కార్తీ చిదంబరం అరెస్టు | CBI arrests Karti Chidambaram | Sakshi
Sakshi News home page

కార్తీ చిదంబరం అరెస్టు

Published Thu, Mar 1 2018 1:20 AM | Last Updated on Thu, Sep 27 2018 5:12 PM

CBI arrests Karti Chidambaram - Sakshi

బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టుకు హాజరవుతున్న కార్తీ చిదంబరం

న్యూఢిల్లీ: అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం కొడుకు కార్తీని సీబీఐ బుధవారం చెన్నైలో అరెస్టు చేసింది. మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు హాజరయ్యేందుకు లండన్‌ నుంచి భారత్‌కు వచ్చిన కార్తీని చెన్నై విమానాశ్రయంలోనే సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం ఢిల్లీకి తీసుకెళ్లి, అక్కడి కోర్టులో హాజరుపరిచింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా నుంచి కోట్ల రూపాయల మేర  ముడుపులు అందుకున్న కేసులో కార్తీని ప్రశ్నించేందుకు 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా.. ఒకరోజు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.

గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ కోర్టులో హాజరుపర్చాలంది.  రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కార్తీని అరెస్ట్‌ చేశారని కాంగ్రెస్‌ ఆరోపించగా.. ఇందులో ప్రభుత్వ జోక్యం ఏదీ లేదని, చట్ట ప్రకారమే దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. అయితే, ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించి నాటి ఆర్థిక మంత్రి చిదంబరంను కూడా కలిశామని అప్పటి ఐఎన్‌ఎక్స్‌ డైరెక్టర్లు ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్‌ ముఖర్జీ సీబీఐ, ఈడీల విచారణలో వెల్లడించడం సంచలనం రేపుతోంది.

విచారణకు సహకరించడం లేదనే..
విచారణకు సహకరించకపోవడం వల్లనే కార్తీని అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందని సీబీఐ స్పష్టం చేసింది. అలాగే, ఆయన పలుమార్లు విదేశాలకు వెళ్తుండటంతో అక్కడి బ్యాంకుల్లోని సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశం ఉందంది. విచారణకు హాజరవకుండా పూర్తిగా విదేశాల్లోనే ఉండిపోయే పరిస్థితి కూడా ఉందని, అందువల్లనే అదుపులోకి తీసుకుని విచారిస్తామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ వాదనను కార్తీ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. గతంలోనే ఎన్నోసార్లు సీబీఐ, ఈడీలు కార్తిని విచారించాయనీ, ఇప్పుడు కూడా ఈడీ విచారణకు హాజరవ్వడానికే ఆయన భారత్‌ వచ్చారని కోర్టుకు తెలిపారు. ఆయన అరెస్టుకు సరైన కారణాలే లేవన్నారు. కాగా, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుతోపాటు 2006లో ఎయిర్‌సెల్‌–మ్యాక్సిస్‌ ఒప్పందానికి ఎఫ్‌ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతులపై కూడా సీబీఐ విచారిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా మనీలాండరింగ్‌ కేసులో కార్తీని ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది.

రాజకీయ కక్షతోనే..
రాజకీయ కక్షతోనే బీజేపీ ప్రభుత్వం కార్తీని అరెస్టు చేయించిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఎన్డీయే హయాంలో వెలుగుచూస్తున్న కుంభకోణాలు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఎత్తుగడ వేసిందంది. కాంగ్రెస్‌ ప్రజలకు నిజాలు చెప్పడాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని ఇలాంటి చర్యలతో ఆపలేరని ఆ పార్టీ నేత రణదీప్‌ సుర్జేవాలా అన్నారు.

కాంగ్రెస్‌పై విమర్శలు చేయడానికి బీభత్సంగా మాటలను వాడే ప్రధాని మోదీ.. గత 10 రోజుల్లో బీజేపీ హయంలో రూ. 30 వేల కోట్ల కుంభకోణాలు బయటపడినా నోరు తెరవడం లేదన్నారు. ‘వేల కోట్లు ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయిన నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యాను ప్రభుత్వం ఏం చేయదు. కేసు విచారణకు హాజరయ్యేందుకు విదేశం నుంచి తిరిగొచ్చిన కార్తీని అరెస్టు చేస్తుంది’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ విమర్శించారు.

ప్రభుత్వ జోక్యం లేదు..
కార్తీ చిదంబరం కేసులో ప్రభుత్వ జోక్యం ఏమీ లేదనీ, ఉండదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. చట్టం ప్రకారమే దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయనీ ఆయన తప్పు చేశారో లేదో ఆధారాలే చెబుతాయని పేర్కొన్నారు.

కేసు విచారణకు రాకముందే..
సీబీఐ, ఈడీలు తప్పుడు కేసులతో తనను, తన కుటుంబ సభ్యలను తరచూ వేధిస్తున్నాయని, తమ ప్రాథమిక హక్కులను రక్షించాలని కోరుతూ చిదంబరం గతవారమే సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దర్యాప్తు సంస్థలు తమపై ‘అక్రమ విచారణలు’ జరపకుండా అడ్డుకోవాలని ఆయన పిటిషన్‌లో కోరారు.

అయితే సుప్రీంకోర్టులో చిదంబరం పిటిషన్‌ ఇంకా విచారణకు కూడా రాకముందే కార్తిని సీబీఐ అరెస్టు చేయడం గమనార్హం. మార్చి 1న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసుపై స్టే విధించాలనీ, లేదా కనీసం విచారణను కొద్దికాలం వాయిదా వేయాలంటూ కార్తి సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ వేశారు. గతవారం ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా కార్తి తరఫున వాదిస్తున్న కపిల్‌ సిబల్‌ కూడా ‘మీరు కార్తీని అరెస్టు చేయాలని అనుకుంటున్నారా?’ అని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించడం గమనార్హం.

ఏమిటీ ఐఎన్‌ఎక్స్‌ కేసు?
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు 2007 మార్చిలో పి.చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటిది. కూతురి హత్యకేసులో నిందితులుగా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న భార్యాభర్తలు ఇంద్రాణీ, పీటర్‌ ముఖర్జీల చేతుల్లో అప్పట్లో ఈ కంపెనీ ఉండేది. తమ కంపెనీలోకి 46 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతించాలంటూ వారు.. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో పనిచేసే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ)కి దరఖాస్తు చేసుకున్నారు.

రెండు నెలల అనంతరం ఎఫ్‌ఐపీబీ ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో 46 శాతం ఎఫ్‌డీఐకి అనుమతినిచ్చింది. అయితే అప్పటికే 26 శాతం ఎఫ్‌డీఐలు ఐఎన్‌ఎక్స్‌లో ఉన్నాయి. ఆ విషయాన్ని ముఖర్జీలు ఎఫ్‌ఐపీబీ వద్ద దాచిపెట్టారు. పరిమితికి మించి రూ. 305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులను తీసుకున్నారు. ఈ అవకతవకలను ఆదాయ పన్ను శాఖ గుర్తించి, ఆర్థిక శాఖను సైతం అప్రమత్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఈడీ సూచన మేరకు గతేడాది మే 15న సీబీఐ తొలి కేసును నమోదు చేసింది. ఆ తర్వాత జరిపిన సోదాల్లో తమకు పలు ఆధారాలు లభించాయని ఈడీ, సీబీఐలు చెబుతున్నాయి.  

తండ్రి మద్దతుతోనే..
2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎఫ్‌ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతుల విషయంలో జరిగిన ఉల్లంఘనలను సరిచేసేందుకు కార్తీ తమ నుంచి పది లక్షల డాలర్లు తీసుకున్నట్లు ఐఎన్‌ఎక్స్‌ మీడియా మాజీ డైరెక్టర్లు పీటర్‌ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీ ఇటీవల సీబీఐ విచారణలో బయటపెట్టారు. అందుకు అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న తన తండ్రి పీ చిదంబరం సహకరిస్తారని కార్తీ చెప్పాడని వారు వెల్లడించారు.

‘కార్తీ కోరిన 10 లక్షల డాలర్లలో 7 లక్షల డాలర్లను(రూ.3.10 కోట్లు) కార్తీకి విదేశాల్లోని ఆయన అనుబంధ సంస్థల ద్వారా అందించాం’ అని ముఖర్జీలు మెజిస్ట్రేట్‌ ముందు ఇచ్చిన వాంగ్మూలంలోనూ స్పష్టం చేశారు. ‘ఐఎన్‌ఎక్స్‌ మీడియాలోకి రూ. 305 కోట్ల విదేశీ పెట్టుబడులను అక్రమంగా పొందాం. ఆ పెట్టుబడులను క్రమబద్ధీకరించేందుకు కార్తీని సంప్రదించాం. అనంతరం ఆయనకు చెందిన అడ్వాంటేజ్‌ స్ట్రాటెజిక్‌ కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఏఎస్‌సీపీఎల్‌), దాని అనుబంధ సంస్థలకు 7 లక్షల డాలర్లు(రూ. 3.10 కోట్లు) అందజేశాం. ఆ తరువాత మా ఐఎన్‌ఎక్స్‌ మీడియాలోకి విదేశీ పెట్టుబడుల అంశానికి లైన్‌ క్లియరైంది’ అని ఇంద్రాణి, పీటర్‌లు వెల్లడించినట్లుగా తన దర్యాప్తు నివేదికల్లో సీబీఐ, ఈడీ తెలిపాయి. అనుమతులివ్వవద్దంటూ ఆదాయ పన్ను శాఖ కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖకు సూచించిన విషయాన్ని కూడా సీబీఐ ప్రస్తావించింది.

చిదంబరంను అరెస్టు చేసే అవకాశం
సీబీఐ, ఈడీల విచారణలో మరో విషయాన్ని కూడా పీటర్, ఇంద్రాణి ముఖర్జీలు బయటపెట్టారు. అక్రమ లావాదేవీలను క్రమబద్ధం చేసుకునే క్రమంలో భాగంగా తాము అప్పటి ఆర్థికమంత్రి చిదంబరంను నార్త్‌బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో కలిశామని వెల్లడించారు. ‘నా కుమారుడి వ్యాపారాలకు సహకరించండి. అందుకు విదేశీ నిధులందజేయండి’ అని చిదంబరం తమను కోరారని దర్యాప్తు సంస్థలకు తెలిపారు. ఆ తరువాత తాము ఢిల్లీలోని పార్క్‌ హయత్‌ హోటల్లో కార్తీని కలిశామని, తమ పని చేసేందుకు ఆయన 10 లక్షల డాలర్లు కోరారని దర్యాప్తులో వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను కూడా దర్యాప్తు సంస్థలు ప్రశ్నించే అవకాశముందని, అవసరమైతే అరెస్ట్‌ కూడా చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.  


కార్తీ – ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు పూర్వాపరాలు

2017 మే 15: ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థలోకి 2007లో రూ.305 కోట్ల పెట్టుబడులను విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) అనుమతించటంలో అవకతవకలు జరిగాయనీ, ఆ సమయంలో కార్తీ తండ్రి చిదంబరం కేంద్రమంత్రిగా ఉన్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది.

2017 జూన్‌ 16:  కేంద్ర హోం శాఖలోని ది ఫారినర్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(ఎఫ్‌ఆర్‌ఆర్‌వో), బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌లు కార్తీపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేశాయి.

2017 ఆగస్టు 10:  లుకౌట్‌ సర్క్యులర్‌పై మద్రాస్‌ హైకోర్టు స్టే. వారెంట్లు లేనందున లుకౌట్‌ నోటీసు చెల్లదని తీర్పు.

2017 ఆగస్టు 14: మద్రాస్‌ హైకోర్టు స్టే ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

2017 ఆగస్టు 18: ఆగస్టు 23న సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా కార్తీకి సుప్రీంకోర్టు ఆదేశం.

2017 ఆగస్టు 23: సీబీఐ కోర్టులో హాజరైన  కార్తీ  

2017 సెప్టెంబర్‌ 11:  కార్తీకి విదేశాల్లో ఉన్నట్లు భావిస్తున్న 25 ఆస్తుల వివరాలను, లావాదేవీలను సీబీఐ సీల్డు కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించింది.

2017 సెప్టెంబర్‌ 22:  విదేశాల్లో బ్యాంకు అకౌంట్లను కార్తీ మూసివేస్తున్నందున దేశం వదిలి వెళ్లకుండా అడ్డుకున్నట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది.

2017 అక్టోబర్‌ 9: కేంబ్రిడ్జి యూనివర్సిటీలో తన కుమార్తెను చేర్పించేందుకు లండన్‌ వెళ్లేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టులో కార్తీ పిటిషన్‌ వేశారు. అక్కడ ఏ బ్యాంకుకూ వెళ్లబోనని అందులో పేర్కొన్నారు.

2017 అక్టోబర్‌ 9: బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే తనను, తన కుమారుడిని వేధిస్తోందంటూ చిదంబరం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

2017 డిసెంబర్‌ 8:  ఎయిర్‌సెల్‌–మాక్సిస్‌ కేసులో సీబీఐ సమన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కార్తీ.

2018 జనవరి 31: తనతోపాటు మరికొందరిపై ఉన్న రెండు లుకౌట్‌ నోటీసులపై కార్తీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మద్రాస్‌ హైకోర్టుకు వెళ్లాలని సూచింది.

2018 ఫిబ్రవరి 16:  దేశ, విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టటంలో సహకరించారంటూ కార్తీ చార్టెర్డ్‌ అకౌంటెంట్‌భాస్కరరామన్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది.

2018 ఫిబ్రవరి 24: సీబీఐ దర్యాప్తుతో తన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందనీ, వెంటనే నిలిపివేసేలా ఆదేశివ్వాలని సుప్రీంకోర్టులో చిదంబరం పిటిషన్‌ వేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement