సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని పెద్ద విమానాశ్రయాలలో ఒకటైన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ) వరుసగా మూడవసారి సేవల నాణ్యతలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. సంవత్సరానికి 2.5 కోట్ల నుంచి 4 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విమానాశ్రయాల శ్రేణిలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ స్థానం దక్కింది. అయితే ప్రపంచంలోని అన్ని కేటగిరీలకు చెందిన 235 విమానాశ్రయాలతో పోల్చినప్పుడు సేవల నాణ్యతలో ఐజీఐకి ఆరవ స్థానం లభించింది. గత ఏడాది ఈ కేటగిరీలో ఐజీఐ నాలుగవ స్థానంలో నిలిచింది. సేవల నాణ్యతకు ప్రామాణికంగా నిర్ణయించిన 5 పాయింట్ల స్కేలుపై ఐజీఐకి 4.84 పాయింట్లు లభించాయి.
విమానాశ్రయ సేవల నాణ్యతకు ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) అందించిన అవార్డును ఇటీవల దక్షిణ కొరియాలోని సియోల్ నిర్వహించిన కార్యక్రమంలో ఐజీఐ స్వీకరించింది. డయల్, సీఐఎస్‌ఎఫ్ , ఢిల్లీ డ్యూటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్‌లైన్ ఆపరేటింగ్ కమిటీ, జెట్ ఎయిర్‌వేస్‌లకు చెందిన పది మంది ప్రతినిధుల బృందం ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న డయల్ సీఈవో ఐ.ప్రభాకర రావు మాట్లాడుతూ..‘మూడేళ్లుగా వరుసగా ఈ అవార్డును ఏసీఐ నుంచి అందుకోవడం మాకు ఆనందంగా ఉంది. మా భాగస్వాములు, ఉద్యోగుల సమష్టి కృషితో ఇది సాధ్యమయ్యింది.
మా కస్టమర్లకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సేవలందించేందుకు మేం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమయంలో ఏఎస్‌క్యూ నుంచి రెండోస్థానం పొందినట్లు అవార్డు రావడం మా బాధ్యతను మరింత పెంచినట్లయ్యింది..’ అని తెలిపారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి ఏసీఐ విమానాశ్రయాలను 2-5 మిలియన్ పాసింజర్ల కేటగిరీ, 5-15 మిలియన్లు, 15-25 మిలియన్లు, 25-40 మిలియన్లు, 40 మిలియన్ల పై కేటగిరీలుగా విభజించి ర్యాంకులు అందచేసింది. ఏసీఐలో ప్రపంచంలో ఉన్న 174 దేశాల్లోని 1,751 విమానాశ్రయాలు సభ్యత్వంకలిగి ఉన్నాయి. ఇదిలా ఉండగాఏసీఐ ర్యాంకుల ర్యాంకుల ప్రకారం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఐదవస్థానంలో నిలిచింది.
సేవల నాణ్యతలో ఐజీఐకి రెండో స్థానం
Published Fri, Jun 6 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM
Advertisement