న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇంటర్నేషనల్ డే అగనిస్ట్ ఇంప్యూనిటీ ఆన్ క్రైమ్స్ అగనిస్ట్ జర్నలిస్ట్స్ సందర్భంగా హత్యకు గురైన జర్నలిస్టులకు దేశ వ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు.వృత్తిలో ప్రాణాలు విడిచిన జర్నలిస్టులను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని భారతీయ జర్నలిస్టుల సంఘం(ఐజేయూ), ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)లు దేశ వ్యాప్తంగా జర్నలిస్టులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ప్రతి ఏటా నవంబర్ 2న జర్నలిస్టుల రక్షణా దినోత్సవాన్ని జరుపుకోవాలనే యూఎన్ నిర్ణయాన్ని 2015లో పీసీఐ ఆమోదించింది. ఈ మేరకు ఐజేయూ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో రోజు రోజుకూ జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయని ఐజేయూ, అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్(ఐఎఫ్ జే)లు ఆవేదన వ్యక్తం చేశాయి.
ఈ ఏడాది ఇప్పటివరకూ నలుగురు జర్నలిస్టులు వృత్తిపరమైన కారణాల వల్ల హత్యకు గురవగా.. గతేడాది ఎనిమిది మంది ఇలానే బలయ్యారు. గత రెండున్న దశాబ్దాల్లో హత్యకు గురైన జర్నలిస్టుల సంఖ్య 100కు పైగానే ఉంది. వీటిలో 94 శాతం కేసులు కోర్టులో పెండింగ్ లోనో లేక సరైన ఆధారాలు లేక కేసు నిలబడక పోవడమో జరుగుతోంది.
ప్రజలకు నిజానిజాలను తెలియజేసే క్రమంలో జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావాలి. జర్నలిస్టులపై దాడికి పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని ప్రకటనలో పేర్కొన్నాయి. కాగా, సీనియర్ జర్నలిస్టు ఎస్ నిహాల్ సింగ్ ను రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు 2016కు ఎంపిక చేసినట్లు పీసీఐ ప్రకటించింది. ఈ నెల 16న నిహాల్ కు అవార్డుతో పాటు రూ.లక్ష నగదును అందజేయనున్నట్లు తెలిపింది.
హత్యకు గురైన జర్నలిస్టులకు ఘన నివాళి
Published Wed, Nov 2 2016 4:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
Advertisement