భారత్కు మరో 26/11 ముప్పు పొంచి ఉందా?
భారత ఉపఖండంలో అల్ కాయిదా కొత్త శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు అల్ జవహరి ప్రకటించడం సరికొత్త ప్రమాదాలకు తావిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ సాయంతో తన సొంత ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే భారతదేశానికి మరో 26/11 దాడి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు అంటున్నాయి.
అల్ కాయిదా విషయంలో అమెరికా పెద్దగా స్పందించలేదు గానీ, భారతదేశం మాత్రం వెంటనే అప్రమత్తమైంది. హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర నిఘా ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ప్రధాని నరేంద్రమోడీకి కూడా భారతదేశం మీద మరో ముంబై తరహా దాడి జరగొచ్చన్న సమాచారం పక్కాగా వచ్చినట్లు తెలిసింది. దాంతో దేశవ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు.
అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా సేనలు ఈ ఏడాది చివరికల్లా వెళ్లిపోతాయి కాబట్టి, ఆ దేశం పెద్దగా అల్ కాయిదా గురించి పట్టించుకోవట్లేదు గానీ.. భారత్ మాత్రం అంత తేలిగ్గా తీసి పారేసే పరిస్థితి లేదు. ముంబై అనుభవం మన దేశ భద్రతా వ్యవస్థలోని లోపాల గురించి సమీక్షించుకోడానికి ఓ అవకాశం కల్పించింది.
మన దేశం ఉగ్రవాద దాడులకు అత్యంత అనుకూలమని భద్రతా రంగ నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇక్కడ పెరుగుతున్న జనసాంద్రత, నిఘావ్యవస్థలో లోపాలు, అడుగడుగునా అవినీతి, పోలీసు శాఖ అసమర్థత.. వీటన్నింటి ఫలితంగా ఉగ్రవాద దాడుల ముప్పు మనకు చాలా ఎక్కువ అని అంటున్నారు. అందుకే రాబోయే ఏడాది నుంచి రెండేళ్ల మధ్య కాలంలో మరో 26/11 తరహా దాడి జరిగే ప్రమాదం లేకపోలేదని గట్టిగా అంటున్నారు. ఆనాటి దాడిలో కూడా లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోడానికి చేసిందేనన్న వాదన ఉంది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా పలు జీహాదీ గ్రూపులు బయల్దేరడంతో తన ఉనికిని చాటుకోడానికి లష్కర్ ఈ దాడి చేసిందంటున్నారు.
ఇప్పుడు అల్ కాయిదా కూడా పెద్దగా ఉనికిలో లేదు. ఇప్పుడు సైతం ప్రపంచవ్యాప్తంగా పలు జీహాదీ సంస్థలు రావడంతో ఈ సంస్థ తన ఉనికిని చాటుకోడానికి, ఆధిపత్యం నిరూపించుకోడానికి ఓ ప్రయత్నం తప్పకుండా చేస్తుందని, అందుకు లక్ష్యం కూడా భారతదేశమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.