'భళా భారత్' చైనా విషయంలో యూఎస్ ప్రశంస
వాషింగ్టన్: భారత్‌పై అమెరికా ప్రశంసల జల్లు కురిపించింది. చైనా విషయంలో భారత్ చాలా పరిణితి చెందిన శక్తిగా వ్యవహరిస్తోందని, ఆ దేశం మాత్రం అసహనంతో వ్యవహరిస్తోందని పేర్కొంది. అమెరికాకు చెందిన నేవీ యుద్ధ కళాశాలకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ జేమ్స్ ఆర్ హోమ్స్ భారత్ చైనా మధ్య నెలకొన్న డోక్లామ్ విషయంపై స్పందించారు. గత 50 రోజులుగా రెండు దేశాల మధ్య ఈ సమస్య రగులుతుందని, ఇప్పటి వరకు తాను చేసిన విశ్లేషణలో భారత్ చాలా వ్యూహాత్మకంగా, పరిణతి చెందిన దేశంగా వ్యవహరించిందని అన్నారు.
భారత్ చేస్తూ వస్తున్న పనులన్నీ కూడా సరైనవేనని, వివాదం విషయంలోగానీ, సమాధానం ఇవ్వడంలోగానీ చైనాకంటే గొప్పగా భారత్ వ్యవహరిస్తోందంటూ ఆయన కితాబిచ్చారు. 'భారత్ చాలా పరిణతి చెందిన శక్తిగా వ్యవహరిస్తూ ఓ పరిపక్వత లేని పెంకితనంతో వ్యవహరించే దేశం ఎలా వ్యవహరిస్తుందో అలాంటి దేశంగా చైనాను ప్రపంచానికి చూపిస్తోంది. సరిహద్దు వద్ద వివాదం కొనసాగించాలని చైనా చూస్తున్నట్లు తెలుస్తోందన్నారు. హిమాలయాల సరిహద్దు విషయంలో కూడా ఆయన స్పందిస్తూ ప్రధాని నరేంద్రమోదీగానీ, ఆయన సలహాదారులుగానీ ఈ విషయంలో అమెరికా జోక్యాన్ని ఆహ్వానించబోరని, ఒక వేళ ఆ సమస్య ముదిరితే మాత్రం భారత్‌కు మద్దతుగానే అమెరికా వస్తుందని తెలిపారు.