ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదు | In 3-2 verdict, SC walks fine line, strikes down instant triple talaq | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదు

Published Wed, Aug 23 2017 12:54 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదు - Sakshi

ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదు

► అది చట్ట, రాజ్యాంగ విరుద్ధం
► ఏకపక్షం, అహేతుకం
► సుప్రీంకోర్టు కీలక తీర్పు
► 3:2 మెజారిటీతో తీర్పునిచ్చిన ధర్మాసనం


ముస్లింలు అప్పటికప్పుడు ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా భార్య లకు విడాకులు ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చిచెప్పింది. ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదనీ, ఇది చట్ట, రాజ్యాంగ విరుద్ధమని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు చెప్పింది. ‘‘ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ... 3:2 మెజారిటీతో తలాక్‌–ఎ–బిద్దత్‌ (ట్రిపుల్‌ తలాక్‌) చెల్లదని కొట్టివేస్తున్నాం’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ 395 పేజీల తీర్పును వెలువరిస్తూ పేర్కొ న్నారు.

పునరాలోచన చేసుకునేందుకు ఆస్కారం లేని, క్షణాల్లో ఇచ్చేసే ట్రిపుల్‌ తలాక్‌ ఖురాన్‌ సూక్తులకు వ్యతిరేకమనీ, అంగీకారయోగ్యం కాదని జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్, జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్, జస్టిస్‌ యు.యు.లలిత్‌లు ఇచ్చిన మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది. ‘దీని ద్వారా విడాకులు అత్యంత ఏకపక్షం, అహేతుకం. రాజ్యాంగ ఉల్లంఘన కూడా. అందువల్ల ట్రిపుల్‌ తలాక్‌ను  కొట్టివేయాల్సిందే’ అని ఈ ముగ్గురు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని తేలుస్తూ జస్టిస్‌ జోసెఫ్, జస్టిస్‌ నారిమన్‌ విడివిడిగా తీర్పులివ్వగా... జస్టిస్‌ లలిత్‌ మాత్రం నారిమన్‌ తీర్పుతో ఏకీభవించారు. అలా వీరిది మెజారిటీ తీర్పు అయ్యింది.

కాగా మైనారిటీ తీర్పునిచ్చిన జస్టిస్‌ ఖేహర్, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌లు మాత్రం విరుద్ధ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ట్రిపుల్‌ తలాక్‌ దీర్ఘకాలంగా వాడుకలో ఉన్నదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని... షరియా చట్టాలు కూడా ఆమోదిస్తున్నందున అది మతాన్ని ఆచరించే స్వేచ్ఛను ప్రసాదిస్తున్న ఆర్టికల్‌–25 కిందకు వస్తుందన్నారు. ట్రిపుల్‌ తలాక్‌పై ఆర్నెల్ల నిషేధం విధించాలనీ, ఆలోగా రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనబెట్టి ఈ అంశంలో చట్టం చేయడానికి ఏకతాటిపైకి రావాలని కోరారు.  

సుప్రీంకోర్టు 2015 అక్టోబర్‌ 16న సుమోటోగా ఓ పిల్‌ను చేపట్టింది. ‘సమానత్వం కోసం ముస్లిం మహిళల ఆరాటం’ అనే శీర్షికన దీన్ని చేపట్టింది. ఏకపక్ష విడాకులు, బహుభార్యత్వం, నిఖా హలాలా (విడాకులిచ్చిన భార్యను మళ్లీ నేరుగా పెళ్లి చేసుకునేందుకు మత నిబంధనలు ఒప్పుకోవు. విడాకులిచ్చిన భార్యకు వేరొకరితో వివాహమై, రెండో భర్తతోనూ ఆమె విడాకులు తీసు కుంటేనే తిరిగి మొదటి భర్తను పెళ్లాడవచ్చు)లు ముస్లిం మహిళల గౌరవానికి ఏమేరకు భంగకరమో విచారించేందుకు నడుం కట్టింది.

లింగ వివక్షకు గురవుతున్నారనే కోణంలోనూ విచారణ జరిపింది. సుప్రీం పిల్‌కు షాయరా భానోతోపాటు మరో నలుగురు బాధిత మహిళల పిటిషన్లూ తోడయ్యాయి. మరో రెండు పిటిషన్లను ఇతర సంస్థలు వేశాయి. మొత్తం ఈ ఏడు పిటిషన్లను సుమోటో పిల్‌తో కలిపి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. అయితే ఆ తర్వాత ప్రధాన సమస్యగా ఉన్న ట్రిపుల్‌ తలాక్‌ అంశానికే విచారణను పరిమితం చేసింది. దీని రాజ్యాంగబద్ధతపై వాదనలు వింది. ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. ఉన్నట్లుండి మూడుసార్లు తలాక్‌ చెప్పేసి విడాకులు ఇవ్వడం, అదీ కొన్నిసార్లు ఫోన్‌లో, సంక్షిప్త సందేశాల ద్వారా చేయడం ఆక్షేపణీయమన్నారు.

