మీ బీఎండబ్ల్యు మాకొద్దు బాబోయ్..
మీ బీఎండబ్ల్యు మాకొద్దు బాబోయ్..
Published Tue, Dec 13 2016 10:33 AM | Last Updated on Wed, Apr 3 2019 4:59 PM
తన్మయ షెఖావత్ అనే కుర్రాడికి ఈ సంవత్సరం నిర్వహించిన ఐఐటీ జేఈఈ పరీక్షలలో జాతీయస్థాయిలో 11వ ర్యాంకు వచ్చింది. దాంతో అతడికి కోచింగ్ ఇచ్చిన సంస్థ యజమాని ఎంతగానో సంబరపడి.. తనవద్ద ఉన్న బీఎండబ్ల్యు కారును బహుమతిగా ఇచ్చారు. ఇది జరిగి సరిగ్గా ఇప్పటికి ఆరు నెలలు గడిచింది. ఇప్పుడు ఆ కుర్రాడు, అతడి తండ్రి కూడా తమకు ఆ కారు వద్దని, అది వెనక్కి తీసేసుకుని ఏదో ఒక చిన్న బహుమతి... కనీసం ఒక ల్యాప్‌టాప్ అయినా ఇవ్వాలని అడుగుతున్నారు. కారు అమ్మేసి డబ్బు ఇవ్వాలని, లేదా కారు ఆయన వద్దే ఉంచుకుని వేరే ఏదైనా చిన్న బహుమతి తన కొడుక్కి ఇవ్వాలని అడిగినట్లు తన్మయ తండ్రి రాజేశ్వర్ సింగ్ షెఖావత్ చెప్పారు. ఆయన రాజస్థాన్‌లో ఓ స్కూలు టీచర్‌గా పనిచేస్తున్నారు.
ఇంతకీ వాళ్లు కారు ఎందుకు వద్దన్నారో తెలుసా.. కారు ఖరీదు రూ. 28 లక్షలు. ఆ కారు తీసుకుంటే దాని విలువలో 33 శాతాన్ని పన్నుగా కట్టాల్సి ఉంటుంది. అంటే, 9 లక్షలు. ఆ మొత్తం ఎక్కడి నుంచి తేవాలి? పైగా, కారు మైలేజి చాలా తక్కువ. అంతేకాదు.. ఒక్కసారి సర్వీసింగ్ చేయిస్తే 85 వేల రూపాయలు అవుతుంది. ఈ ఖర్చంతటినీ భరించడం అంటే తెల్ల ఏనుగును మేపినట్లే అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే.. ఈ విషయంలో ఐఐటీ కోచింగ్ ఇచ్చిన సమర్పణ్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఆర్ఎల్ పూనియా వేరేవిధంగా చెబుతున్నారు. మొదట్లో వాళ్లు ఆ కారు ఉంచుకుందామనే అనుకున్నారని, తన్మయ మేనమామ ముంబైలో ఉంటారని.. ఆయనకు ఆ కారు ఇద్దామనుకున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు తన్మయ తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, ఆమెకు చికిత్స చేయించడానికే కారు అమ్మాలని భావిస్తున్నారని ఆయన తెలిపారు. కారు చాలా ఖరీదైనది కావడంతో.. దాన్ని అమ్మడం కూడా కష్టమేనని, కానీ తమ సంస్థ వ్యవస్థాపక దినం సందర్భంగా ఈనెల 15న వేలం వేస్తామని అన్నారు. తన్మయకు 11వ ర్యాంకు రావడంతో తమ సంస్థలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య కూడా బాగా పెరిగిందని పూర్నియా తెలిపారు.
Advertisement