
‘మాయావతికి పోటీగా సినీ నటి’
అలహాబాద్: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి పోటీచేస్తే, ఆమెకు ప్రత్యర్థిగా తమ పార్టీ నుంచి సినీ నటి రాఖీ సావంత్‌ను నిలబెడతామని ఆర్‌పీఐ(రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. కేంద్ర సహాయ మంత్రి, ఆర్‌పీఐ అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలే ఆదివారం ఈ విషయం చెప్పారు. మాయావతి కొన్ని రోజులుగా ఎన్నికల నుంచి తప్పించుకు తిరుగుతున్నారని ఆయన అన్నారు. దళితుల మద్దతు బాగా ఉన్న ఆర్‌పీఐ.. బీజేపీతోనే పొత్తు పెట్టుకుంటుందని, కుదరని పక్షంలో 200 స్థానాల్లో సొంతంగా అభ్యర్థులను పోటీలో నిలబెడతామని అథవాలే వెల్లడించారు.
‘మాయావతి ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించుకుంటున్నారు. ఈసారి మనసు మార్చుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తే ఆమెపై మా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాఖీ సావంత్ ను బరిలోకి దించుతాం. మాయావతి ఎక్కడి నుంచి పోటీచేస్తే అక్కడి నుంచి సావంత్ బరిలో ఉంటార’ని రామ్‌దాస్ అథవాలే తెలిపారు. యూపీలో బీఎస్పీకి ప్రత్యామ్నాయం కోసం దళితులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాయావతి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.