సాక్షి, ముంబై: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్‌నేత చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తన బెయిల్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఆర్థికమంత్రి చిదంబరం వేసిన పిటిషన్‌పై స్పందించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి బుధవారం సుప్రీం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.
తన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ చిదంబరం చేసుకున్న అప్పీల్‌పై జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ నోటీసు జారీ చేసింది. ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నవంబర్ 25 లోగా తమ స్పందన దాఖలు చేస్తామని ధర్మాసనానికి తెలిపారు. జస్టిస్ ఎఎస్ బోపన్న, హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని నవంబర్ 26కు వాయిదా వేసింది. మూడు నెలల పాటు కస్టడీలో ఉన్నందున చిదంబరానికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపున వాదించిన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు విన్నవించారు.
కాగా ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న చిదంబరం బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈడీ దర్యాప్తు చేస్తున్న ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో చిదంబరం కీలక పాత్ర పోషించినట్టు కోర్టు అభిప్రాయపడింది. దీనిపై చిదంబరం సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
చదవండి : చిదంబరానికి స్వల్ప ఊరట
Comments
Please login to add a commentAdd a comment