ఇది ఏకపక్షమనీ, మహిళలపై వివక్ష చూపడమని వాదించారు. మహిళల గౌరవానికి భంగకరమన్నారు. మౌలికంగా ఇస్లాంకు విరుద్ధం కాబట్టి ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ (బీఎంఎంఏ) వాదించింది. నచ్చిన మతాన్ని ఆచరించుకునే స్వేచ్ఛను ప్రసాదించే ఆర్టికల్‌–25 కింద ముస్లిం పర్సనల్‌ లాలో భాగంగా తలాక్‌కు రాజ్యాంగ రక్షణ ఉంది కాబట్టి... ప్రాథమిక హక్కులకు భంగకరమని సవాల్‌ చేయలేరని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) వాదించింది. భారతీయ సున్నీ ముస్లింలలో హనాఫీలు 90% మందికి పైగా ఉన్నారనీ, గడచిన 1,400 ఏళ్లుగా దీన్ని పాటిస్తున్నారు కాబట్టి ఆర్టికల్‌–25 కింద ఇది మతస్వేచ్ఛ కిందకు వస్తుందని పేర్కొంది.

అదే సమయంలో ఇది పురుషాధిక్య ధోరణేననీ, అభిలషణీయం కాదని ఏఐఎంపీఎల్‌బీ అంగీకరించింది. మరింత ముందుకు వెళ్లి నిఖానామా (పెళ్లి ఒప్పందం)లోనే ముందస్తు షరతు పెట్టడం ద్వారా ట్రిపుల్‌ తలాక్‌ను నివారించొచ్చని సర్వోన్నత న్యాయస్థానానికి సూచించింది. మరోవైపు కేంద్రం... ఏ పర్సనల్‌ లా అయినా రాజ్యాంగానికి లోబడే ఉండాలనీ, ప్రాథమిక హక్కులైన సమానత్వం, వివక్ష చూపకూడదనే వాటికి ట్రిపుల్‌ తలాక్‌ వ్యతిరేకమని వాదించింది. ఒకవేళ రాజ్యాంగ ధర్మాసనం ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని తేలిస్తే... ముస్లింల వివాహ, విడాకులను పర్యవేక్షించేందుకు కొత్తచట్టాన్ని తెస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది. వివక్షకు గురవుతున్న ముస్లిం మహిళలకు– ముస్లిం పురుషులకు మధ్య సంఘర్షణగా ట్రిపుల్‌ తలాక్‌పై న్యాయపోరాటాన్ని అభివర్ణించింది.

ఎవరి తీర్పు ఏంటి...
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌: ‘మతస్వేచ్ఛను ప్రసాదించే ఆర్టికల్‌–25లో తలాక్‌–ఎ–బిద్దత్‌ (ట్రిపుల్‌ తలాఖ్‌) విడదీయరాని భాగం. సున్నీల్లోని హనాఫీ ముస్లింలు గడిచిన 1,400 ఏళ్లుగా దీన్ని ఆచరిస్తున్నారు కాబట్టి మతాచారంలో ఇది భాగమైంది. ఆర్టికల్‌–14 (సమానత్వం), ఆర్టికల్‌ 19 (భావప్రకటనా స్వేచ్ఛ), ఆర్టికల్‌  21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ)లను ట్రిపుల్‌ తలాక్‌ ఉల్లంఘించదు. 1937 షరియా చట్టం ఆధారంగా దీనికి చట్టబద్ధత వచ్చింది.

రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి తగినట్లుగా లేదనే కారణంతో న్యాయస్థానం తీర్పు ద్వారా ట్రిపుల్‌ తలాక్‌ను తోసిపుచ్చలేదు. ఏదైనా మార్పు జరిగితే...అది చట్టాలు రూపొందించడం ద్వారానే జరగాలి. ఆర్టికల్‌– 142 ద్వారా సంక్రమించిన ఆసాధారణ అధికార పరిధిని వినియోగిస్తూ... ముస్లింలు ఆరునెలల పాటు ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని నిషేధిస్తున్నాం. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి... తగు చట్టం రూపొందించేందుకు పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి. ముస్లిం ఆధిక్యదేశాలే తలాక్‌–ఎ–బిద్దత్‌ను నిషేధించినపుడు... ఈ విషయంలో స్వతంత్ర భారతదేశం వెనుకపడటానికి సాకులు వెదుక్కోవాల్సిన అసవరం లేదు’ అని జస్టిస్‌ ఖేహర్‌ తన తీర్పులో పేర్కొన్నారు.   

