
మారన్‌కు ఊరట
గండం తప్పినట్టేనా
రాజకీయ కక్ష : స్టాలిన్
తప్పుడు కేసు : టీకేఎస్
సాక్షి, చెన్నై :డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ అరెస్టు గండం నుంచి బయట పడ్డారు. కాగా, రాజకీయ కక్ష సాధిస్తున్నారని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేయగా, తప్పుడు కేసును ఛేదిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రధానంగా నాలుగు వందలకు పైగా హై స్పీడ్ బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్లను అక్రమంగా తన సోదరుడు కళానిధి మారన్‌కు సంబంధించిన సన్ గ్రూప్‌కు ఉపయోగించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్న ఆరోపణలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో సన్ గ్రూప్‌లో పనిచేస్తున్న ముగ్గుర్ని అరెస్టు సైతం చేశారు. ఇక తదుపరి దయానిధి మారన్ వంతేనన్న ప్రచారం బయలు దేరింది.
అయితే, ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందడంతో అరెస్టు గండం నుంచి బయట పడ్డారు. ఈ పరిస్థితుల్లో సోమవారం ఆ బెయిల్‌ను మద్రాసు హైకోర్టు రద్దు చేయడంతో ఇక, మారన్‌ను అరెస్టు చేయడం ఖాయం అన్న సంకేతాలు బయలు దేరాయి. సీబీఐ ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశించిన దృష్ట్యా, మారన్‌ను అరెస్టైన పక్షంలో డీఎంకేకు కొత్త చిక్కులు తప్పదన్న చర్చ బయలు దేరింది. ఊరట : ఇక మారన్ అరెస్టయినట్టేనన్న ప్రచారం ఊపందుకోవడంతో ఈ ప్రభావం ఎక్కడ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మీద చూపుతుందోనన్న బెంగ డీఎంకే వర్గాల్లో బయలు దేరింది. అయితే, మద్రాసు హైకోర్టు బెయిల్ రద్దును వ్యతిరేకిస్తూ, తన అరెస్టుకు సీబీఐ ఉవ్విల్లూరుతుండటాన్ని ఎత్తి చూపుతూ మారన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన సుప్రీంకోర్టు మారన్‌కు ఊరట కల్గించే విధంగా ఆదేశాలు ఇవ్వడం డీఎంకే వర్గాల్లో ఆనందాన్ని నింపాయి. అదే సమయంలో ఈ కేసు విషయంలో సీబీఐకు కోర్టు సంధించిన పలు రకాల ప్రశ్నలు, మారన్ అరెస్టుకు సీబీఐ ఎత్తుగడలపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలతో ఇక, మారన్ అరెస్టు గండం నుంచి తాత్కాలికంగా గట్టెక్కినట్టేనన్న ధీమా డీఎంకే వర్గాల్లో బయలు దేరింది. సెప్టెంబరు రెండో వారం వరకు మారన్ అరెస్టుకు చర్యలు తీసుకోకూడదన్నట్టుగా కోర్టు ఆదేశాలు ఇచ్చినా, తదుపరి సాగే విచారణ మేరకు మారన్ పూర్తిగా ఈ గండం నుంచి బయట పడతారన్న ఆశాభావాన్ని డీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈ విషయంగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్‌ను కదిలించగా, కోర్టు సంధించిన ప్రశ్నల్లోనే సమాధానం ఉందిగా అని వివరించారు. రాజకీయ కక్షే అంటూ కోర్టు సైతం చెప్పడం బట్టి చూస్తే, ఏ మేరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్‌ను కదిలించగా, ఇది తప్పుడు కేసు అని, రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ తప్పుడు కేసు నుంచి మారన్ త్వరలో బయట పడుతారని ధీమా వ్యక్తం చేశారు.