింది. జపాన్, తైవాన్, కొరియా సూచీలు మూడు శాతం, చైనా, సింగపూర్, ఇండోనేషియా సూచీలు రెండు శాతం నష్టపోయాయి. యూరప్‌లోని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు మూడు శాతం నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్ల మద్దతుతో అరశాతం నష్టాన్ని చవిచూశాయి. కాగా అమెరికా స్టాక్ మార్కెట్లు రెండు శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ సూచీ 3,404 పాయింట్లు(ఆరుశాతం) క్షీణించడంతో ఇన్వెస్టర్లు రూ.11.28 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. -
ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ అరెస్ట్
న్యూఢిల్లీ: కోలొకేషన్ కేసులో ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. ఢిల్లీలో ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, సీబీఐ ప్రధాన కార్యాలయం లాకప్‌లో ఉంచారు. సోమవారం సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం చిత్రా పెట్టుకున్న యాంటిసిపేటరీ బెయిల్‌ను తిరస్కరించిన మర్నాడే అధికారులు అరెస్ట్ చేయడం గమనార్హం. గత మూడు రోజులుగా అధికారులు ఆమె నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎన్ని ప్రశ్నలు వేసినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. ఎన్ఎస్ఈ కొలోకేషన్ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఎన్ఎస్ఈ చీఫ్‌గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సెబీ నివేదిక ఇటీవలే తేల్చడం ఈ కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. ఒక అదృశ్య యోగితో ఆమె ఎన్ఎస్ఈకి సంబంధించి కీలక విధాన నిర్ణయాలను పంచుకోవడం, ఆమె నిర్ణయాల్లో యోగి పాత్ర ఉండడం బయటకొచ్చింది. ఇదే కేసులో ఎన్ఎస్ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను ఫిబ్రవరి 25న సీబీఐ అరెస్ట్ చేసింది. -
గెయిల్ డైరెక్టర్ రంగనాథన్ అరెస్ట్
న్యూఢిల్లీ: లంచాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గెయిల్ మార్కెటింగ్ వ్యవహారాల డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్‌గేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. నోయిడాలో ఆయనకు ఉన్న నివాసంలో సోదాలు నిర్వహించి రూ.1.3 కోట్లతో పాటు విలువైన ఆభరణాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 2021లో గెయిల్ డైరెక్టర్‌ను ఇరువులు మధ్యవర్తులు ఎలా కలిశారు, లంచం ఎలా ఇచ్చారన్న విషయాన్ని సీబీఐ ఎఫ్ఐఆర్ వివరించింది. పెట్రో కెమికల్ ఉత్పత్తులను రాయితీపై అందజేస్తే లంచాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీల యజమానులతో కూడా నిందితులు సమావేశం అయ్యారని ఎఫ్ఐఆర్ తెలిపింది. సీబీఐ జరిపిన దాడుల్లో రంగనాథన్ సహాయకుడు ఎన్ రామకృష్ణన్ నాయర్ నివాసం కూడా ఒకటి. ఈ నివాసం నుంచి రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో రంగనాథన్, నాయర్లతోపాటు పవన్ గౌర్, రాజేష్ కుమార్, యునైటెడ్ పాలిమర్ ఇండస్ట్రీస్‌కు చెందిన సౌరభ్ గుప్తా, బన్సల్ ఏజెన్సీస్‌కి చెందిన ఆదిత్య బన్సాల్ ఉన్నారు. -
సీబీఐకి ఓకే.. ఈడీకి నో!
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరాన్ని ఈ నెల 26వ తేదీ (వచ్చే సోమవారం) వరకూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక రక్షణ కల్పించింది. అయితే ఇదే కేసులో చిదంబరం ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నా రు. విచారణను ఎదుర్కొంటున్నారు కూడా!!. సీబీఐ కస్టడీ కూడా ఆగస్టు 26నే ముగుస్తుండటం తో సుప్రీంకోర్టు ఆదేశాలు ఆయనపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. నిజానికి చిదంబరానికి అరెస్టు నుంచి రక్షణ కల్పించవద్దంటూ ఈడీ వాదించినా, కోర్టు వారి వాదనను తిరస్కరించింది. ఈడీ, సీబీఐలు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలన్న చిదంబరం అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 20న తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం తెలిసిందే. అలాగే తనను ఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాలను కూడా సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఆగస్టు 26న విచారణ జరుపుతామనీ, అప్పటివరకు చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పిస్తున్నామని జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఏఎస్.బోపన్నల ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. మరోవైపు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల అన్ని లావాదేవీలూ, చెల్లింపుల వివరాలు ఇవ్వాలంటూ బ్రిటన్, స్విట్జర్లాండ్, సింగపూర్, మారిషస్, బెర్ముడాలకు సీబీఐ లెటర్ రొగేటరీలను (ఎల్ఆర్) పంపింది. సోమవారమే ఆ పత్రాలు ఇవ్వండి: జడ్జీలు ఈ కేసులో ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, చిదంబరం తరఫున కాంగ్రెస్ నేతలు, న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. చిదంబరానికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చిన వెంటనే.. మెహతా మరికొన్ని పత్రాలను సీల్డు కవర్లో జడ్జీలకు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ పత్రాలను చదివాక న్యాయమూర్తులు తమ అంతరాత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. మెహతా చర్యను సిబల్ వ్యతిరేకించారు. హైకోర్టులోనూ వాదనలు పూర్తయిన తర్వాత ఈడీ మరిన్ని పత్రాలను జడ్జీలకు అందజేసిందన్నారు. దీంతో మెహతా ఇచ్చిన పత్రాలను చదివేందుకు జడ్జీలు నిరాకరించారు. ఆ పత్రాలను సోమవారమే ఇవ్వాలని చెప్పారు. విదేశాల్లో 11 ఆస్తులు, 17 బ్యాంకు ఖాతాలు చిదంబరం విదేశాల్లో 11 చోట్ల ఆస్తులను కూడబెట్టారనీ, 17 బ్యాంకుల్లో ఖాతాలున్నాయని మెహతా తెలిపారు. ఐఎన్ఎక్స్ మీడియా విదేశాల నుంచి నిధులు అందుకునేందుకు ఎఫ్ఐపీబీ ఆమోదం తీసుకునే విషయమై ఐఎన్ఎక్స్ గ్రూప్ ప్రమోటర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలు చిదంబరాన్ని కలిసినప్పుడు కూడా, తన కుమారుడిని ‘జాగ్రత్తగా చూసుకోవాలి’ అని చిదంబరం వారితో అన్నట్లు మెహతా కోర్టుకు చెప్పారు. ‘అరెస్టు నుంచి రక్షణ కల్పించి విచారిస్తే చిదంబరం నిజాలు చెప్పరు. మోసం వివరాలను పూర్తిగా తెలుసుకునేందుకు ఆయనను కస్టడీలో ఉంచుకునే విచారించాలి. డొల్ల కంపెనీలను సృష్టించిన అనేకమంది చిదంబరం మనవరాలి పేరిట వీలునామా రాశారు. వీటిపై ప్రశ్నించాల్సి ఉంది’ అని ఆయన కోర్టుకు చెప్పారు. గతంలో చిదంబరాన్ని విచారించినప్పుడు సరైన సమాధానాలు ఇవ్వలేదని మెహతా అన్నారు. కోర్టు ఆ వ్యాఖ్యలు చేయాల్సింది కాదు సిబల్ వాదిస్తూ ఈడీ సమర్పించిన ఓ నోట్లోని మొత్తం సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా హైకోర్టు రికార్డులోకి తీసుకుని చిదంబరానికి ముందస్తు బెయిలును నిరాకరించిదనీ, అందులోని సమాచారంపై తామకు వాదనలు వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని సుప్రీంకోర్టుకు చెప్పారు. సింఘ్వీ వాదిస్తూ ‘ఆగస్టు 20న ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిలును తిరస్కరిస్తూ, ఆర్థిక నేరగాళ్లు ముందస్తు బెయిలు పొందకుండా చట్టాలను పార్లమెంటు సవరించాల్సిన సమయం వచ్చిందని జడ్జి అన్నారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. ఐఎన్ఎక్స్తో సంబంధం లేని ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసును ఆ రోజు జడ్జి ప్రస్తావించారు. అసలు సంబంధం లేని ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసు గురించి ఆయన ఎందుకు మాట్లాడారు? అంటే ఐఎన్ఎక్స్ కేసులో బెయిలు ఇవ్వకూడదని ఆ జడ్జి ముందుగానే అనుకున్నారు’ అని సుప్రీంకోర్టుకు తెలిపారు. ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 26కు వాయిదా వేసింది. ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసులో చిదంబరానికి ఊరట ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసుల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం, ఆయన కొడుకు కార్తీలను అరెస్టు చేయకుండా ఉన్న తాత్కాలిక రక్షణను ఢిల్లీ కోర్టు సెప్టెంబరు 3 వరకు పొడిగించింది. ముందస్తు బెయిలు కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లపై ఆదేశాలను కూడా సెప్టెంబర్ 3 వరకు రిజర్వ్‌లో ఉంచింది. అయితే ఎయిర్‌సెల్– మ్యాక్సిస్ కేసుల్లో సీబీఐ, ఈడీల అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేసేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. చిదంబరం, కార్తీలకు సంబంధించిన ఐఎన్ఎక్స్ మీడియా కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, విచారణను వాయిదా వేయాలని సీబీఐ, ఈడీ కోరాయి. దీనికి ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ‘పరిస్థితులు నాకు చాలా ఇబ్బందికరంగా మారాయి. ప్రతిరోజూ మీరు ఎందుకు వాయిదాలు అడుగుతున్నారు? దాదాపు సంవత్సరం నుంచి ఇలాగే చేస్తున్నారు’ అని మందలించారు. చిదంబరానికి ముందుస్తు బెయిలు అంశంలో ఆయనకు వ్యతిరేకంగా వాదనలేమైనా ఉంటే, వాటిని వినిపించేందుకు కోర్టు సెప్టెంబరు 3 వరకు సీబీఐ, ఈడీలకు గడువు ఇచ్చింది. రిజర్వ్‌లో ఉంచిన ఆదేశాలను సెప్టెంబరు 3న వెలువరిస్తామంది. -
వారి వాంగ్మూలంతో బిగిసిన ఉచ్చు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా వ్యవస్థాపకులు ఇంద్రాణీ ముఖర్జీ–పీటర్ ఈ మనీలాండరింగ్ కేసులో అప్రూవర్లుగా మారడంతో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మెడకు ఉచ్చు బిగుసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) కోసం అనుమతులు ఇవ్వాలంటే తన కుమారుడు కార్తీకి వ్యాపారంలో సహకరించాలని 2008లో అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కోరినట్లు ఇంద్రాణీ, పీటర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. తన కుమారుడికి సాయం చేస్తే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) నుంచి అనుమతులు వచ్చేస్తాయని చిదంబరం చెప్పారన్నారు. దీంతో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తాము కార్తీతో సమావేశమయ్యామనీ, ఈ సందర్భంగా తనకు 10 లక్షల డాలర్లు చెల్లిస్తే ఎఫ్‌ఐడీల కోసం అనుమతులు లభిస్తాయని కార్తీ చెప్పినట్లు ఇంద్రాణి ముఖర్జీ వెల్లడించారు. కార్తీకి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కంపెనీ ఖాతాలో రూ.10 లక్షలు జమచేసినట్లు పీటర్ ముఖర్జీ వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని ‘క్విడ్ ప్రో కో’గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభివర్ణించింది. అయితే 10 లక్షల డాలర్లలో మిగతా మొత్తాన్ని ఇంద్రాణీ–పీటర్లు కార్తీకి చెల్లించారా? లేదా? అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ఇంద్రాణీ–పీటర్ ముఖర్జీలు ఎవరో తెలియదు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐ అధికారులు పి.చిదంబరాన్ని అరెస్ట్ చేశారని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం తెలిపారు. చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్న కార్తీ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీలను కలుసుకోలేదు. సీబీఐ విచారణలో భాగంగా ఓసారి బైకుల్లా జైలులో కలిశా. అలాగే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ)లో ఎవ్వరితోనూ నేను భేటీకాలేదు. కాంగ్రెస్ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. -
సమాధుల పునాదుల పైన..
న్యూఢిల్లీ: చిదంబరంను ఉంచిన సీబీఐ ప్రధాన కార్యాలయ భవనం గురించి ఆసక్తికర కథలను సీబీఐ అధికారులు చెప్పుకుంటున్నారు. ఆ భవనం కట్టిన ప్రాంతం ఒకప్పుడు శ్మశానమని, సమాధులపై నిర్మించిన భవనం కాబట్టి వాస్తు సరిగా లేదంటున్నారు. వాస్తు సరిగా లేకపోవడం వల్లనే ఆ భవనంలో విధులు నిర్వర్తించిన సీబీఐ డైరెక్టర్లందరూ వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెబుతున్నారు. డైరెక్టర్లుగా పనిచేసిన ఏపీ సింగ్, రంజిత్ సిన్హాలపై సీబీఐ కేసు పెట్టింది. విజయ్‌మాల్యా పారిపోయేందుకు వీలు కల్పించాడని అనిల్ సిన్హాపై ఆరోపణలున్నాయి. అలోక్‌వర్మ తన సహచరుడితో వివాదంతో సీబీఐని భ్రష్టు పట్టించారని విమర్శలున్న విషయం తెలిసిందే. ప్రారంభోత్సవానికి చిదంబరం ఇదే భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథుల్లో ఒకరుగా చిదంబరం వచ్చారు. 2011, ఏప్రిల్ 30న నాటి ప్రధాని మన్మోహన్æ ఈ భవనాన్ని ప్రారంభించారు. కేంద్రమంత్రి హోదాలో చిదంబరం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి సీబీఐ డైరెక్టర్ ఆ భవనాన్ని మొత్తం వారికి తిప్పిచూపించారు. ఇప్పుడు చిదంబరం బందీగా ఉన్న గెస్ట్‌హౌజ్‌లోని సూట్ నెం 5ను అప్పుడు ఆయన చూసే ఉంటారు. నేడు సుప్రీంలో విచారణ తనకు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల జారీచేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ చిదంబరం దాఖలు చేసుకున్న పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారణ జరపుతుందని గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. -
ఏవియేషన్ కుంభకోణంలో దీపక్ తల్వార్ అరెస్ట్
న్యూఢిల్లీ : యూపీఏ హయాంలోని విమానయాన కుంభకోణానికి సంబంధించిన కేసులో దీపక్ తల్వార్‌ను గురువారం అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే అప్పటి విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు రోజుల పాటు గ్రిల్ దాఖలు చేసినట్లు స్పష్టం చేసింది. కాగా, ఈ కేసుకు సంబంధించి దీపక్ తల్వార్‌దే మొదటి అరెస్టు అని సీబీఐ తెలిపింది. సీబీఐ వివరాల ప్రకారం.. యూపీఏ హయాంలోని మంత్రులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులతో దీపక్ తల్వార్ చట్టవిరుద్ధంగా లాబీయింగ్‌లో పాల్గొన్నట్లు స్పష్టం చేసింది. ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా,ఖతార్ ఎయిర్వేస్ వంటి విమానయాన సంస్థలు తమ భద్రతకు సంబంధించి 2008-09లో అనుకూలంగా ట్రాఫిక్ హక్కులను పొందేందుకు దీపక్ తల్వార్‌కు రూ. 272 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వెల్లడించింది. కాగా ఈ మొత్తం సొమ్మును అతని కుటుంబ సభ్యుల పేరుతో ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఈ మొత్తంలో కొంత భాగాన్ని బ్యాంక్ ఆఫ్ సింగపూర్‌లో తన పేరు మీద ఉన్న ఖాతాలో జమచేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని స్పష్టం చేసింది. బ్రిటీష్ వర్జీనియాలోని ఎం/ఎస్ ఆసియా ఫీల్డ్ కంపెనీకి ఈ మొత్తాన్ని నగదు రూపంలో బదిలీ చేసినట్లు సమాచారం. అయితే ఈ కంపెనీ దీపక్ తల్వార్ పేరు మీద రిజిస్టరైనట్లు తేలింది. అయితే ఈ కేసు విచారణలో ఉండగానే దీపక్ తల్వార్ దుబాయ్ పారిపోయినట్లు సీబీఐ స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది జనవరి 31న దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అథారిటీ అతన్ని దేశం నుంచి బహిష్కరించడంతో తాజాగా ఈడీ అతన్ని అదుపులోకి తీసుకుంది. ఎయిర్ ఇండియాలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీనం, బోయింగ్-ఎయిర్‌బస్ నుంచి 111 విమానాలను రూ.70 వేల కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం, ప్రైవేటు విమానయాన సంస్థలకు విదేశీ పెట్టుబడులతో శిక్షణా సంస్థలను ప్రారంభించడం లాంటివి ఈడీ ఈ కేసులో అటాచ్ చేసినట్లు సీబీఐ పేర్కొంది. -
100 కోట్ల అవకతవకలు
న్యూఢిల్లీ: రూ.100 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరపటంతోపాటు సివిల్ ఏవియేషన్ బ్యూరో సెక్యూరిటీ (బీసీఏఎస్)పాస్‌లు పొంది దేశ భద్రతకు ముప్పు కలిగేలా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టు ఉపేంద్రరాయ్తోపాటు మరికొందరిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇందుకు సంబంధించి లక్నో, నోయిడా, ఢిల్లీ, ముంబైల్లో గురువారం సోదాలు జరిపింది. ‘ఢిల్లీకి చెందిన ఉపేంద్ర రాయ్ అనే సీనియర్ జర్నలిస్ట్, ఎయిర్ వన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అధికారి ప్రసూన్ రాయ్ మరికొందరితో కలిసి బీసీఏఎస్‌ను, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ను మోసం చేశారు. తప్పుడు పత్రాలతో ఏరోడ్రోమ్ ఎంట్రీ పాస్‌లు పొంది దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో అత్యంత భద్రత ఉండే, నిషిద్ధ ప్రాంతాల్లో ప్రవేశానికి అనుమతి పొందారు. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించారు. అక్రమ డబ్బు పెట్టుబడులకు రాహుల్ శర్మ, సంజయ్ స్నేహి సహకరించారు. 2017లో ఉపేంద్ర ఖాతాలో ఒక్కసారిగా రూ.79 కోట్లు జమయ్యాయి. ఐటీ శాఖలో సెటిల్మెంట్లకుగాను పలు నకిలీ కంపెనీల నుంచి రూ.16 కోట్లు వచ్చాయి’ అని సీబీఐ పేర్కొంది. -
ఉన్నావ్ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
న్యూఢిల్లీ / అలహాబాద్ / చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కఠువా, ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ కేసుల్లో కదలిక వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతి(17)పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను సీబీఐ అధికారులు శుక్ర వారం అరెస్టు చేశారు. అలాగే పోలీసులు నమోదుచేసిన మూడు ఎఫ్ఐఆర్లను సీబీఐ అధికారులు రీరిజిస్టర్ చేశారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో మైనర్ బాలిక అసిఫా(8) హత్యాచారం కేసును సుప్రీంకోర్టు శుక్రవారం సుమోటోగా విచారణకు స్వీకరించింది. చార్జ్‌షీట్‌ను దాఖలుచేయడానికి యత్నించిన పోలీసుల్ని న్యాయవాదులు అడ్డుకోవడంపై బార్ కౌన్సిళ్లకు నోటీసులు జారీచేసింది. అసిఫా కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాదికి బెదిరింపులు రావడాన్ని ఈ సందర్భంగా కొందరు లాయర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలాఉండగా కఠువా నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న బీజేపీ మంత్రులు చందర్ ప్రకాశ్, లాల్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన సీబీఐ ఉన్నావ్‌లో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ను తొలుత విచారణ నిమిత్తం శుక్రవారం అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు సాయంత్రానికి అరెస్ట్ చేశారు. కుల్దీప్ను ప్రస్తుతం సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉన్నావ్ ఘటనలో దోషులు ఎంతవారైనా వదిలిపెట్టబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే సిట్‌ను ఏర్పాటుచేశామన్నారు. ‘కుల్దీప్ను వెంటనే అరెస్ట్ చేయండి’ ఉన్నావ్ ఘటనలో ప్రధాన నిందితుడు కుల్దీప్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని అంతకుముందు అలహాబాద్ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. కుల్దీప్ను సీబీఐ ప్రస్తుతం విచారిస్తోందని న్యాయవాది కోర్టుకు తెలిపిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి డీబీ భోసలే, జస్టిస్ సునీత్‌ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. నిందితుడు బాధితులతో పాటు విచారణను ప్రభావితం చేయొచ్చనీ, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని వ్యాఖ్యానించింది. విచారణపై నివేదికను మే2 లోగా సమర్పించాలని ఆదేశించింది. బార్ కౌన్సిళ్ల తీరుపై సుప్రీం ఆగ్రహం: కఠువా కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలుచేయకుండా న్యాయవాదులే అడ్డుకోవడంపై సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎంఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. విచారణ ప్రక్రియలో జోక్యం వల్ల బాధితులకు న్యాయం అందడం ఆలస్యమవుతుందని వ్యాఖ్యానించింది. బాధితులు, నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాదుల్ని అడ్డుకునే అధికారం ఏ ఒక్కరికీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో లాయర్ల ప్రవర్తనపై తమ స్పందనల్ని ఏప్రిల్ 19లోగా తెలియజేయాలని కఠువా జిల్లా బార్ అసోసియేషన్, జమ్మూకశ్మీర్ బార్ కౌన్సిల్, జమ్మూహైకోర్టు బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం తరఫున న్యాయవాది షోయబ్ ఆలమ్ వాదనలు వినిపిస్తూ.. పోలీసుల్ని అడ్డుకున్న న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు వెల్లడించారు. కఠువా ఘటనలో మృతురాలి వివరాలు వెల్లడించిన మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. -
‘టోటెం’ ప్రమోటర్ల అరెస్టు
న్యూఢిల్లీ/చెన్నై: రూ. 1,394 కోట్ల మేర ఎనిమిది బ్యాంకుల కన్సార్టియంను మోసగించిన కేసులో టోటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్లు తొట్టెంపూడి సలలిత్, తొట్టెంపూడి కవితలను సీబీఐ శుక్రవారం బెంగళూరులో అరెస్టు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు. టోటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఇచ్చిన రూ. 313.84 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టారని, 2012లో ఆ రుణం నిరర్ధక ఆస్తుల జాబితాలో చేరిందని ఫిర్యాదులో యూబీఐ పేర్కొం ది. ఆ కంపెనీ మొత్తం రూ. 1394.84 కోట్ల మేర బ్యాంకుల కన్సార్టియంకు బకాయి పడిందని, వివిధ ప్రాజెక్టుల కోసం బ్యాంకుల నుం చి రుణాలు తీసుకుని సొంత పనులకు నిధుల్ని దారి మళ్లించిందని సీబీఐ ఆరోపించింది. నిధుల్లో కొంతమేర ప్రమోటర్ల వ్యక్తిగత ఖాతా ల్లోకి చేరాయని తెలిపింది. కాగా 2015లో ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన అతిపెద్ద పన్ను ఎగవేతదారుల జాబితాలో రూ. 400 కోట్ల ఎగవేతతో ఈ కంపెనీ కూడా ఉంది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌పై సీబీఐ కేసు యునైటెడ్ ఇండియా ఇన్సూ్యరెన్స్ కంపెనీ లిమిటెడ్(యూఐఐసీ)కి రూ. 30.54 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఆరోపణలపై డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డీసీహెచ్ఎల్), దాని చైర్మన్ టి.వెంకటరామ్రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబైకి చెందిన కేర్ రేటింగ్ లిమిటెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కో లిమిటెడ్, ఇద్దరు యూఐఐసీ మాజీ ఉద్యోగులు ఏ.బాల సుబ్రమణియన్, కె.ఎల్ కుంజిల్వర్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది. కంపెనీకి చెందిన ప్రీమియం డబ్బుల్ని ఆ ఇద్దరు ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా డీసీహెచ్ఎల్లో డిబెంచర్ల రూపంలో పెట్టబడి పెట్టారని, ఆ సమయంలో కేర్ రేటింగ్ లిమిటెడ్ సాయంతో రుణ అర్హత సామర్థ్యాన్ని డీసీహెచ్ఎల్ ఎక్కువ చేసి చూపించిందని ఫిర్యాదులో యూఐఐసీ పేర్కొంది. -
కార్తీ చిదంబరం అరెస్టు
-
కార్తీ చిదంబరం అరెస్టు
న్యూఢిల్లీ: అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కొడుకు కార్తీని సీబీఐ బుధవారం చెన్నైలో అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు హాజరయ్యేందుకు లండన్ నుంచి భారత్‌కు వచ్చిన కార్తీని చెన్నై విమానాశ్రయంలోనే సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం ఢిల్లీకి తీసుకెళ్లి, అక్కడి కోర్టులో హాజరుపరిచింది. ఐఎన్ఎక్స్ మీడియా నుంచి కోట్ల రూపాయల మేర ముడుపులు అందుకున్న కేసులో కార్తీని ప్రశ్నించేందుకు 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా.. ఒకరోజు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ కోర్టులో హాజరుపర్చాలంది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కార్తీని అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఆరోపించగా.. ఇందులో ప్రభుత్వ జోక్యం ఏదీ లేదని, చట్ట ప్రకారమే దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. అయితే, ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించి నాటి ఆర్థిక మంత్రి చిదంబరంను కూడా కలిశామని అప్పటి ఐఎన్ఎక్స్ డైరెక్టర్లు ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ సీబీఐ, ఈడీల విచారణలో వెల్లడించడం సంచలనం రేపుతోంది. విచారణకు సహకరించడం లేదనే.. విచారణకు సహకరించకపోవడం వల్లనే కార్తీని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని సీబీఐ స్పష్టం చేసింది. అలాగే, ఆయన పలుమార్లు విదేశాలకు వెళ్తుండటంతో అక్కడి బ్యాంకుల్లోని సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశం ఉందంది. విచారణకు హాజరవకుండా పూర్తిగా విదేశాల్లోనే ఉండిపోయే పరిస్థితి కూడా ఉందని, అందువల్లనే అదుపులోకి తీసుకుని విచారిస్తామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ వాదనను కార్తీ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. గతంలోనే ఎన్నోసార్లు సీబీఐ, ఈడీలు కార్తిని విచారించాయనీ, ఇప్పుడు కూడా ఈడీ విచారణకు హాజరవ్వడానికే ఆయన భారత్ వచ్చారని కోర్టుకు తెలిపారు. ఆయన అరెస్టుకు సరైన కారణాలే లేవన్నారు. కాగా, ఐఎన్ఎక్స్ మీడియా కేసుతోపాటు 2006లో ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ ఒప్పందానికి ఎఫ్ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతులపై కూడా సీబీఐ విచారిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మనీలాండరింగ్ కేసులో కార్తీని ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. రాజకీయ కక్షతోనే.. రాజకీయ కక్షతోనే బీజేపీ ప్రభుత్వం కార్తీని అరెస్టు చేయించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్డీయే హయాంలో వెలుగుచూస్తున్న కుంభకోణాలు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఎత్తుగడ వేసిందంది. కాంగ్రెస్ ప్రజలకు నిజాలు చెప్పడాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని ఇలాంటి చర్యలతో ఆపలేరని ఆ పార్టీ నేత రణదీప్ సుర్జేవాలా అన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేయడానికి బీభత్సంగా మాటలను వాడే ప్రధాని మోదీ.. గత 10 రోజుల్లో బీజేపీ హయంలో రూ. 30 వేల కోట్ల కుంభకోణాలు బయటపడినా నోరు తెరవడం లేదన్నారు. ‘వేల కోట్లు ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యాను ప్రభుత్వం ఏం చేయదు. కేసు విచారణకు హాజరయ్యేందుకు విదేశం నుంచి తిరిగొచ్చిన కార్తీని అరెస్టు చేస్తుంది’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. ప్రభుత్వ జోక్యం లేదు.. కార్తీ చిదంబరం కేసులో ప్రభుత్వ జోక్యం ఏమీ లేదనీ, ఉండదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. చట్టం ప్రకారమే దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయనీ ఆయన తప్పు చేశారో లేదో ఆధారాలే చెబుతాయని పేర్కొన్నారు. కేసు విచారణకు రాకముందే.. సీబీఐ, ఈడీలు తప్పుడు కేసులతో తనను, తన కుటుంబ సభ్యలను తరచూ వేధిస్తున్నాయని, తమ ప్రాథమిక హక్కులను రక్షించాలని కోరుతూ చిదంబరం గతవారమే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దర్యాప్తు సంస్థలు తమపై ‘అక్రమ విచారణలు’ జరపకుండా అడ్డుకోవాలని ఆయన పిటిషన్లో కోరారు. అయితే సుప్రీంకోర్టులో చిదంబరం పిటిషన్ ఇంకా విచారణకు కూడా రాకముందే కార్తిని సీబీఐ అరెస్టు చేయడం గమనార్హం. మార్చి 1న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసుపై స్టే విధించాలనీ, లేదా కనీసం విచారణను కొద్దికాలం వాయిదా వేయాలంటూ కార్తి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. గతవారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కార్తి తరఫున వాదిస్తున్న కపిల్ సిబల్ కూడా ‘మీరు కార్తీని అరెస్టు చేయాలని అనుకుంటున్నారా?’ అని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించడం గమనార్హం. ఏమిటీ ఐఎన్ఎక్స్ కేసు? ఐఎన్ఎక్స్ మీడియా కేసు 2007 మార్చిలో పి.చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటిది. కూతురి హత్యకేసులో నిందితులుగా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న భార్యాభర్తలు ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీల చేతుల్లో అప్పట్లో ఈ కంపెనీ ఉండేది. తమ కంపెనీలోకి 46 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతించాలంటూ వారు.. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో పనిచేసే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ)కి దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల అనంతరం ఎఫ్ఐపీబీ ఐఎన్ఎక్స్ మీడియాలో 46 శాతం ఎఫ్‌డీఐకి అనుమతినిచ్చింది. అయితే అప్పటికే 26 శాతం ఎఫ్‌డీఐలు ఐఎన్ఎక్స్లో ఉన్నాయి. ఆ విషయాన్ని ముఖర్జీలు ఎఫ్ఐపీబీ వద్ద దాచిపెట్టారు. పరిమితికి మించి రూ. 305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులను తీసుకున్నారు. ఈ అవకతవకలను ఆదాయ పన్ను శాఖ గుర్తించి, ఆర్థిక శాఖను సైతం అప్రమత్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఈడీ సూచన మేరకు గతేడాది మే 15న సీబీఐ తొలి కేసును నమోదు చేసింది. ఆ తర్వాత జరిపిన సోదాల్లో తమకు పలు ఆధారాలు లభించాయని ఈడీ, సీబీఐలు చెబుతున్నాయి. తండ్రి మద్దతుతోనే.. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతుల విషయంలో జరిగిన ఉల్లంఘనలను సరిచేసేందుకు కార్తీ తమ నుంచి పది లక్షల డాలర్లు తీసుకున్నట్లు ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీ ఇటీవల సీబీఐ విచారణలో బయటపెట్టారు. అందుకు అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న తన తండ్రి పీ చిదంబరం సహకరిస్తారని కార్తీ చెప్పాడని వారు వెల్లడించారు. ‘కార్తీ కోరిన 10 లక్షల డాలర్లలో 7 లక్షల డాలర్లను(రూ.3.10 కోట్లు) కార్తీకి విదేశాల్లోని ఆయన అనుబంధ సంస్థల ద్వారా అందించాం’ అని ముఖర్జీలు మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలోనూ స్పష్టం చేశారు. ‘ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ. 305 కోట్ల విదేశీ పెట్టుబడులను అక్రమంగా పొందాం. ఆ పెట్టుబడులను క్రమబద్ధీకరించేందుకు కార్తీని సంప్రదించాం. అనంతరం ఆయనకు చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎస్‌సీపీఎల్), దాని అనుబంధ సంస్థలకు 7 లక్షల డాలర్లు(రూ. 3.10 కోట్లు) అందజేశాం. ఆ తరువాత మా ఐఎన్ఎక్స్ మీడియాలోకి విదేశీ పెట్టుబడుల అంశానికి లైన్ క్లియరైంది’ అని ఇంద్రాణి, పీటర్లు వెల్లడించినట్లుగా తన దర్యాప్తు నివేదికల్లో సీబీఐ, ఈడీ తెలిపాయి. అనుమతులివ్వవద్దంటూ ఆదాయ పన్ను శాఖ కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖకు సూచించిన విషయాన్ని కూడా సీబీఐ ప్రస్తావించింది. చిదంబరంను అరెస్టు చేసే అవకాశం సీబీఐ, ఈడీల విచారణలో మరో విషయాన్ని కూడా పీటర్, ఇంద్రాణి ముఖర్జీలు బయటపెట్టారు. అక్రమ లావాదేవీలను క్రమబద్ధం చేసుకునే క్రమంలో భాగంగా తాము అప్పటి ఆర్థికమంత్రి చిదంబరంను నార్త్‌బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో కలిశామని వెల్లడించారు. ‘నా కుమారుడి వ్యాపారాలకు సహకరించండి. అందుకు విదేశీ నిధులందజేయండి’ అని చిదంబరం తమను కోరారని దర్యాప్తు సంస్థలకు తెలిపారు. ఆ తరువాత తాము ఢిల్లీలోని పార్క్ హయత్ హోటల్లో కార్తీని కలిశామని, తమ పని చేసేందుకు ఆయన 10 లక్షల డాలర్లు కోరారని దర్యాప్తులో వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను కూడా దర్యాప్తు సంస్థలు ప్రశ్నించే అవకాశముందని, అవసరమైతే అరెస్ట్ కూడా చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కార్తీ – ఐఎన్ఎక్స్ మీడియా కేసు పూర్వాపరాలు 2017 మే 15: ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి 2007లో రూ.305 కోట్ల పెట్టుబడులను విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతించటంలో అవకతవకలు జరిగాయనీ, ఆ సమయంలో కార్తీ తండ్రి చిదంబరం కేంద్రమంత్రిగా ఉన్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. 2017 జూన్ 16: కేంద్ర హోం శాఖలోని ది ఫారినర్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఎఫ్ఆర్ఆర్వో), బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్లు కార్తీపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశాయి. 2017 ఆగస్టు 10: లుకౌట్ సర్క్యులర్‌పై మద్రాస్ హైకోర్టు స్టే. వారెంట్లు లేనందున లుకౌట్ నోటీసు చెల్లదని తీర్పు. 2017 ఆగస్టు 14: మద్రాస్ హైకోర్టు స్టే ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 2017 ఆగస్టు 18: ఆగస్టు 23న సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా కార్తీకి సుప్రీంకోర్టు ఆదేశం. 2017 ఆగస్టు 23: సీబీఐ కోర్టులో హాజరైన కార్తీ 2017 సెప్టెంబర్ 11: కార్తీకి విదేశాల్లో ఉన్నట్లు భావిస్తున్న 25 ఆస్తుల వివరాలను, లావాదేవీలను సీబీఐ సీల్డు కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. 2017 సెప్టెంబర్ 22: విదేశాల్లో బ్యాంకు అకౌంట్లను కార్తీ మూసివేస్తున్నందున దేశం వదిలి వెళ్లకుండా అడ్డుకున్నట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. 2017 అక్టోబర్ 9: కేంబ్రిడ్జి యూనివర్సిటీలో తన కుమార్తెను చేర్పించేందుకు లండన్ వెళ్లేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టులో కార్తీ పిటిషన్ వేశారు. అక్కడ ఏ బ్యాంకుకూ వెళ్లబోనని అందులో పేర్కొన్నారు. 2017 అక్టోబర్ 9: బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే తనను, తన కుమారుడిని వేధిస్తోందంటూ చిదంబరం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2017 డిసెంబర్ 8: ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసులో సీబీఐ సమన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కార్తీ. 2018 జనవరి 31: తనతోపాటు మరికొందరిపై ఉన్న రెండు లుకౌట్ నోటీసులపై కార్తీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచింది. 2018 ఫిబ్రవరి 16: దేశ, విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టటంలో సహకరించారంటూ కార్తీ చార్టెర్డ్ అకౌంటెంట్భాస్కరరామన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. 2018 ఫిబ్రవరి 24: సీబీఐ దర్యాప్తుతో తన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందనీ, వెంటనే నిలిపివేసేలా ఆదేశివ్వాలని సుప్రీంకోర్టులో చిదంబరం పిటిషన్ వేశారు. -
పిల్లల నీలిచిత్రాల ముఠా గుట్టు రట్టు
న్యూఢిల్లీ: పిల్లల నీలిచిత్రాలకు (చైల్డ్ పోర్నోగ్రఫీ) సంబంధించిన అంతర్జాతీయ రాకెట్‌ను సీబీఐ గురువారం భగ్నం చేసింది. వాట్సాప్‌లో ఓ గ్రూప్‌లో పిల్లల నీలిచిత్రాలు షేర్ అవుతుండటాన్ని గుర్తించిన సీబీఐ మూడు నెలలపాటు శ్రమించి ఈ ముఠా పనిపట్టింది. ఆ గ్రూప్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిరుద్యోగ యువకుడు నిఖిల్ వర్మ అడ్మిన్‌గా ఉండటంతో అతణ్ని సీబీఐ అరెస్టు చేసింది. ఈ గ్రూప్‌లో అమెరికా, చైనా, న్యూజిలాండ్, మెక్సికో, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా తదితర దేశాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. వీడియోలు అప్లోడ్ చేస్తున్న ఐపీ అడ్రస్‌లను గుర్తించిన సీబీఐ.. ఢిల్లీ, ముంబై, నోయిడా, కన్నౌజ్‌లలోని ఐదు ప్రదేశాల్లో గురువారం దాడులు చేసింది. పిల్లల నీలిచిత్రాలను చూడటం, రికార్డు చేయడం, ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం నేరం. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమనా విధించొచ్చు. -
‘రొటొమ్యాక్’ కొఠారి అరెస్టు
ముంబై/న్యూఢిల్లీ: రూ. 3,695 కోట్ల రొటొమ్యాక్ కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. గత నాలుగు రోజులుగా రొటొమ్యాక్ యజమాని విక్రమ్ కొఠారి, అతని కుమారుడు రాహుల్‌ను విచారించిన సీబీఐ గురువారం వారిని అదుపులోకి తీసుకుంది. సీబీఐ ప్రధాన కార్యాలయానికి హాజరైన వారిద్దరూ విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేశామని సీబీఐ ప్రతినిధి వెల్లడించారు. విక్రమ్, రాహుల్‌లు డైరెక్టర్లుగా ఉన్న ‘రొటొమ్యాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్’ 2008 నుంచి ఏడు జాతీయ బ్యాంకుల నుంచి రూ. 2,919 కోట్ల రుణాలు తీసుకుని దారి మళ్లించినట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ ఆరోపించిన సంగతి తెలిపిందే. అసలు, వడ్డీ కలిపి బ్యాంకులకు రొటొమ్యాక్ కంపెనీ రూ. 3,695 కోట్లకు పైగా చెల్లించాలని తేల్చింది. హైదరాబాద్ సెజ్‌లో.. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 11,400 కోట్లకు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు మోసగించిన కేసులో.. పన్ను ఎగవేత ఆరోపణలపై హైదరాబాద్ సెజ్‌లో గీతాంజలి గ్రూపునకు చెందిన రూ.1200 కోట్ల ఆస్తిని ఆదాయపు పన్ను శాఖ గురువారం అటాచ్ చేసింది. ఇప్పటికే గీతాంజలి గ్రూపు, దాని ప్రమోటర్ మెహుల్ చోక్సీకి చెందిన 9 బ్యాంకు ఖాతాల్ని, ఏడు ఆస్తుల్ని ఐటీ శాఖ నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గురువారం ఎనిమిదో రోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కొనసాగిస్తూ.. చోక్సీ, అతని గ్రూపునకు చెందిన రూ. 86.72 కోట్లు, మోదీ గ్రూపునకు చెందిన రూ. 7.8 కోట్ల మ్యూచువల్ ఫండ్లు, షేర్లు స్వాధీనం చేసుకుంది. రూ.కోట్ల రూపాయల విలువైన కార్లను కూడా స్వాధీనం చేసుకున్నామని.. సీజ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ. 100 కోట్లకు పైనే ఉంటుందని ఈడీ తెలిపింది. ఈ కేసులో ఇంతవరకూ రూ. 5,826 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. సీజ్ చేసిన కార్లలో రోల్స్‌రాయిస్ ‘ఘోస్ట్’, మెర్సిడెస్ బెంజ్, పోర్షే పనమెరా, మూడు హోండా కంపెనీ కార్లు, ఒక టయోటా ఫార్చూనర్, ఇన్నోవా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో నీరవ్ కుచెందిన 15 విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. నీరవ్ గురువారం తన ముందు హాజరుకాకపోవడంతో .. ఈడీ తాజాగా మరోసారి సమన్లు జారీచేసింది. ఫిబ్రవరి 26లోపు హాజరుకావాలని ఆదేశించింది. అయితే తన పాస్‌పోర్టును తాత్కాలికంగా రద్దు చేయడం వల్లే హాజరుకాలేదని ఈడీకి నీరవ్ చెప్పినట్లు సమాచారం. ఆచరణసాధ్య ఆలోచనతో రండి! బకాయిల చెల్లింపునకు స్పష్టమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళికతో ముందుకు రావాలని పీఎన్బీ కుంభకోణం సూత్రధారి నీరవ్ మోదీని పంజాబ్ నేషనల్ బ్యాంకు లేఖలో కోరింది. పీఎన్బీ అత్యుత్సాహం వల్లే బకాయిలు చెల్లించే సామర్థ్యం తగ్గిపోయిందని మోదీ రాసిన లేఖకు సమాధానమిస్తూ.. ‘కొందరు బ్యాంకు అధికారులు అక్రమంగా జారీ చేసిన ఎల్వోయూల్ని తప్పుడు మార్గాల్లో మీరు పొందారు. ఏ దశలోను అలాంటి సదుపాయాల్ని మీ కంపెనీలకు మా బ్యాంకు కల్పించలేదు’ అని లేఖలో పీఎన్బీ జనరల్ మేనేజర్ (అంతర్జాతీయ బ్యాంకింగ్ విభాగం) అశ్వినీ వత్స్ పేర్కొన్నారు. ‘మొత్తం అప్పును తీర్చేందుకు మీరు చూపిన నిబద్ధత, చొరవలో ఎక్కడా కూడా ముందస్తు చెల్లింపుల ప్రస్తావన, నిర్దేశిత సమయం పేర్కొనలేదు. ఏదేమైనా బకాయిల్ని తీర్చేందుకు మీ వద్ద సరైన ప్రణాళిక ఉంటే.. ఇప్పటికైనా సమాధానమివ్వండి’ అని లేఖలో పీఎన్బీ పేర్కొంది. సంస్థ వాటాలు, ఆస్తులు అమ్మి రుణం చెల్లిస్తానని చెప్పినా.. అత్యుత్సాహంతో ఆస్తుల్ని సీజ్ చేసి తన బ్రాండ్ పేరును నాశనం చేశారంటూ ఫిబ్రవరి 13, 15 తేదీల్లో పీఎన్బీకి నీరవ్ లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో బకాయిలు చెల్లించడం కష్టమేనని అందులో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
చిట్‌ఫండ్ మోసం కేసులో ఎంపీకి బెయిల్
భువనేశ్వర్ : రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో ఒడిశా హైకోర్టు గురువారం బెంగాలీ నటుడు, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ తపాస్ పాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అలాగే బ్యాంక్‌లో రూ. కోటి జమ చేయాలని ఎంపీకి ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు వ్యక్తులు రెండు లక్షల రూపాయల బాండుతో పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. పాస్‌పోర్టును దర్యాప్తు చేస్తున్న అధికారికి సరెండర్ చేయాలని సూచించింది. చిట్ ఫండ్ కుంభకోణం 2016లో వెలుగులోకి రావడంతో తపాస్ పాల్‌ను డిసెంబర్ 30, 2016న సీబీఐ అరెస్ట్ చేసింది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు విచారణకు సహకరించాలని కోర్టు కోరింది. కోల్‌కత్తాలో తపాస్ పాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన అనంతరం మరింత లోతుగా విచారించడానికి భువనేశ్వర్‌లోని జార్పార జైలుకు తరలించారు. అక్కడకు తీసుకెళ్లిన తర్వాత తపాస్ పాల్ ఆరోగ్యం క్షీణించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తపాస్ పాల్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతకు ముందు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
దబోల్కర్ హత్యకేసులో సీబీఐ తొలి అరెస్ట్
ముంబయి : ప్రముఖ హేతువాది, వైద్యుడు, జర్నలిస్టు నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో తొలి అరెస్ట్ జరిగింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు శుక్రవారం రాత్రి వీరేంద్ర సింగ్ తావ్డేను అరెస్ట్ చేశారు. హిందు జన జాగృతి సభ్యుడు, వైద్యుడు అయిన తావ్డేకు దబోల్కర్ హత్యకేసులో ప్రమేయం ఉండటంతో నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడిని శనివారం మధ్యాహ్నం కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారి దేవ్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ విచారణ కొనసాగుతోందని, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తావ్డేను పుణె కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు. కాగా దబోల్కర్ 2013 ఆగస్ట్ 20న ఆగంతకుల చేతిలో దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. దబోల్కర్ హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.