న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ దళాల సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా రూ.38,900 కోట్లతో 33 యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర ఆయుధాల కొనుగోలుకు రక్షణ శాఖ గురువారం అనుమతి ఇచ్చింది. రష్యా నుంచి 21 మిగ్–29 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయనున్నారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) నుంచి 12 సుఖోయ్–30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సమకూర్చుకోనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న 59 మిగ్–29 ఎయిర్‌క్రాఫ్ట్‌లను అప్‌గ్రేడ్ చేసేందుకు రక్షణ శాఖ అంగీకరించింది. 248 అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ సైతం కొనుగోలు చేయనున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. 21 మిగ్–29 ఫైటర్ జెట్ల కొనుగోలుకు, 59 మిగ్–29 ఎయిర్‌క్రాఫ్ట్‌ల అప్‌గ్రెడేషన్‌కు రూ.7,418 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. హెచ్‌ఏఎల్ నుంచి 12 సూ–30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సమకూర్చుకోవడానికి రూ.10,730 కోట్లు అవసరమని అధికారులు తెలిపారు. అంతేకాకుండా నావికా దళం, వైమానిక దళానికి అవసరమైన లాంగ్‌రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ సిస్టమ్స్, అస్త్రా క్షిపణుల కొనుగోలుకు రూ.20,400 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
మిగ్–29 ప్రత్యేకతలు
గాల్లో నుంచి శత్రువులపై నిప్పుల వర్షం కురిపించే మిగ్–29 జెట్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను 1970వ దశకంలో అప్పటి సోవియట్ యూనియన్‌లో మికోయాన్ డిజైన్ బ్యూరో అనే కంపెనీ తయారు చేసింది. ఇందులో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఇవి 1982లో తొలిసారిగా సోవియట్ ఎయిర్‌ఫోర్సులో చేరాయి. అమెరికాకు చెందిన ఈగల్, ఫాల్కన్ ఫైటర్ జెట్లకు పోటీగా వీటిని తీసుకొచ్చారు. ప్రపంచంలో 30కిపైగా దేశాలు మిగ్–29 జెట్లను కలిగి ఉన్నాయి. ఇవి వివిధ విధులు నిర్వర్తించే మల్టీరోల్ ఫైటర్లుగా పేరుగాంచాయి. ప్రధానంగా నింగి నుంచి నేలపై ఉన్న శత్రువులను దెబ్బతీయడానికి ఈ జెట్లను ఉపయోగిస్తారు.
సుఖోయ్.. లాంగ్ రేంజ్
రష్యాకు చెందిన సుఖోయ్ కార్పొరేషన్ సూ–30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అభివృద్ధి చేసింది. ఇవి మల్టీరోల్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్లుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. 2002లో భారత వైమానిక దళం ఇలాంటి కొన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లను రష్యా నుంచి కొనుగోలు చేసింది. భారత వైమానిక దళం వద్ద 2020 జనవరి నాటికి దాదాపు 260 సూ–30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. లాంగ్ రేంజ్.. అంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఇవి సులువుగా ఛేదించగలవు.
యాప్‌లపై నిషేధం.. డిజిటల్ స్ట్రైక్
చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్‌లో నిషేధించడాన్ని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ‘డిజిటల్ స్ట్రైక్’గా అభివర్ణించారు. దేశ ప్రజల డేటాను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. భారత్ శాంతినే కోరుకుంటుందని, అయితే, ఎవరైనా దుర్బుద్ధితో భారత భూభాగంపై కన్నువేస్తే తగిన గుణపాఠం చెబుతుందని వ్యాఖ్యానించారు. గల్వాన్ లోయ ఘర్షణల్లో భారత సైనికులు 20 మంది చనిపోతే.. అంతకు రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులను అంతమొందించామని చెప్పారు. పశ్చిమబెంగాల్ బీజేపీ కార్యకర్తలనుద్దేశించి గురువారం వర్చువల్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ప్రధానమంత్రి మోదీ దేశ రక్షణ విషయంలో రాజీ పడబోరన్నారు.
Comments
Please login to add a commentAdd a comment