సీబీఐకి ఓకే.. ఈడీకి నో! | CBI gets P Chidambaram custody till August 26 | Sakshi
Sakshi News home page

సీబీఐకి ఓకే.. ఈడీకి నో!

Published Sat, Aug 24 2019 3:46 AM | Last Updated on Sat, Aug 24 2019 8:37 AM

CBI gets P Chidambaram custody till August 26 - Sakshi

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చిదంబరాన్ని ఈ నెల 26వ తేదీ (వచ్చే సోమవారం) వరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక రక్షణ కల్పించింది. అయితే ఇదే కేసులో చిదంబరం ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నా రు. విచారణను ఎదుర్కొంటున్నారు కూడా!!. సీబీఐ కస్టడీ కూడా ఆగస్టు 26నే ముగుస్తుండటం తో సుప్రీంకోర్టు ఆదేశాలు ఆయనపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. నిజానికి చిదంబరానికి అరెస్టు నుంచి రక్షణ కల్పించవద్దంటూ ఈడీ వాదించినా, కోర్టు వారి వాదనను తిరస్కరించింది.  ఈడీ, సీబీఐలు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలన్న చిదంబరం అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 20న తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయడం తెలిసిందే.

అలాగే తనను ఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాలను కూడా సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్‌ వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఆగస్టు 26న విచారణ జరుపుతామనీ, అప్పటివరకు చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పిస్తున్నామని జస్టిస్‌ ఆర్‌.భానుమతి, జస్టిస్‌ ఏఎస్‌.బోపన్నల ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. మరోవైపు ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల అన్ని లావాదేవీలూ, చెల్లింపుల వివరాలు ఇవ్వాలంటూ బ్రిటన్, స్విట్జర్లాండ్, సింగపూర్, మారిషస్, బెర్ముడాలకు  సీబీఐ లెటర్‌ రొగేటరీలను (ఎల్‌ఆర్‌) పంపింది.

సోమవారమే ఆ పత్రాలు ఇవ్వండి: జడ్జీలు
ఈ కేసులో ఈడీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, చిదంబరం తరఫున కాంగ్రెస్‌ నేతలు, న్యాయవాదులు కపిల్‌ సిబల్, అభిషేక్‌ మను సింఘ్వీ వాదించారు. చిదంబరానికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చిన వెంటనే.. మెహతా మరికొన్ని పత్రాలను సీల్డు కవర్‌లో జడ్జీలకు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ పత్రాలను చదివాక న్యాయమూర్తులు తమ అంతరాత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. మెహతా చర్యను సిబల్‌ వ్యతిరేకించారు. హైకోర్టులోనూ వాదనలు పూర్తయిన తర్వాత ఈడీ మరిన్ని పత్రాలను జడ్జీలకు అందజేసిందన్నారు. దీంతో మెహతా ఇచ్చిన పత్రాలను చదివేందుకు జడ్జీలు నిరాకరించారు. ఆ పత్రాలను సోమవారమే ఇవ్వాలని చెప్పారు.  

విదేశాల్లో 11 ఆస్తులు, 17 బ్యాంకు ఖాతాలు
చిదంబరం విదేశాల్లో 11 చోట్ల ఆస్తులను కూడబెట్టారనీ, 17 బ్యాంకుల్లో ఖాతాలున్నాయని మెహతా తెలిపారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా విదేశాల నుంచి నిధులు అందుకునేందుకు ఎఫ్‌ఐపీబీ ఆమోదం తీసుకునే విషయమై ఐఎన్‌ఎక్స్‌ గ్రూప్‌ ప్రమోటర్లు పీటర్‌ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలు చిదంబరాన్ని కలిసినప్పుడు కూడా, తన కుమారుడిని ‘జాగ్రత్తగా చూసుకోవాలి’ అని చిదంబరం వారితో అన్నట్లు మెహతా కోర్టుకు చెప్పారు. ‘అరెస్టు నుంచి రక్షణ కల్పించి విచారిస్తే చిదంబరం నిజాలు చెప్పరు. మోసం వివరాలను పూర్తిగా తెలుసుకునేందుకు ఆయనను కస్టడీలో ఉంచుకునే విచారించాలి. డొల్ల కంపెనీలను సృష్టించిన అనేకమంది చిదంబరం మనవరాలి పేరిట వీలునామా రాశారు. వీటిపై ప్రశ్నించాల్సి ఉంది’ అని ఆయన కోర్టుకు చెప్పారు. గతంలో చిదంబరాన్ని విచారించినప్పుడు సరైన సమాధానాలు ఇవ్వలేదని మెహతా అన్నారు.

కోర్టు ఆ వ్యాఖ్యలు చేయాల్సింది కాదు
సిబల్‌ వాదిస్తూ ఈడీ సమర్పించిన ఓ నోట్‌లోని మొత్తం సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా హైకోర్టు రికార్డులోకి తీసుకుని చిదంబరానికి ముందస్తు బెయిలును నిరాకరించిదనీ, అందులోని సమాచారంపై తామకు వాదనలు వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని సుప్రీంకోర్టుకు చెప్పారు. సింఘ్వీ వాదిస్తూ ‘ఆగస్టు 20న ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిలును తిరస్కరిస్తూ, ఆర్థిక నేరగాళ్లు ముందస్తు బెయిలు పొందకుండా చట్టాలను పార్లమెంటు సవరించాల్సిన సమయం వచ్చిందని జడ్జి అన్నారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. ఐఎన్‌ఎక్స్‌తో సంబంధం లేని ఎయిర్‌సెల్‌– మ్యాక్సిస్‌ కేసును ఆ రోజు జడ్జి ప్రస్తావించారు. అసలు సంబంధం లేని ఎయిర్‌సెల్‌– మ్యాక్సిస్‌ కేసు గురించి ఆయన ఎందుకు మాట్లాడారు? అంటే ఐఎన్‌ఎక్స్‌ కేసులో బెయిలు ఇవ్వకూడదని ఆ జడ్జి ముందుగానే అనుకున్నారు’ అని సుప్రీంకోర్టుకు తెలిపారు. ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 26కు వాయిదా వేసింది.

ఎయిర్‌సెల్‌– మ్యాక్సిస్‌ కేసులో చిదంబరానికి ఊరట
ఎయిర్‌సెల్‌– మ్యాక్సిస్‌ కేసుల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చిదంబరం, ఆయన కొడుకు కార్తీలను అరెస్టు చేయకుండా ఉన్న తాత్కాలిక రక్షణను ఢిల్లీ కోర్టు సెప్టెంబరు 3 వరకు పొడిగించింది. ముందస్తు బెయిలు కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లపై ఆదేశాలను కూడా సెప్టెంబర్‌ 3 వరకు రిజర్వ్‌లో ఉంచింది. అయితే ఎయిర్‌సెల్‌– మ్యాక్సిస్‌ కేసుల్లో సీబీఐ, ఈడీల అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేసేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. చిదంబరం, కార్తీలకు సంబంధించిన ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, విచారణను వాయిదా వేయాలని సీబీఐ, ఈడీ కోరాయి. దీనికి ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ‘పరిస్థితులు నాకు చాలా ఇబ్బందికరంగా మారాయి. ప్రతిరోజూ మీరు ఎందుకు వాయిదాలు అడుగుతున్నారు? దాదాపు సంవత్సరం నుంచి ఇలాగే చేస్తున్నారు’ అని మందలించారు. చిదంబరానికి ముందుస్తు బెయిలు అంశంలో ఆయనకు వ్యతిరేకంగా వాదనలేమైనా ఉంటే, వాటిని వినిపించేందుకు కోర్టు సెప్టెంబరు 3 వరకు సీబీఐ, ఈడీలకు గడువు ఇచ్చింది. రిజర్వ్‌లో ఉంచిన ఆదేశాలను సెప్టెంబరు 3న వెలువరిస్తామంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement