ఇకపై నన్నెవరూ అలా పిలవలేరు
భిలాయ్: 'నేను చచ్చిపోతే.. ఇక నన్నెవరూ వ్యభిచారి .. రేప్ బాధితురాలు' అని పిలవలేరు అంటూ ఓ అత్యాచార బాధితురాలు తీవ్ర ఆవేదనతో రాసిన సూసైడ్ నోట్లోని మాటలు. తనకు న్యాయం జరగదనే నిరాశతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఇరుగుపొరుగు సూటిపోటి మాటలు, కేసు విచారణలో జరుగుతున్న జాప్యం వెరసి ఆమె ఉసురు తీశాయి. ఛత్తీస్ గడ్ లోని భిలాయ్ కు చెందిన బాధితురాలు గురువారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందింది. చనిపోతే ఇక తనను ఎవరూ ఆ దృష్టితో చూడరని, రేప్ బాధితురాలిగా పిలవరని సూసైడ్ లేఖలో రాయడం అందర్నీ కలచి వేసింది.
వివరాల్లోకి వెళితే... 2014 జూన్ లో వైద్యం కోసం వెళ్లిన మహిళపై ఓ వైద్యుడు, ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి అఘాయిత్యానికి తెగబడ్డారు. భిలాయ్ లోని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. జాండీస్ వ్యాధి ముదిరిందని బాధితురాలి బంధువులను మభ్యబెట్టిన ఆ వైద్యుడుతో పాటు మరో ఇద్దరు మూడు రోజులపాటు లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. అంతటితో వారి దురాగతం ఆగిపోలేదు. ఆ దృశ్యాలను వీడియో తీశామని..ఎవరికైనా చెబితే ఈ వీడియో బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. తమ కోరిక తీర్చాలని.. లేదంటే ఆ వీడియోను లీక్ చేస్తామని భయపెట్టి మరీ ముగ్గురూ ఆమెను లొంగదీసుకున్నారు.
ఇలా ఆరు నెలల పాటు వారి అరాచకం కొనసాగింది. చివరికి ఆమె గత ఏడాది జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఈ కేసు విచారణలో ఉండగానే తీవ్ర మానసిక వేదనతో సూసైడ్ నోట్ రాసి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఎపుడు కోర్టుకు వెళ్లినా జడ్జి రావడంలేదనీ ..తన తరఫున వాదించే న్యాయవాది వల్ల కూడా ఫలితం లేకపోయిందని వాపోయింది. ఇక తనకు న్యాయం జరుగుతుందున్న నమ్మకం పోయిందని, చివరికి పోలీసులు కూడా నిందితులకే వత్తాసు పలుకుతున్నారని ఆ లేఖలో పేర్కొంది. దీంతోపాటుగా పలువురిని తన ఆత్మహత్యకు బాధ్యులుగా పేర్కొంది.
మరోవైపు ఇప్పటికీ తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బాధితురాలి సోదరుడు వాపోయాడు. కేసును ఉపసంహరించు కోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారని అతడు తెలిపాడు. కాగా బాధితురాలి సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించనున్నామని పోలీసులు తెలిపారు. లేఖలో పేర్కొన్న వ్యక్తులందరినీ విచారిస్తామన్నారు. ఫిబ్రవరి 2తేదీన ఈ కేసు విచారణకు రానుంది.