దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మలిచే కృషిలో మేలిమలుపుగా భావించే కీలక ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది. మన వాయుసేనకు అందించబోయే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను శాస్త్రవేత్తలు తొలిసారి విజయవంతంగా ప్రయో గించారు. సుఖోయ్ యుద్ధ విమానంతో అనుసంధానించిన ఈ క్షిపణి ప్రయోగించిందే తడవుగా ధ్వనిని మించి మూడు రెట్ల వేగంతో దూసుకుపోయి బంగా ళాఖాతంలోని లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేసిన కృషిని స్మరించుకోవాలి. శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు మన దేశ రక్షణకు పటిష్టమైన క్షిపణి వ్యవస్థ అవసరమని పాలకులను ఒప్పించింది ఆయనే. 1998లో రష్యాతో బ్రహ్మోస్ క్షిపణులపై ఒడంబడిక కుదరడంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. మన బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్వా నదుల పేర్లు అనుసంధానించి ఈ ప్రాజెక్టుకు ‘బ్రహ్మోస్’ అని పేరుపెట్టారు. ఇప్పటికే బ్రహ్మోస్ మన సైనిక, నావికా దళాల అస్త్ర తూణీరంలో చేరింది. వాస్తవానికి వాయుసేనకు సైతం 2012కల్లా దీన్ని అందించాలని మొదట్లో అనుకున్నారు.
అయితే అందులోని సాధకబాధకలు తక్కువేమీ కాదు. క్షిపణిని మోసుకెళ్లడానికి అనువుగా సుఖోయ్ యుద్ధ విమానాలను తీర్చిదిద్దడం ఒక సవాలు. అదే సమ యంలో అటు క్షిపణి బరువు కూడా తగ్గాలి. మన శాస్త్రవేత్తలు ఈ రెండూ సాధించగలిగారు. సుఖోయ్ యుద్ధ విమానానికి అవసరమైన మార్పుల్ని వాటిని సరఫరా చేసిన రష్యా రక్షణ రంగ సంస్థ సాంకేతిక తోడ్పాటు అవసరం లేకుండానే నాసిక్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) శాస్త్రవేత్తలు సవ రించారు. అలాగే సైనిక, నావికాదళాల అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మోస్ క్షిపణుల బరువు 3,000 కిలోలుంటే, సుఖోయ్‌కి అమర్చింది 2,500 కిలోలు మించలేదు. బ్రహ్మోస్ క్షిపణిని సుఖోయ్ యుద్ధ విమానం అవలీలగా మోసుకెళ్లడం, అది లక్ష్యాన్ని ఛేదించడం వెనక ఇంతటి విస్తృతమైన కృషి ఉంది. ఇది ఇంతటితో అయిపోలేదు. ఒక్క సుఖోయ్ మాత్రమే కాదు... వాయుసేన వద్ద ఉన్న మిగ్–29 యుద్ధ విమానాలకూ, నావికాదళం వినియోగించే మిగ్–29కె యుద్ధ విమానా లకూ, భవిష్యత్తులో మనకు సమకూరబోయే రాఫెల్ జెట్ విమానాలకు సైతం బ్రహ్మోస్ క్షిపణులు అమర్చడానికి మన శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాదు... ప్రస్తుత బ్రహ్మోస్ లక్షిత దూరం 290 కిలోమీటర్లనూ 450 కిలోమీటర్లకు పెంచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.
అసలు మూడు బ్రహ్మోస్ క్షిపణులు మోసుకెళ్లగలిగే రీతిలో సుఖోయ్ యుద్ధ విమానాలను రూపొందించాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన. సుఖోయ్ రెక్కలవద్ద చెరొకటి, మధ్యలో ఒకటి ఈ క్షిపణులు అమర్చవచ్చునని, అదే జరిగితే యుద్ధ విమానం ఒకసారి గాల్లోకి లేచాక మూడు లక్ష్యాలను దెబ్బతీసే సామర్ధ్యాన్ని సంత రించుకుంటుందని భావించారు. అయితే వివిధ అధ్యయనాల తర్వాత ఆ స్థాయి మార్పులు సాంకేతికంగా క్షేమకరం కాదని, అటు ఆర్ధికంగా కూడా పెనుభార మవుతుందని తేల్చారు. అందుకే ఆ యోచనను విరమించుకుని ఒకసారి ఒక క్షిపణిని తీసుకెళ్లేలా రూపకల్పన చేశారు. నిరుడు సుఖోయ్‌కు బ్రహ్మోస్ క్షిపణిని అమర్చి తొలిసారి వినువీధికి పంపారు. ఇప్పుడు దాన్ని ప్రయోగించి చూశారు. అటు సుఖోయ్ యుద్ధ విమానమూ, ఇటు బ్రహ్మోస్ క్షిపణి సామాన్యమైనవి కాదు. శత్రువు తేరుకుని స్పందించేలోపునే దాడి చేసి వెనక్కు రాగల సామర్ధ్యం సుఖోయ్‌ల సొంతం. క్షిపణుల్ని అల్లంత దూరాన ఉండగానే పసిగట్టి వాటిపై ఎదురుదాడి చేయగల నౌకలు చాలా దేశాలకున్నాయి. కానీ బ్రహ్మోస్ క్షిపణి ముందు వాటి ఆటలు సాగవు. అవి దాడికి దిగేలోపే ఆ నౌకలను బ్రహ్మోస్ భగ్గున మండించి మసి చేస్తుంది. లోతైన బంకర్లలో దాగిన విధ్వంసక ఆయుధ సామగ్రి, అణ్వాయుధాలు, జీవ ఆయుధాల గిడ్డంగులను సైతం కనిపెట్టి ధ్వంసం చేయడం బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకత. ప్రపంచంలోని ఏ యుద్ధ నౌకలోనూ బ్రహ్మోస్ వేగాన్ని అధిగమించగల క్షిపణులు లేవు. అమెరికా తోమహక్, హర్పూన్ క్షిపణుల కంటే కూడా బ్రహ్మోస్ మేలైనది. ఎంతటి సంక్లిష్ట మార్గంలోనైనా వెళ్లగలగడం, పరిసరాల్లో ఎలాంటి విధ్వంసం సృష్టించకుండా కేవలం నిర్దేశించిన లక్ష్యాన్ని మాత్రమే దెబ్బతీయడం బ్రహ్మోస్ విశిష్టత.
బ్రహ్మోస్ క్షిపణì కేవలం స్వీయ రక్షణకు మాత్రమే కాదు.... దాన్ని వేరే దేశాలకు విక్రయించడం కూడా భారత్–రష్యాల మధ్య కుదిరిన ఒడంబడికలోని కీలకాంశం. ఆ క్షిపణుల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తి, మార్కెటింగ్ చేయాలన్నది ఆ ఒడంబడిక సారాంశం. బ్రహ్మోస్ క్షిపణులను దక్షిణాఫ్రికా, వియత్నాం, యూఏఈలకు విక్రయించడంపై ఇప్పటికే అంగీకారం కుదిరింది. వాణిజ్యపరంగా కూడా ఇది లాభసాటి కావడం శుభ పరిణామం. 1990 నాటి గల్ఫ్ యుద్ధం సమ యంలో క్రూయిజ్ క్షిపణుల అవసరం అందరికీ తెలిసివచ్చింది. ఈ క్షిపణుల కోసం ఎవరిపైనో ఆధారపడే పరిస్థితి ఉండరాదని డాక్టర్ అబ్దుల్ కలామ్ మొదట్నించీ పట్టుబట్టారు. అందుకే సొంతంగా అభివృద్ధి చేసుకోవడానికి, ఉత్పత్తి చేసు కోవడానికి అనువుగా రష్యాతో కలిసి సంయుక్త రంగంలో బ్రహ్మోస్ ప్రాజెక్టును ప్రారంభించారు. రక్షణ రంగంలో పటిష్టంగా ఉన్నప్పుడే శత్రు దేశాలు దాడికి జంకుతాయి. నిజానికి ఆ విషయంలో చాలా దేశాలకన్నా మన దేశం ఇంకా వెన కబడే ఉంది. రక్షణ కొనుగోళ్లకు సంబంధించి ప్రయత్నాలు సాగించినప్పుడల్లా కుంభకోణాల కథనాలు గుప్పుమనడం మన దేశంలో రివాజుగా మారింది. బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం, బరాక్ క్షిపణుల స్కాం మొదలుకొని అన్నిటి విషయంలోనూ ఇదే వరస. అందుకే రక్షణ రంగంలో స్వావలంబన సాధించి సాధ్యమైనంతవరకూ దిగుమతులపై ఆధారపడకుండా చూసుకోగలగాలి. అలా చూస్తే మన బ్రహ్మోస్ విజయవంతమైన ప్రాజెక్టు . ఇది మరిన్ని రక్షణ రంగ ప్రాజె క్టులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, మన దేశాన్ని ఆ రంగంలో అగ్రగామిగా నిలుపు తుందని ఆశించాలి.
వహ్వా...బ్రహ్మోస్!
Published Fri, Nov 24 2017 12:50 AM | Last Updated on Fri, Nov 24 2017 12:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment