పింప్రి, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు బాల నేరస్తుల సంఖ్య పెరిగిపోతోంది. మిగతా రాష్ట్రాలన్నింటికంటే మహారాష్ట్రలో బాల నేరగాళ్ల సంఖ్య అధికమని తేలింది. ఏటా వీరి సంఖ్య పెరుగుతూనే ఉన్నట్టు దీని అధ్యయనంలో వెల్లడయింది. త్వరగా డబ్బు సంపాదించాలన్న దురాశ, సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది బాలలు చెడుదారి పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనం నుంచి సత్‌ప్రవర్తనను అలవాటు చేయకపోవడంతో నేరాలకు సులువుగా ఆకర్షితులవుతున్నారని తెలియజేస్తున్నారు.
బాలనేరస్తుల్లో 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గలవారు 90 శాతం మంది తరచూ నేరాలకు పాల్పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 13 ఏళ్లుగా వీరి సంఖ్య విపరీతంగా పెరిగిందని ముంబై పోలీసుశాఖ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. 2000లో రాష్ట్రవ్యాప్తంగా బాలనేరస్తులు 1,641 నేరాలకు పాల్పడగా, 2010 నాటికి ఇది 4,315కు చేరుకుంది. 2011లో 4,775 నేరాలు నమోదు కాగా, 2012-13 మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
బాలనేరస్తుల విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే మహారాష్ట్ర... ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను వెనక్కి తోసి ముందువరుసలో నిలుచుంది. రాష్ట్రంలో అత్యధికంగా బాల నేరాలు ముంబై మహానగరంలో జరుగుతుండగా, ఆ తర్వాత స్థానాల్లో పుణే, ఠాణే, నాసిక్ ఉన్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ వివరాల ప్రకారం.. ఏడు నుంచి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలు ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. 2011లో నమోదయిన 89 శాతం నేరాలను 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలలే చేశారని తేలింది.
ఈ నేపథ్యంలో బాల నేరస్తుల కనీస వయస్సు 18 నుంచి 16కు తగ్గించాలన్న డిమాండ్ ప్రజల్లో వెల్లువెత్తింది. ఇలా తగ్గిస్తే బాల నేరస్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. మైనర్లు తీవ్ర నేరాలకు పాల్పడినప్పటికీ శిక్ష అనుభవించాల్సిన వయస్సు కాకపోవడంతో వీరిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ వీరికి సత్‌ప్రవర్తన, క్రమశిక్షణ, చదువు నేర్పుతున్నారు.
చిన్న వయసులోనే హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు వంటి తీవ్ర నేరాలు పాల్పడడానికి సోషల్ మీడియా దోహదపడుతోందని సామాజికరంగ నిపుణులు అంటున్నారు. టీవీలు, ఇంటర్నెట్ వంటి చోట్ల నేరాల ఘటనలను చూసి ప్రేరణ పొందుతున్నారని విశ్లేషించారు. ఢిల్లీలో నిర్భయ కేసు, అదేవిధంగా ముంబై శక్తిమిల్‌లో జరిగిన అత్యాచారాల కేసుల విచారణ సందర్భంగా బాల నేరస్తుల వయస్సును తగ్గించాలని ప్రతిపాదన రావడం తెలిసిందే. సులువుగా వచ్చే డబ్బుతో బాల నేరస్తులు చెడు అలవాట్లకు కూడా బానిసలవుతున్నారు. మైనర్లు నేరాలకు పాల్పడ్డా, చిన్న వయసు కావడం వల్ల త్వరగా బెయిల్ వస్తోంది.
దీంతో వీరు మరిన్ని నేరాలకు పాల్పడుతున్నారు. ఎన్సీఆర్బీ వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 2003లో మొత్తం 17,16,120 నేరాలు జరగ్గా అందులో బాల నేరస్తులవే 17,811 కేసులు ఉన్నాయి. 2004లో బాలల నేరాలు 19,229 నమోదు కాగా, 2005లో 18,939, 2006లో 21,088, 2007లో 22,865, 2008లో 24,535, 2009లో 23,926, 2013లో 31,725 ఇలా ప్రతి ఏడాది బాలల నేరాలు పెరుగుతూనే ఉన్నాయి.
పెరుగుతున్న బాల నేరస్తులు
Published Thu, Sep 4 2014 10:19 PM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM
Advertisement
Advertisement