న్యూఢిల్లీ: నగరంలో నేరాలకు పాల్పడుతున్న బాలల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఢిల్లీ పోలీసుల రికార్డులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. గత 10 నెలల కాలంలో బాలనేరస్తుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోయింది. ఇది చట్టాలను అమలు చేసేవారికి ఓ సవాల్‌గా మారింది. 18 ఏళ్లలోపు బాలలు సగటున రోజుకు ఆరు నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో 1,727 నేరాలు నమోదయ్యాయి. గొలుసు దొంగతనాలు, దోపిడీలు, హత్యాయత్నం, హత్యలు, లైంగికదాడులు తదితర నేరాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు సర్వసాధారణమైపోయాయి. నగర వ్యాప్తంగా 412 కేసులు నమోదయ్యాయి. 360 దోపిడీ కేసులు, ఇళ్లకు కన్నాలు వేసే కేసులు 145, హేయమైన నేరాలు 111 నమోద య్యాయి.
అదేవిధంగా బాలనేరస్తులపై 70 హత్య కేసులు, 74 హత్యాయత్నం కేసులు నమోద య్యాయి. ఇతర కేసులు 480. ఇందులో 60 శాతం కేసులు 16 నుంచి 18 ఏళ్ల లోపు వారిపైనే నమోదయ్యాయి. జాతీయ నేర రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇండియన్ పీనల్ కోడ్( ఐపీసీ), ప్రత్యేక స్థానిక చట్టం(ఎస్‌ఎల్‌ఎల్) లోని పలు సెక్షన్ల కింద బాలనేరస్తులపై 43,506 కేసులు నమోదయ్యాయి. ఇందులో 28,830 కేసులు 16 నుంచి 18 ఏళ్లలోపు బాలురు చేసినవే నని తేల్చింది. ఈ కేసులు 2012తో పోల్చితే..2013లో 2.5 శాతం పెరిగింది.
ఈ ఏడాది 13.6 శాతానికి పెరిగింది.బాలనేరస్తుల చట్టంలో సవరణలు చేపట్టాలని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రి మండలి సూచించింది. ఈ మేరకు జరిగిన సవరణల ప్రకారం 16 నుంచి 18 సంవత్సరాల్లోపు వయసు కలిగి అత్యాచారానికి పాల్పడినవారిని బాలల కింద పరిగణించాలా లేక యువకులుగా పరిగణించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం జువెనైల్ జస్టిస్ బోర్డుకు ఉంటుంది. ప్రస్తుతం 18 ఏళ్లలోపు వయసు కలిగినవారు నేరానికి పాల్పడితే వారిని బాలలుగా పరిగణిస్తున్న విషయం విదితమే. నేరం రుజువైతే జువెనైల్ హోంకు పంపుతున్నారు.
పెరుగుతున్న బాలనేరస్తుల సంఖ్య
Published Mon, Dec 1 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM
Advertisement
Advertisement