రాఖీ సావంత్ ఆస్తులు రూ. 15 కోట్లు
ముంబై: ఇటీవల రాష్ట్రీయ ఆమ్ పార్టీని స్థాపించి వాయవ్య ముంబై నుంచి పార్టీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన బాలీవుడ్ ఐటెమ్ గర్ల్ రాఖీ సావంత్ (36) తన ఆస్తుల విలువను రూ. 14.69 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొంది. ఇందులో స్థిరాస్తులు రూ. 11.12 కోట్లు, చరాస్తులు రూ. 3.57 కోట్లు ఉన్నట్లు వివరించింది. తనకు రూ. 2.52 కోట్ల అప్పులున్నాయని, తనపై ఓ చీటింగ్ కేసు కూడా ఉన్నట్లు వివరించింది.
నామినేషన్ పత్రాల్లో రాఖీ తాను నిరక్ష్యరాస్యురాలినని పేర్కొనడం గమనార్హం. కాగా, తమిళనాడులోని మైలదుతురాయ్ నుంచి బరిలో నిలిచిన కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ తన ఆస్తులను రూ. 11.68 కోట్లుగా అఫిడవిట్‌లో చూపారు. బీహార్ నుంచి బరిలో నిలిచిన అత్యంత ధనిక అభ్యర్థిగా ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆమ్రపాలి గ్రూప్ చైర్మన్ అయిన అనిల్ కుమార్ శర్మ నిలిచారు. జెహానాబాద్ ఎంపీ అభ్యర్థిగా జేడీయూ తరఫున పోటీ చేస్తున్న అనిల్... తన స్థిరచరాస్తులను రూ. 850 కోట్లుగా పేర్కొన్నారు.