sukhoi jet
-
అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలు
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ దళాల సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా రూ.38,900 కోట్లతో 33 యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర ఆయుధాల కొనుగోలుకు రక్షణ శాఖ గురువారం అనుమతి ఇచ్చింది. రష్యా నుంచి 21 మిగ్–29 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయనున్నారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి 12 సుఖోయ్–30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సమకూర్చుకోనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న 59 మిగ్–29 ఎయిర్‌క్రాఫ్ట్‌లను అప్‌గ్రేడ్ చేసేందుకు రక్షణ శాఖ అంగీకరించింది. 248 అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ సైతం కొనుగోలు చేయనున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. 21 మిగ్–29 ఫైటర్ జెట్ల కొనుగోలుకు, 59 మిగ్–29 ఎయిర్‌క్రాఫ్ట్‌ల అప్‌గ్రెడేషన్‌కు రూ.7,418 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. హెచ్ఏఎల్ నుంచి 12 సూ–30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సమకూర్చుకోవడానికి రూ.10,730 కోట్లు అవసరమని అధికారులు తెలిపారు. అంతేకాకుండా నావికా దళం, వైమానిక దళానికి అవసరమైన లాంగ్రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ సిస్టమ్స్, అస్త్రా క్షిపణుల కొనుగోలుకు రూ.20,400 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. మిగ్–29 ప్రత్యేకతలు గాల్లో నుంచి శత్రువులపై నిప్పుల వర్షం కురిపించే మిగ్–29 జెట్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను 1970వ దశకంలో అప్పటి సోవియట్ యూనియన్‌లో మికోయాన్ డిజైన్ బ్యూరో అనే కంపెనీ తయారు చేసింది. ఇందులో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఇవి 1982లో తొలిసారిగా సోవియట్ ఎయిర్‌ఫోర్సులో చేరాయి. అమెరికాకు చెందిన ఈగల్, ఫాల్కన్ ఫైటర్ జెట్లకు పోటీగా వీటిని తీసుకొచ్చారు. ప్రపంచంలో 30కిపైగా దేశాలు మిగ్–29 జెట్లను కలిగి ఉన్నాయి. ఇవి వివిధ విధులు నిర్వర్తించే మల్టీరోల్ ఫైటర్లుగా పేరుగాంచాయి. ప్రధానంగా నింగి నుంచి నేలపై ఉన్న శత్రువులను దెబ్బతీయడానికి ఈ జెట్లను ఉపయోగిస్తారు. సుఖోయ్.. లాంగ్ రేంజ్ రష్యాకు చెందిన సుఖోయ్ కార్పొరేషన్ సూ–30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అభివృద్ధి చేసింది. ఇవి మల్టీరోల్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్లుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. 2002లో భారత వైమానిక దళం ఇలాంటి కొన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లను రష్యా నుంచి కొనుగోలు చేసింది. భారత వైమానిక దళం వద్ద 2020 జనవరి నాటికి దాదాపు 260 సూ–30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. లాంగ్ రేంజ్.. అంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఇవి సులువుగా ఛేదించగలవు. యాప్‌లపై నిషేధం.. డిజిటల్ స్ట్రైక్ చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్‌లో నిషేధించడాన్ని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ‘డిజిటల్ స్ట్రైక్’గా అభివర్ణించారు. దేశ ప్రజల డేటాను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. భారత్ శాంతినే కోరుకుంటుందని, అయితే, ఎవరైనా దుర్బుద్ధితో భారత భూభాగంపై కన్నువేస్తే తగిన గుణపాఠం చెబుతుందని వ్యాఖ్యానించారు. గల్వాన్ లోయ ఘర్షణల్లో భారత సైనికులు 20 మంది చనిపోతే.. అంతకు రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులను అంతమొందించామని చెప్పారు. పశ్చిమబెంగాల్ బీజేపీ కార్యకర్తలనుద్దేశించి గురువారం వర్చువల్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ప్రధానమంత్రి మోదీ దేశ రక్షణ విషయంలో రాజీ పడబోరన్నారు. -
నాసిక్ వద్ద కుప్పకూలిన సుఖోయ్ యుద్ధవిమానం
-
చైనాకు కౌంటర్.. రంగంలోకి సుఖోయ్!
