
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తీహార్ జైల్లో ఉన్న ఆయనను ఈ సారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ బృందం ఉదయం 8:15 గంటలకే తీహార్ జైలుకి చేరుకున్నారు. దాదాపుగా రెండు గంటల సేపు అక్కడే చిదంబరాన్ని విచారించారు.
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మనీ ల్యాండరింగ్‌పై గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయనని అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 14 రోజుల కస్టడీ విచారణ కోసం చిదంబరాన్ని అప్పగించాలంటూ కోర్టుని కోరారు. గతంలో ఎన్నోసార్లు చిదంబరాన్ని ఈడీ ప్రశ్నించినప్పటికీ ఆయనను అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే చిదంబరాన్ని అరెస్ట్ చేయవద్దనీ, ఆయనను బలవంతపెట్టే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని గతంలో కోర్టు ఆదేశాలు ఉండేవి.
అయితే చిదంబరాన్ని విచారించవచ్చునని అవసరమైతే అరెస్ట్ కూడా చేయవచ్చునంటూ ట్రయల్ కోర్టు మంగళవారమే అనుమతినిచ్చింది. దీంతో ఈడీ తన విచారణలో కొత్త అంశాలను రాబట్టడానికి సకల సన్నాహాలు చేస్తోంది. చిదంబరాన్ని ఈడీ కస్టడీకి అప్పగించడానికి కోర్టు అనుమతిస్తే అన్ని కోణాల నుంచి విచారణకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల అంశం చుట్టూనే విచారణ సాగుతుందని ఈడీ కార్యాలయం అధికారులు తెలిపారు. ఈడీ బృందం ప్రశ్నించడానికి వచ్చినప్పుడు జైలు పరిసరాల్లో చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తీ కూడా కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment