రఫెల్ యుద్ధ విమానాలు దిగుతున్నాయ్
న్యూఢిల్లీ: భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. వాయువేగంకంటే వేగంగా దూసుకెళ్లగలిగే రఫెల్ యుద్ధ విమానాలు త్వరలోనే భారత్ వాయుసేనలో అడుగుపెట్టనున్నాయి. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ఒప్పందానికి సంబంధించి శుక్రవారం చారిత్రాత్మక అడుగుపడింది. భారత్, ఫ్రాన్స్ మధ్య ఈ విమానాల కొనుగోలుకు సంబంధించి సంతకాలు అయ్యాయి. దాదాపు 7.87బిలియన్ యూరోలు(రూ.58వేల 363కోట్లు)లతో కొనుగోలు చేయనున్న రఫెల్ ఫైటర్ జెట్ విమానాలకు లైన్ క్లియర్ అయింది. శుక్రవారం కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఫ్రాన్స్ రక్షణమంత్రి జియాన్ యూలీ డ్రెయిన్ సంతకాలు చేశారు.
ఫ్రాన్స్ నుంచి 36 రఫెల్ జెట్ విమానాలను కొనుగోలుచేస్తామని ఆ దేశ పర్యటన సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీ 16 నెలల కింద చెప్పిన మాటలు ఈ సంతకాలతో నిజమయ్యాయి. 2015 ఏప్రిల్‌లో భారత ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండేల మధ్య పారిస్‌లో కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా 36 విమానాలతో పాటు వాటికి సంబంధించిన ఆయుధాలు, నిర్వహణ సామాగ్రి, విడి భాగాలను ఫ్రాన్స్ బారత్‌కు అప్పగిస్తుంది. తాజా ఒప్పందం ప్రకారం 2019 నుంచే అవి ఐఎఎఫ్‌లోకి నేరుగా ప్రవేశిస్తాయి.
ఈ యుద్ధ విమానాలకు క్షిపణులు విసిరే సామర్థ్యంతోపాటు ఇతర మిశ్రమ శ్రేణి ఆయుధాలను ఉపయోగించగల సామర్థ్యం ఉంటుంది. ముఖ్యంగా పాకిస్థాన్లాంటి దేశాలతో తలపడాల్సి వచ్చినప్పుడు ఈ విమానాలు అత్యంత సమర్థనీయంగా పనిచేస్తాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ విమానాల కొనుగోలుకు ప్రతిపాదనలు వచ్చినా కొన్ని కారణాలతో అది ఆగిపోయింది. ముందడుగుపడకుండా ఉండిపోయింది. దీంతో దానిని పూర్తిగా పక్కకు పడేసిన మోదీ ప్రభుత్వం తిరిగి తమ తరుపున ప్రత్యేక శ్రద్ధతో జరిపిన చర్చలు ప్రతిఫలించడంతో ఎట్టకేలకు ఈ విమానాల కొనుగోలుకు అడుగుపడింది.
ఫ్రాన్స్ మొదట 36 రఫెల్ యుద్ధ విమానాల కోసం 12 బియన్ డాలర్లను డిమాండ్ చేసింది. అయితే, భారత్ మాత్రం ఫ్రాన్స్ చెప్పిన మొత్తం కన్నా.. సుమారు మూడు బిలియన్ డాలర్ల తక్కువకే ఒప్పందం కుదుర్చుకుంది. మొదట 126 రఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ భావించింది. దాని కోసం 12 బిలియన్ల డాలర్లను కూడా ఖర్చు చేయాలని నిర్ణయించింది. అయితే అంతమొత్తం యుద్ధ విమానాల ధరపై ఒప్పందం కుదరకపోవడంతో ఆ సంఖ్యను 36కు తగ్గించారు.
(ఫైల్ ఫోటోస్)