డెహ్రాడూన్: సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేసేదిశగా భారత్ కదులుతోంది. డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్టులోని సివిల్ ఎయిర్‌ఫీల్డ్‌ను భారత వైమానిక దళం సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకువస్తోంది. అంతేకాకుండా ఇక్కడి నుంచి రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు (ఎస్‌యూ-30ఎంకేఐ) రంగంలోకి దించబోతోంది. సాధారణ ప్రక్రియలో భాగంగానే ఎయిర్‌ఫీల్డ్‌ను యాక్టివేట్ చేస్తున్నామని, ఇక్కడినుంచి సుఖోయ్ యుద్ధవిమానాలను రెండు రోజులపాటు (ఫిబ్రవరి 19, 20 తేదీల్లో) నడుపనున్నామని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రోజుల్లో ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న అనంతరం రెండు యుద్ధ విమానాలు తిరిగి వైమానిక స్థావరం చేరుకుంటాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ఇటీవల గగనతల ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో పొరుగుదేశానికి దీటైన బదులు ఇచ్చేందుకు భారత్ ఈ చర్య చేపడుతున్నట్టు భావిస్తున్నారు. ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌తో ఉన్న దాదాపు 4వేల కిలోమీటర్ల సరిహద్దులో చైనా సైన్యాన్ని భారీ ఎత్తున మోహరించింది. చైనా సైన్యం మోహరించిన సరిహద్దుల్లో ఉత్తరాఖండ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో పొరుగుదేశానికి బలమైన సంకేతాలు ఇచ్చేందుకు భారత వైమానిక దళం తన యుద్ధవిమానాలను రంగంలోకి దింపుతుందని భావిస్తున్నారు. -
వహ్వా...బ్రహ్మోస్!
దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మలిచే కృషిలో మేలిమలుపుగా భావించే కీలక ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది. మన వాయుసేనకు అందించబోయే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను శాస్త్రవేత్తలు తొలిసారి విజయవంతంగా ప్రయో గించారు. సుఖోయ్ యుద్ధ విమానంతో అనుసంధానించిన ఈ క్షిపణి ప్రయోగించిందే తడవుగా ధ్వనిని మించి మూడు రెట్ల వేగంతో దూసుకుపోయి బంగా ళాఖాతంలోని లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేసిన కృషిని స్మరించుకోవాలి. శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు మన దేశ రక్షణకు పటిష్టమైన క్షిపణి వ్యవస్థ అవసరమని పాలకులను ఒప్పించింది ఆయనే. 1998లో రష్యాతో బ్రహ్మోస్ క్షిపణులపై ఒడంబడిక కుదరడంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. మన బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్వా నదుల పేర్లు అనుసంధానించి ఈ ప్రాజెక్టుకు ‘బ్రహ్మోస్’ అని పేరుపెట్టారు. ఇప్పటికే బ్రహ్మోస్ మన సైనిక, నావికా దళాల అస్త్ర తూణీరంలో చేరింది. వాస్తవానికి వాయుసేనకు సైతం 2012కల్లా దీన్ని అందించాలని మొదట్లో అనుకున్నారు. అయితే అందులోని సాధకబాధకలు తక్కువేమీ కాదు. క్షిపణిని మోసుకెళ్లడానికి అనువుగా సుఖోయ్ యుద్ధ విమానాలను తీర్చిదిద్దడం ఒక సవాలు. అదే సమ యంలో అటు క్షిపణి బరువు కూడా తగ్గాలి. మన శాస్త్రవేత్తలు ఈ రెండూ సాధించగలిగారు. సుఖోయ్ యుద్ధ విమానానికి అవసరమైన మార్పుల్ని వాటిని సరఫరా చేసిన రష్యా రక్షణ రంగ సంస్థ సాంకేతిక తోడ్పాటు అవసరం లేకుండానే నాసిక్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) శాస్త్రవేత్తలు సవ రించారు. అలాగే సైనిక, నావికాదళాల అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మోస్ క్షిపణుల బరువు 3,000 కిలోలుంటే, సుఖోయ్‌కి అమర్చింది 2,500 కిలోలు మించలేదు. బ్రహ్మోస్ క్షిపణిని సుఖోయ్ యుద్ధ విమానం అవలీలగా మోసుకెళ్లడం, అది లక్ష్యాన్ని ఛేదించడం వెనక ఇంతటి విస్తృతమైన కృషి ఉంది. ఇది ఇంతటితో అయిపోలేదు. ఒక్క సుఖోయ్ మాత్రమే కాదు... వాయుసేన వద్ద ఉన్న మిగ్–29 యుద్ధ విమానాలకూ, నావికాదళం వినియోగించే మిగ్–29కె యుద్ధ విమానా లకూ, భవిష్యత్తులో మనకు సమకూరబోయే రాఫెల్ జెట్ విమానాలకు సైతం బ్రహ్మోస్ క్షిపణులు అమర్చడానికి మన శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాదు... ప్రస్తుత బ్రహ్మోస్ లక్షిత దూరం 290 కిలోమీటర్లనూ 450 కిలోమీటర్లకు పెంచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అసలు మూడు బ్రహ్మోస్ క్షిపణులు మోసుకెళ్లగలిగే రీతిలో సుఖోయ్ యుద్ధ విమానాలను రూపొందించాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన. సుఖోయ్ రెక్కలవద్ద చెరొకటి, మధ్యలో ఒకటి ఈ క్షిపణులు అమర్చవచ్చునని, అదే జరిగితే యుద్ధ విమానం ఒకసారి గాల్లోకి లేచాక మూడు లక్ష్యాలను దెబ్బతీసే సామర్ధ్యాన్ని సంత రించుకుంటుందని భావించారు. అయితే వివిధ అధ్యయనాల తర్వాత ఆ స్థాయి మార్పులు సాంకేతికంగా క్షేమకరం కాదని, అటు ఆర్ధికంగా కూడా పెనుభార మవుతుందని తేల్చారు. అందుకే ఆ యోచనను విరమించుకుని ఒకసారి ఒక క్షిపణిని తీసుకెళ్లేలా రూపకల్పన చేశారు. నిరుడు సుఖోయ్‌కు బ్రహ్మోస్ క్షిపణిని అమర్చి తొలిసారి వినువీధికి పంపారు. ఇప్పుడు దాన్ని ప్రయోగించి చూశారు. అటు సుఖోయ్ యుద్ధ విమానమూ, ఇటు బ్రహ్మోస్ క్షిపణి సామాన్యమైనవి కాదు. శత్రువు తేరుకుని స్పందించేలోపునే దాడి చేసి వెనక్కు రాగల సామర్ధ్యం సుఖోయ్‌ల సొంతం. క్షిపణుల్ని అల్లంత దూరాన ఉండగానే పసిగట్టి వాటిపై ఎదురుదాడి చేయగల నౌకలు చాలా దేశాలకున్నాయి. కానీ బ్రహ్మోస్ క్షిపణి ముందు వాటి ఆటలు సాగవు. అవి దాడికి దిగేలోపే ఆ నౌకలను బ్రహ్మోస్ భగ్గున మండించి మసి చేస్తుంది. లోతైన బంకర్లలో దాగిన విధ్వంసక ఆయుధ సామగ్రి, అణ్వాయుధాలు, జీవ ఆయుధాల గిడ్డంగులను సైతం కనిపెట్టి ధ్వంసం చేయడం బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకత. ప్రపంచంలోని ఏ యుద్ధ నౌకలోనూ బ్రహ్మోస్ వేగాన్ని అధిగమించగల క్షిపణులు లేవు. అమెరికా తోమహక్, హర్పూన్ క్షిపణుల కంటే కూడా బ్రహ్మోస్ మేలైనది. ఎంతటి సంక్లిష్ట మార్గంలోనైనా వెళ్లగలగడం, పరిసరాల్లో ఎలాంటి విధ్వంసం సృష్టించకుండా కేవలం నిర్దేశించిన