జైలులో చిదంబరం కోరికల చిట్టా.. | P Chidambaram Sent to Tihar Jail For 14 Days | Sakshi
Sakshi News home page

తీహార్‌ జైలుకు చిదంబరం

Published Fri, Sep 6 2019 1:14 AM | Last Updated on Fri, Sep 6 2019 9:53 AM

P Chidambaram Sent to Tihar Jail For 14 Days - Sakshi

గురువారం చిదంబరంను పోలీస్‌ వ్యాన్‌లో తీహార్‌ జైలుకు తరలిస్తున్న దృశ్యం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ కోర్టు షాకిచ్చింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో 15 రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు చిదంబరాన్ని గురువారం కోర్టు ముందు హాజరుపర్చగా, ఈ నెల 19 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ ప్రత్యేక జడ్జి ఆదేశాలు జారీచేశారు. దీంతో పోలీసులు ఆయన్ను ఢిల్లీలోని తీహార్‌ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జైలుకు వెళ్లకుండా ఉండేందుకు చిదంబరం విశ్వప్రయత్నాలు చేశారు.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమని న్యాయవాది కపిల్‌ సిబల్‌ ద్వారా తెలియజేశారు. తనను కస్టడీలోకి తీసుకోవాలని ఈడీని కోరారు. ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణ సాగుతోందనీ, ఒకవేళ చిదంబరానికి బెయిల్‌ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. అయితే సీబీఐ చిదంబరంపై నిరాధార ఆరోపణలు చేస్తోందనీ, ఆయన నేరం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కపిల్‌ సిబల్‌ కోర్టుకు చెప్పారు.

ఈడీకి లొంగిపోయేందుకు చిదంబరం సిద్ధంగా ఉన్నారన్నారు. దీతో ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్‌ కుమార్, చిదంబరాన్ని ఈ నెల 19 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో పోలీసులు నీలిరంగు బస్సులో చిదంబరాన్ని కోర్టు నుంచి 18 కి.మీ దూరంలోని తీహార్‌ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చిదంబరం బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్గం సుగమమైంది. 74వ పుట్టినరోజును జరుపుకోవడానికి సరిగ్గా 11 రోజుల ముందు చిదంబరం తీహార్‌ జైలుకు చేరుకోవడం గమనార్హం.

సుప్రీంలో ఎదురుదెబ్బ
అంతకుముందు ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఆర్‌.భానుమతి, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నల ధర్మాసనం తిరస్కరించింది. ‘ఈ కేసులో నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయడం సరికాదు. ఎందుకంటే ఆర్థిక నేరాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చిదంబరాన్ని అరెస్ట్‌ చేసేందుకు అవకాశమున్నప్పటికీ ఈడీ చొరవ తీసుకోలేదు.

మరోవైపు ఎయిర్‌సెల్‌–మాక్సిస్‌ కేసులో చిదంబరానికి ఢిల్లీ ప్రత్యేక కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరుచేసింది. కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సహాక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) ఐఎన్‌ఎక్స్‌ మీడియాలోకి రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల కోసం అనుమతులు జారీచేసింది. ఈ సందర్భంగా ముడుపులు చేతులు మారినట్లు, మనీలాండరింగ్‌ జరిగినట్లు సీబీఐ, ఈడీ కేసులు నమోదుచేశాయి. ఈ కేసులో గతనెలలో చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్‌ చేసింది.  

కార్తీ గడిపిన జైలు గదిలోనే..
సీబీఐ కోర్టు ఆదేశాల నేపథ్యంలో చిదంబ రానికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు తీహార్‌లోని జైల్‌ నంబర్‌ 7కు తరలించారు. ఈ విషయమై తీహార్‌ జైలు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు చిదంబరానికి ప్రత్యేక గదిని కేటాయించామనీ, అందులో వెస్ట్రన్‌ టాయిలెట్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. ఇతర ఖైదీల్లాగే చిదంబరం కూడా లైబ్రరీని వాడుకోవచ్చనీ, టీవీ చూడవచ్చని వెల్లడించారు.

రాత్రి భోజనంలో భాగంగా చిదంబరానికి అన్నం, పప్పు, తాలింపును అందజేస్తామన్నారు. ఉదయం 7–8 గంటల మధ్య అల్పాహారం అందజేస్తామని పేర్కొన్నారు. జైలులో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్‌ నుంచి చిదంబరం నీరు తాగవచ్చనీ, లేదంటే క్యాంటీన్‌ నుంచి కొనుక్కోవచ్చని తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నమోదుచేసిన కేసులో కుమారుడు కార్తీ గతేడాది 12 రోజులు గడిపిన జైలు గదిలోనే ప్రస్తుతం చిదంబరాన్ని ఉంచడం గమనార్హం.

చిద్దూ కోరికల చిట్టా
14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి కోర్టు అప్పగించడంతో చిదంబరం వెంటనే రెండు ప్రత్యేక పిటిషన్లను న్యాయస్థానంలో దాఖలుచేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున మందులతో పాటు కళ్లద్దాలను తీహార్‌ జైలులోకి తీసుకెళ్లేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టును కోరారు. అలాగే తాను జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న వ్యక్తిని అయినందున ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించాలనీ, అందులో పాశ్చాత్య దేశాల్లో వాడే టాయిలెట్‌ను ఏర్పాటుచేసేలా జైలు అధికారుల్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. జైలులో తనకు తగిన భద్రత కల్పించాలని పిటిషన్‌లో కోరారు. చిదంబరం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి అజయ్‌ కుమార్, ప్రత్యేక గది, వెస్ట్రన్‌ టాయిలెట్‌ ఏర్పాట్లు చేయాలని తీహార్‌ జైలు అధికారుల్ని ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement