Bhilai
-
నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్
మనదేశంలోని పలు ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు కనిపిస్తాయి. వీటిని ఇంటి పైకప్పులపైన, మైదాన ప్రాంతాల్లో చూడవచ్చు. అయితే నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్‌ను ఎప్పుడైనా చూశారా? త్వరలో నీటిపై తేలియాడే 15 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్‌ను మనం చూడబోతున్నాం. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో గల భిలాయిలో సెయిల్ భిలాయి స్టీల్ ప్లాంట్ తాజాగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో భాగంగా ముందుగా 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధిత అధికారులు మరోదా-1 జలాశయంలో శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు.ఇది ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటవుతున్న తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్. కర్బన ఉద్గారాలను వీలైనంత వరకూ తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను చేపడుతోంది. ఈ ప్లాంట్ ఏడాదికి 34.26 మిలియన్ యూనిట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయనున్నదనే అంచనాలున్నాయి. అలాగే ఈ ప్రాజెక్టు కారణంగా ఏటా 28,330 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి. -
స్కార్పియోను ఢీకొన్న లారీ: 10 మంది మృతి
వెలిగండ్ల: ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందగావ్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం స్కార్పియో, లారీ ఢీకొనడంతో 10 మంది దుర్మరణం చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందినవారిలో 9 మంది ప్రకాశం జిల్లాకు చెందినవారు. వారు డోంగర్‌గఢ్ సమీపంలోని మా బమలేశ్వరీ దేవి ఆలయాన్ని సందర్శించుకుని తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. భిలాయ్‌లోని క్యాంప్–1లో నివాసముంటున్న 13 మంది శనివారం డోంగర్‌గఢ్‌లోని మా బమలేశ్వరీ దేవి ఆలయానికి స్కార్పియో వాహనంలో వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఉదయం 7 గంటల సమయంలో సోమ్ని గ్రామం సమీపంలో రాజనందగావ్– దుర్గ్ రోడ్డు వద్ద వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం పాపాయిపల్లికి చెందిన శెట్టి మంజు (18), శెట్టి వెంకటలక్ష్మీ (27), హనుమంతునిపాడు మండలం మంగంపల్లికి చెందిన పాపాబత్తుని పెద్ద మంగయ్య (30), ఆయన భార్య పాపాబత్తుని వెంకటలక్ష్మి(25), పాపాబత్తుని మనీషా(15), సీఎస్‌పురం మండలం వెంగనగుంట గ్రామానికి చెందిన కుడారి ఆదినారాయణ(32), ఆయన భార్య సావిత్రి (28), మర్రిపూడి మండలం గార్లపేటకు చెందిన అండ్ర విజయ్‌కుమార్(32), ఆయన భార్య నాగమణి (25) అక్కడికక్కడే మృతి చెందారు. శెట్టి వెంకటలక్ష్మి భర్త శెట్టి వెంకటేశ్వర్లు, శెట్టి బాబు, మంగంపల్లికి చెందిన పాపాబత్తుని మహేంద్రలు తీవ్రంగా గాయపడ్డారు. కుడారి ఆదినారాయణ, భార్య సావిత్రిల ఏకైక కుమారుడు నితీష్(5) ప్రాణాలతో బయటపడ్డాడు. -
బిలాయ్‌లో నమోదైన 9 ప్రపంచ రికార్డులు
భిలాయ్(చత్తీస్‌గఢ్): స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా, ప్రాణాయామం కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆసనాలువేసి 9 కొత్తగోల్డెన్ బుక్ ప్రపంచరికార్డులు నెలకొల్పారు. బిలాయ్‌లోని 36ఎకరాల మైదానంలో దాదాపు లక్షమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యనమస్కారాలు, కపాల్భాతి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం చేసి 3 ప్రపంచరికార్డులు సృష్టించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం రమణ్ సింగ్, ఉన్నతవిద్య మంత్రి ప్రకాశ్ పాండే పాల్గొన్నారు. లక్షకుపైగా జనం ఒకేసారి యోగా నేర్చుకుని నాలుగో రికార్డును, ఒకేసారి నిమిషంలో 10 పుషప్స్ చేసి ఐదో రికార్డును నెలకొల్పారు. రాజస్తాన్‌కు చెందిన భాయ్ జైపాల్ అనే గురువు 141 నిమిషాలపాటు శీర్షాసనం వేసి ఆరో రికార్డును, భాయ్ రోతాస్ 19నిమిషాల 20సెకన్లలో 1000 పుషప్స్ చేసి ఏడో రికార్డు సృష్టించారు. 50,000 మంది ఒకేసారి సర్వాంగాసన, హలాసనాలు వేసి ఎనిమిదో, తొమ్మిదో రికార్డులను నమోదుచేశారు. -
ఇకపై నన్నెవరూ అలా పిలవలేరు
భిలాయ్: 'నేను చచ్చిపోతే.. ఇక నన్నెవరూ వ్యభిచారి .. రేప్ బాధితురాలు' అని పిలవలేరు అంటూ ఓ అత్యాచార బాధితురాలు తీవ్ర ఆవేదనతో రాసిన సూసైడ్ నోట్లోని మాటలు. తనకు న్యాయం జరగదనే నిరాశతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఇరుగుపొరుగు సూటిపోటి మాటలు, కేసు విచారణలో జరుగుతున్న జాప్యం వెరసి ఆమె ఉసురు తీశాయి. ఛత్తీస్ గడ్ లోని భిలాయ్ కు చెందిన బాధితురాలు గురువారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందింది. చనిపోతే ఇక తనను ఎవరూ ఆ దృష్టితో చూడరని, రేప్ బాధితురాలిగా పిలవరని సూసైడ్ లేఖలో రాయడం అందర్నీ కలచి వేసింది. వివరాల్లోకి వెళితే... 2014 జూన్ లో వైద్యం కోసం వెళ్లిన మహిళపై ఓ వైద్యుడు, ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి అఘాయిత్యానికి తెగబడ్డారు. భిలాయ్ లోని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. జాండీస్ వ్యాధి ముదిరిందని బాధితురాలి బంధువులను మభ్యబెట్టిన ఆ వైద్యుడుతో పాటు మరో ఇద్దరు మూడు రోజులపాటు లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. అంతటితో వారి దురాగతం ఆగిపోలేదు. ఆ దృశ్యాలను వీడియో తీశామని..ఎవరికైనా చెబితే ఈ వీడియో బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. తమ కోరిక తీర్చాలని.. లేదంటే ఆ వీడియోను లీక్ చేస్తామని భయపెట్టి మరీ ముగ్గురూ ఆమెను లొంగదీసుకున్నారు. ఇలా ఆరు నెలల పాటు వారి అరాచకం కొనసాగింది. చివరికి ఆమె గత ఏడాది జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఈ కేసు విచారణలో ఉండగానే తీవ్ర మానసిక వేదనతో సూసైడ్ నోట్ రాసి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఎపుడు కోర్టుకు వెళ్లినా జడ్జి రావడంలేదనీ ..తన తరఫున వాదించే న్యాయవాది వల్ల కూడా ఫలితం లేకపోయిందని వాపోయింది. ఇక తనకు న్యాయం జరుగుతుందున్న నమ్మకం పోయిందని, చివరికి పోలీసులు కూడా నిందితులకే వత్తాసు పలుకుతున్నారని ఆ లేఖలో పేర్కొంది. దీంతోపాటుగా పలువురిని తన ఆత్మహత్యకు బాధ్యులుగా పేర్కొంది. మరోవైపు ఇప్పటికీ తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బాధితురాలి సోదరుడు వాపోయాడు. కేసును ఉపసంహరించు కోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారని అతడు తెలిపాడు. కాగా బాధితురాలి సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించనున్నామని పోలీసులు తెలిపారు. లేఖలో పేర్కొన్న వ్యక్తులందరినీ విచారిస్తామన్నారు. ఫిబ్రవరి 2తేదీన ఈ కేసు విచారణకు రానుంది.