జస్టిస్‌ ఖేహర్‌ అభిప్రాయంతో జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఏకీభవించారు. న్యాయస్థానం తీర్పు ద్వారా ట్రిపుల్‌ తలాక్‌ను తోసిపుచ్చలేరని... చట్ట రూపకల్పన ద్వారానే ఇది జరగాలనేది జస్టిస్‌ ఖేహర్‌ అభిప్రాయం.

జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారిమన్‌: ‘ముస్లిం మహిళలు న్యాయం కోరి తమ ముందుకు వస్తే చేతులు ముడుచుకుని కూర్చోవడం కోర్టుకు సాధ్యం కాదు. తలాక్‌–ఎ–బిద్దత్‌తో సహా మొత్తం మూడు రకాల తలాక్‌లను 1937 షరియా చట్టంలో చేర్చి, గుర్తించారు. షరియా చట్టంలో చేర్చినంత మాత్రాన అది ప్రాథమిక హక్కులకు అతీతమైనదేమీ కాదు. ‘చట్టం’ అనే పదాన్ని నిర్వచించే ఆర్టికల్‌ 13 (1) ఏం చెబుతోందంటే... రాజ్యాంగరచన కంటే ముందు లేదా తర్వాత రూపొందిన ఏ చట్టమైనా సరే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదు అని. ట్రిపుల్‌ తలాక్‌... ఇష్టారాజ్యంగా, జవాబుదారీతనం లేకుండా ఏకపక్షంగా ముస్లిం పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడానికి ఆస్కారం కల్పిస్తోంది. ఇది అత్యంత ఏకపక్షం, అహేతుకం... కాబట్టి ఆర్టికల్‌–25 కింద దీనికి రక్షణ లేదు. మతాచారాల్లో నిర్దిష్టంగా ప్రస్తావించిన హక్కు కాదు. ఆచరణలో అనుమతిస్తున్నది మాత్రమే కాబట్టి ఆర్టికల్‌–25 (నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ) కింద రక్షణకు అర్హమైనది కాదు’ అని నారిమన్‌ తీర్పు చెప్పారు.
జస్టిస్‌ నారిమన్‌ తీర్పుతో జస్టిస్‌ లలిత్‌ ఏకీభవించారు.

జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌: ‘ఇన్‌స్టంట్‌ (క్షణాల్లో) తలాక్‌ ఖురాన్‌ సూక్తులకు విరుద్ధం. ఖురాన్‌ నిషేధించినది షరియత్‌లో ఒప్పు కాకూడదు. మతశాస్త్రాల్లో నిషేధించినది చట్టాల్లో ఒప్పు కాకూడదు. 1,400 ఏళ్లుగా ఆచరిస్తున్నారు కాబట్టి ఆర్టికల్‌–25 కింద రక్షణ ఉండాలనే వాదన (జస్టిస్‌ ఖేహర్‌ అభిప్రాయం)తో నేను విభేదిస్తున్నాను. అలాగే మతపరమైన విశ్వాసాల ఆధారంగానే తలాక్‌ పర్సనల్‌ లాలో విడదీయరాని భాగమైందనే వాదనతోనూ ఏకీభవించను. ఏ మతాచారమైనా... నైతికత, ప్రజారోగ్యం, శాంతిభద్రతలకు భంగకరం కాకుండా ఉండాలి.’ అని జస్టిస్‌ కురియన్‌ తన తీర్పులో పేర్కొన్నారు.

ఐదుగురు.. ఐదు మతాలు
ఐదు ధర్మాలకు ధర్మాసనంలో ప్రాతినిధ్యం
ట్రిపుల్‌ తలాక్‌ పిటిషన్లపై విచారణ జరిపి తీర్పునిచ్చిన ధర్మాసనంలో ఐదుగురు న్యాయమూర్తులూ వేర్వేరు మతాలకు చెందిన వారే. ఐదు మతాలకు చెందిన జడ్జీలు ఉండేలా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేసి విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు జనంలో కలిగించింది. బెంచ్‌కు నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ సిక్కు మతస్తుడుకాగా, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ క్రైస్తవుడు. జస్టిస్‌ రోహింగ్టన్‌ ఎఫ్‌ నారిమన్‌ పార్సీ (జోరాష్ట్రియన్‌) మతానికి చెందినవ్యక్తి. జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఓ ముస్లిం. మెజారిటీ తీర్పు ఇచ్చిన జడ్జీల్లో ఒకరైన ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ ఒక్కరే హిందువు.

ఇలా ఏ ఒక్క మతానికి చెందిన ఇద్దరు జడ్జీలు ధర్మాసనంలో లేకుండా, విచారణ, తీర్పుపై ఎలాంటి అనుమానాలూ తలెత్తకుండా భారత న్యాయవ్యవస్థ జాగ్రత్తలు తీసుకుంది. మెజారిటీ తీర్పుతో ఏకీభవించని ఇద్దరిలో జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉన్నారు. జస్టిస్‌ ఖేహర్‌ ఈ నెల 28న, జస్టిస్‌ జోసెఫ్‌ వచ్చే ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేయబోతున్నారు. అందరి కన్నా తక్కువ అనుభవం ఉన్న జస్టిస్‌ నజీర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2023 జనవరి మొదటివారంలో పదవీ విరమణ చేస్తారు.  

‘ఇన్‌స్టంట్‌’కే నో
సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది... ఉన్నపళంగా మూడుసార్లు తలాక్‌ చెప్పి విడాకులు తీసుకోవడం (ఇన్‌స్టంట్‌) చెల్లదని మాత్రమే. అంతేకాని మొత్తం ట్రిపుల్‌ తలాక్‌ విధానాన్ని నిషేధించలేదు. ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం విడాకులు మూడురకాలు.

తలాక్‌–ఎ–అహ్‌సాన్‌: ముస్లిం దంపతులు విడాకులు తీసుకోవడానికి సరైన మార్గంగా దీన్ని పరిగణిస్తారు. అహ్‌సాన్‌ అనే పదానికి అర్థం... అత్యుత్తమ లేదా సరైన. దీని ప్రకారం... భార్య రుతుక్రమంలో లేనప్పుడు... భర్త ఏకవాక్యంలో విడాకులు ఇస్తున్నట్లు చెప్పాలి. తర్వాత భార్య నిర్దేశిత కాలంపాటు నిరీక్షించాలి. ఈ కాలాన్ని ఇద్దత్‌ అంటారు. మూడు నెలసరులు ‘ఇద్దత్‌’గా ఉంటుంది. ఒకవేళ భార్య గర్భంతో ఉంటే శిశువు జన్మించేదాకా ఇద్దత్‌ కాలం ఉంటుంది. ఈ సమయంలోపు భర్త మనసు మార్చుకుంటే... తలాక్‌ను వెనక్కితీసుకోవచ్చు. ఇద్దత్‌ కాలం ముగిస్తే మాత్రం విడాకులు మంజూరైనట్లే.  
తలాక్‌–ఎ–హసన్‌: పునరాలోచనకు తగినంత సమయం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా కొంతవరకు మంచి పద్ధతిగానే పరిగణిస్తారు. ఈ విధానంలో మూడునెలల వ్యవధిలో నెలకోమారు చొప్పున భర్త మూడుసార్లు భార్యకు తలాక్‌ చెబుతాడు. తర్వాత విడాకులు మంజూరవుతాయి. ఒకవేళ ఆలోపు మనసు మార్చుకుంటే... వైవాహిక బంధాన్ని కొనసాగించవచ్చు.
తలాక్‌–ఎ–బిద్దత్‌: ‘తలాక్‌... తలాక్‌... తలాక్‌’ అని వరుసగా మూడుసార్లు చెప్పేసి విడాకులు తీసుకోవడమే తలాక్‌–ఎ–బిద్దత్‌. షరియా చట్టం ప్రకారం ఇది చెల్లుబాటవుతోంది. ఒమేయద్‌ రాజులు విడాకులకు సులభమార్గంగా దీన్ని పరిచయం చేశారు. ఒక్కసారిగా మూడు పర్యాయాలు భర్త తలాక్‌ చెప్పాడంటే ఇక అంతే. విడాకులే. నిర్ణయాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉండదు.
క్షణికావేశంలో, అనాలోచితంగా నిర్ణయం తీసుకుని జీవిత భాగస్వామిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తూ... క్షణాల్లో విడాకులిచ్చేయడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తలాక్‌ను 22 ముస్లిం మెజారిటీ దేశాలు నిషేధించడం గమనార్హం.  