లక్ష్యాన్ని మాత్రమే దెబ్బతీయడం బ్రహ్మోస్ విశిష్టత. బ్రహ్మోస్ క్షిపణì కేవలం స్వీయ రక్షణకు మాత్రమే కాదు.... దాన్ని వేరే దేశాలకు విక్రయించడం కూడా భారత్–రష్యాల మధ్య కుదిరిన ఒడంబడికలోని కీలకాంశం. ఆ క్షిపణుల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తి, మార్కెటింగ్ చేయాలన్నది ఆ ఒడంబడిక సారాంశం. బ్రహ్మోస్ క్షిపణులను దక్షిణాఫ్రికా, వియత్నాం, యూఏఈలకు విక్రయించడంపై ఇప్పటికే అంగీకారం కుదిరింది. వాణిజ్యపరంగా కూడా ఇది లాభసాటి కావడం శుభ పరిణామం. 1990 నాటి గల్ఫ్ యుద్ధం సమ యంలో క్రూయిజ్ క్షిపణుల అవసరం అందరికీ తెలిసివచ్చింది. ఈ క్షిపణుల కోసం ఎవరిపైనో ఆధారపడే పరిస్థితి ఉండరాదని డాక్టర్ అబ్దుల్ కలామ్ మొదట్నించీ పట్టుబట్టారు. అందుకే సొంతంగా అభివృద్ధి చేసుకోవడానికి, ఉత్పత్తి చేసు కోవడానికి అనువుగా రష్యాతో కలిసి సంయుక్త రంగంలో బ్రహ్మోస్ ప్రాజెక్టును ప్రారంభించారు. రక్షణ రంగంలో పటిష్టంగా ఉన్నప్పుడే శత్రు దేశాలు దాడికి జంకుతాయి. నిజానికి ఆ విషయంలో చాలా దేశాలకన్నా మన దేశం ఇంకా వెన కబడే ఉంది. రక్షణ కొనుగోళ్లకు సంబంధించి ప్రయత్నాలు సాగించినప్పుడల్లా కుంభకోణాల కథనాలు గుప్పుమనడం మన దేశంలో రివాజుగా మారింది. బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం, బరాక్ క్షిపణుల స్కాం మొదలుకొని అన్నిటి విషయంలోనూ ఇదే వరస. అందుకే రక్షణ రంగంలో స్వావలంబన సాధించి సాధ్యమైనంతవరకూ దిగుమతులపై ఆధారపడకుండా చూసుకోగలగాలి. అలా చూస్తే మన బ్రహ్మోస్ విజయవంతమైన ప్రాజెక్టు . ఇది మరిన్ని రక్షణ రంగ ప్రాజె క్టులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, మన దేశాన్ని ఆ రంగంలో అగ్రగామిగా నిలుపు తుందని ఆశించాలి. -
చైనా భయంతోనే..
బీజింగ్: తమ పరువును కాపాడుకునేందుకు రష్యా తాపత్రయ పడిందా?. తాజా పరిణామం ఈ విషయాన్నే సూచిస్తోంది. ఐదో తరానికి చెందిన సుఖోయ్ ఎస్ యూ-35 జెట్లను రెండేళ్లుగా చైనాకు అందజేయకుండా నాన్చుతూ వచ్చిన రష్యా.. ఎట్టకేలకు నాలుగు ఎస్ యూ-35 ఫైటర్లను అందించింది. అయితే, ఎస్ యూ-35 లను చైనాకు అందజేయడంలో రష్యా ఎందుకు జాప్యం చేసింది అన్న విషయంపై ఓ ఆసక్తికర రిపోర్టు వచ్చింది. చైనా తయారుచేస్తున్న జే-20 స్టెల్త్ ఫైటర్ శక్తి సామర్ధ్యాల కంటే ఎస్ యూ-35ల సామర్ధ్యాలు తక్కువైతే తమ పరువుపోతుందని రష్యా భావించింది. అంతేకాకుండా మార్కెట్లో కూడా ఎస్ యూ-35లకు విలువ ఉండదు. దీంతో ఆత్మరక్షణలో పడిన రష్యా.. చైనాతో ఒప్పందం కుదరినా.. ఫైటర్లను అందజేతలో ఆలస్యం చేసింది. గత నెలలో చైనా మిలటరీ జే-20 ఫైటర్ ను తొలిసారి పరీక్షించిన విషయం తెలిసిందే. దీంతో రష్యా సుఖోయ్ ఎస్ యూ-35 లను ఒప్పందం ప్రకారం చైనాకు అందించింది. కాగా కొత్త రకపు జెట్లను తయారుచేయడంలో దూసుకుపోతున్న చైనా సొంతగా ఇంజన్ల తయారీ విషయంలో మాత్రం ఇంకా వెనుకే ఉంది. ఫైటర్లకు అవసరమయ్యే ఇంజన్లను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది.