Child offenders
-
పెరుగుతున్న బాలనేరస్తుల సంఖ్య
న్యూఢిల్లీ: నగరంలో నేరాలకు పాల్పడుతున్న బాలల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఢిల్లీ పోలీసుల రికార్డులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. గత 10 నెలల కాలంలో బాలనేరస్తుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోయింది. ఇది చట్టాలను అమలు చేసేవారికి ఓ సవాల్‌గా మారింది. 18 ఏళ్లలోపు బాలలు సగటున రోజుకు ఆరు నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో 1,727 నేరాలు నమోదయ్యాయి. గొలుసు దొంగతనాలు, దోపిడీలు, హత్యాయత్నం, హత్యలు, లైంగికదాడులు తదితర నేరాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు సర్వసాధారణమైపోయాయి. నగర వ్యాప్తంగా 412 కేసులు నమోదయ్యాయి. 360 దోపిడీ కేసులు, ఇళ్లకు కన్నాలు వేసే కేసులు 145, హేయమైన నేరాలు 111 నమోద య్యాయి. అదేవిధంగా బాలనేరస్తులపై 70 హత్య కేసులు, 74 హత్యాయత్నం కేసులు నమోద య్యాయి. ఇతర కేసులు 480. ఇందులో 60 శాతం కేసులు 16 నుంచి 18 ఏళ్ల లోపు వారిపైనే నమోదయ్యాయి. జాతీయ నేర రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇండియన్ పీనల్ కోడ్( ఐపీసీ), ప్రత్యేక స్థానిక చట్టం(ఎస్ఎల్ఎల్) లోని పలు సెక్షన్ల కింద బాలనేరస్తులపై 43,506 కేసులు నమోదయ్యాయి. ఇందులో 28,830 కేసులు 16 నుంచి 18 ఏళ్లలోపు బాలురు చేసినవే నని తేల్చింది. ఈ కేసులు 2012తో పోల్చితే..2013లో 2.5 శాతం పెరిగింది. ఈ ఏడాది 13.6 శాతానికి పెరిగింది.బాలనేరస్తుల చట్టంలో సవరణలు చేపట్టాలని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రి మండలి సూచించింది. ఈ మేరకు జరిగిన సవరణల ప్రకారం 16 నుంచి 18 సంవత్సరాల్లోపు వయసు కలిగి అత్యాచారానికి పాల్పడినవారిని బాలల కింద పరిగణించాలా లేక యువకులుగా పరిగణించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం జువెనైల్ జస్టిస్ బోర్డుకు ఉంటుంది. ప్రస్తుతం 18 ఏళ్లలోపు వయసు కలిగినవారు నేరానికి పాల్పడితే వారిని బాలలుగా పరిగణిస్తున్న విషయం విదితమే. నేరం రుజువైతే జువెనైల్ హోంకు పంపుతున్నారు. -
పెరుగుతున్న బాల నేరస్తులు
పింప్రి, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు బాల నేరస్తుల సంఖ్య పెరిగిపోతోంది. మిగతా రాష్ట్రాలన్నింటికంటే మహారాష్ట్రలో బాల నేరగాళ్ల సంఖ్య అధికమని తేలింది. ఏటా వీరి సంఖ్య పెరుగుతూనే ఉన్నట్టు దీని అధ్యయనంలో వెల్లడయింది. త్వరగా డబ్బు సంపాదించాలన్న దురాశ, సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది బాలలు చెడుదారి పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనం నుంచి సత్ప్రవర్తనను అలవాటు చేయకపోవడంతో నేరాలకు సులువుగా ఆకర్షితులవుతున్నారని తెలియజేస్తున్నారు. బాలనేరస్తుల్లో 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గలవారు 90 శాతం మంది తరచూ నేరాలకు పాల్పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 13 ఏళ్లుగా వీరి సంఖ్య విపరీతంగా పెరిగిందని ముంబై పోలీసుశాఖ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. 2000లో రాష్ట్రవ్యాప్తంగా బాలనేరస్తులు 1,641 నేరాలకు పాల్పడగా, 2010 నాటికి ఇది 4,315కు చేరుకుంది. 2011లో 4,775 నేరాలు నమోదు కాగా, 2012-13 మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బాలనేరస్తుల విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే మహారాష్ట్ర... ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను వెనక్కి తోసి ముందువరుసలో నిలుచుంది. రాష్ట్రంలో అత్యధికంగా బాల నేరాలు ముంబై మహానగరంలో జరుగుతుండగా, ఆ తర్వాత స్థానాల్లో పుణే, ఠాణే, నాసిక్ ఉన్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ వివరాల ప్రకారం.. ఏడు నుంచి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలు ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. 2011లో నమోదయిన 89 శాతం నేరాలను 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలలే చేశారని తేలింది. ఈ నేపథ్యంలో బాల నేరస్తుల కనీస వయస్సు 18 నుంచి 16కు తగ్గించాలన్న డిమాండ్ ప్రజల్లో వెల్లువెత్తింది. ఇలా తగ్గిస్తే బాల నేరస్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. మైనర్లు తీవ్ర నేరాలకు పాల్పడినప్పటికీ శిక్ష అనుభవించాల్సిన వయస్సు కాకపోవడంతో వీరిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ వీరికి సత్ప్రవర్తన, క్రమశిక్షణ, చదువు నేర్పుతున్నారు. చిన్న వయసులోనే హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు వంటి తీవ్ర నేరాలు పాల్పడడానికి సోషల్ మీడియా దోహదపడుతోందని సామాజికరంగ నిపుణులు అంటున్నారు. టీవీలు, ఇంటర్నెట్ వంటి చోట్ల నేరాల ఘటనలను చూసి ప్రేరణ పొందుతున్నారని విశ్లేషించారు. ఢిల్లీలో నిర్భయ కేసు, అదేవిధంగా ముంబై శక్తిమిల్‌లో జరిగిన అత్యాచారాల కేసుల విచారణ సందర్భంగా బాల నేరస్తుల వయస్సును తగ్గించాలని ప్రతిపాదన రావడం తెలిసిందే. సులువుగా వచ్చే డబ్బుతో బాల నేరస్తులు చెడు అలవాట్లకు కూడా బానిసలవుతున్నారు. మైనర్లు నేరాలకు పాల్పడ్డా, చిన్న వయసు కావడం వల్ల త్వరగా బెయిల్ వస్తోంది. దీంతో వీరు మరిన్ని నేరాలకు పాల్పడుతున్నారు. ఎన్సీఆర్బీ వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 2003లో మొత్తం 17,16,120 నేరాలు జరగ్గా అందులో బాల నేరస్తులవే 17,811 కేసులు ఉన్నాయి. 2004లో బాలల నేరాలు 19,229 నమోదు కాగా, 2005లో 18,939, 2006లో 21,088, 2007లో 22,865, 2008లో 24,535, 2009లో 23,926, 2013లో 31,725 ఇలా ప్రతి ఏడాది బాలల నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. -
దేశరాజధానిలో పట్టపగలే యువకుడి దారుణ హత్య
కత్తులతో దాడి చేసి హత్య.. నిందితుల్లో మైనర్లు.. సీసీటీవీలో వీడియో ఫుటేజీ న్యూఢిల్లీ: ఢిల్లీలో పట్టపగలే 21ఏళ్ల యువకుడు ఐదుగురు బాల నేరస్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఆగ్నేయ ఢిల్లీలో జనంతో కిక్కిరిసిన మదన్‌గిర్ సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నరకు ఈ దారుణ సంఘటన జరిగింది. ఐదుగురు బాలురు దారికాచి సచిన్ అనే యువకుడిపై కత్తులతో దాడిచేసి విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారని, తీవ్రంగా గాయపడిన సచిన్‌ను ఆసుపత్రికి తరలించగా, అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. సీసీటీవీల్లో రికార్డయిన భయానక వీడియో దృశ్యాల ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులిచ్చిన ఆధారాల సాయంతో ఐదుగురినీ అరెస్ట్ చేసి, వారిపై హత్యకేసు నమోదు చేశామన్నారు. సచిన్ తన స్నేహితుడితో కలసి బైక్‌పై వెళ్తుండగా, ఐదుగురు బాలురు ఎదురుగా దూసుకొచ్చారు. సచిన్‌ను ఒక్కసారిగా బైక్నుంచి కిందకు తోసివేశారు. సచిన్ స్నేహితుడు పారిపోగా, ఐదుగురూ సచిన్‌పై దాడిచేసి హతమార్చారు. దీనితో ఆ దారిన వెళ్తున్నవారు కూడా భయంతో హడలిపోయారు. అతన్ని రక్షించే ప్రయత్నం చేయలేకపోయారు. దాడిచేసిన వారిలో ఒకరు కత్తిని గాలిలో తిప్పుతూ, జనాన్ని బెదిరిస్తున్న దృశ్యాలు కూడా సీటీటీవీలో రికార్డయ్యాయి. తమ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురిలో 15ఏళ్ల బాలుణ్ణి పోలీసులు ప్రశ్నించగా కొన్ని విషయాలు తెలిశాయి.