ప్రస్తుత చట్టాలు సరిపోతాయి..
ట్రిపుల్‌ తలాక్‌పై కేంద్రం సంకేతాలు
న్యూఢిల్లీ: ట్రిపుల్‌ తలాక్‌పై కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదని, ఇప్పుడున్నవి సరిపోతాయని కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలిచ్చింది. గృహ హింస తరహా చట్టాల సాయాన్ని ఈ కేసుల పరిష్కారం కోసం వాడుకోవచ్చని సూచించింది. ‘సుప్రీం తీర్పు నేపథ్యంలో భర్త ట్రిపుల్‌ తలాక్‌ ఇస్తే అది చెల్లుబాటు కాదు. వివాహ ఒప్పందం అలాగే నిలిచిఉంటుంది.

ఆ వ్యక్తిపై పోలీసు స్టేషన్‌లో వేధింపులు, గృహ హింస కింద కేసులు పెట్టేందుకు భార్యకు స్వేచ్ఛ ఉంటుంది’ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. సుప్రీం ధర్మాసనంలో మెజారిటీ న్యాయమూర్తులు ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకమని స్పష్టం చేశారని, ఈ అంశంపై అన్ని కోణాల్లో ప్రభుత్వం క్షుణ్నంగా అధ్యయనం చేస్తుందని చెప్పారు.   

ఎవరేమన్నారంటే...
‘సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం. ఈ తీర్పు ముస్లిం మహిళలకు సమానత్వాన్ని ప్రసాదించింది. మహిళా సాధికారత సాధనకు ఇదొక శక్తివంతమైన శాసనంలా పనిచేయనుంది.’ – నరేంద్ర మోదీ, ప్రధాని

దేశంలో ముస్లిం మహిళలకు సమానత్వం, ఆత్మగౌరవం విషయంలో ఈ తీర్పుతో కొత్త శకం ప్రారంభమైంది.  ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధం, సమానత్వంతో జీవించే హక్కును సుప్రీంకోర్టు ముస్లిం మహిళలకు ఇచ్చింది. వారికి అనుకూలంగా వచ్చిన ఈ తీర్పును స్వాగతిస్తున్నా. – అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు

న్యాయం కోసం పోరాడిన మహిళలకు అభినందనలు. ట్రిపుల్‌ తలాక్‌పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను.    – రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు  

ముస్లిం మహిళల హక్కుల్ని సుప్రీం తీర్పు చాటిచెప్పింది. ట్రిపుల్‌ తలాక్‌తో వివక్షకు గురవుతున్న మహిళలకు ఈ తీర్పు ఉపశమనం  – రణ్‌దీప్‌ సూర్జేవాలా, కాంగ్రెస్‌ ప్రతినిధి  

సెప్టెంబర్‌ 10న భోపాల్‌లో జరిగే వర్కింగ్‌ కమిటీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. తీర్పును పూర్తిగా అధ్యయనం చేశాక స్పందిస్తాం.     – ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లాబోర్డు  

మేం విజయం సాధించాం, ఇప్పుడు భద్రంగా ఉన్నట్లు భావిస్తున్నాం. ఈ తీర్పు అతిపెద్ద విజయం, ఉపశమనం. అయితే మా పోరాటంలో సగం విజయమే దక్కింది. కేంద్రం చట్టం చేసినప్పుడే పూర్తి విజయం సాధించినట్లు..   – ఆలిండియా ముస్లిం మహిళా పర్సనల్‌ లాబోర్డు

తీర్పును మనం గౌరవించాలి. అయితే క్షేత్ర స్థాయిలో దీన్ని అమలు చేయడం కష్ట సాధ్యం. అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ట్రిపుల్‌ తలాక్‌ అత్యంత వివాదాస్పద అంశం. అందుకే సుప్రీంకోర్టు ధర్మాసనంలో కూడా దీనిపై ఏకాభిప్రాయం లేదు. ప్రాథమిక హక్కుల పరిధిలో వ్యక్తిగత చట్టాల్ని సవాలు చేయలేరని న్యాయమూర్తులు పేర్కొనడం ఆహ్వానించదగ్గ పరిణామం.     
– అసదుద్దీన్‌ ఒవైసీ, ఎంఐఎం అధ్యక్షుడు

ఈ తీర్పుతో ట్రిపుల్‌ తలాక్‌కు తాము వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అన్ని వ్యక్తిగత చట్టాల్ని సంస్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి.     – డి.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి  

సామాజిక అసమానతల్ని రూపుమాపే విషయంలో మొండి వైఖరి కాకుండా.. సంస్కరణల మార్గాన్ని అనుసరించాలి.    – ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి  

ట్రిపుల్‌ తలాక్‌ కాలం చెల్లిన, తప్పుడు విధానం. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. – కపిల్‌ సిబల్, ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తరఫు న్యాయవాది

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement