నేడు ఉత్తర కొరియాకు పుతిన్‌ | Russian President Vladimir Putin set to visit Kim Jong Un in North Korea | Sakshi
Sakshi News home page

నేడు ఉత్తర కొరియాకు పుతిన్‌

Published Tue, Jun 18 2024 4:53 AM | Last Updated on Tue, Jun 18 2024 4:53 AM

Russian President Vladimir Putin set to visit Kim Jong Un in North Korea

రెండు రోజుల పర్యటనను ధ్రువీకరించిన ఇరు దేశాలు 

గతేడాది రష్యాలో పర్యటించిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ 

సియోల్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంగళవారం ఉత్తర కొరియాకు వెళ్లనున్నారు. కిమ్‌ ఆహా్వనం మేరకు పుతిన్‌ మంగళ, బుధవారాల్లో తమ దేశంలో పర్యటించనున్నట్టు కొరియన్‌ సెంట్రల్‌ అధికారిక న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రకటనను ఇరు దేశాలు ««ధ్రువీకరించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు, ఉత్తర కొరియా ప్యాంగ్యాంగ్‌ క్షిపణుల పరీక్షల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

గతేడాది చివరలో ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రష్యాలో పర్యటించడం సంచలనమైంది. ఉక్రెయిన్‌పై రష్యా తీవ్రమైన దాడులు చేస్తుండటంతో రష్యాకు అవసరమైన ఆయుధ సంపత్తిని ఉత్తర కొరియా సరఫరా చేస్తోందని, అందుకు బదులుగా రష్యా నుంచి అణు సాంకేతికతను పొందుతోందని దక్షిణ కొరియాతోపాటు అమెరికా ఆరోపిస్తున్నాయి. 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వమున్న రష్యా.. ఉత్తర కొరియాతో ఆయుధ వాణిజ్యం చేస్తే యూఎన్‌ తీర్మానాలను ఉల్లంఘించడమేనని అంటున్నాయి. అయితే, ఉత్తర కొరియా, రష్యా ఈ కథనాలను ఖండించాయి. కాగా, రష్యా అధ్యక్షుడు ఉత్తర కొరియాలో పర్యటించడం 24 ఏళ్లలో ఇది ప్రథమం. పుతిన్‌ మొదటిసారి జూలై 2000లో ఉత్తర కొరియాలో పర్యటించారు. మొదటి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత, అప్పుడు ఉత్తర కొరియాను పాలిస్తున్న కిమ్‌ తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌తో సమావేశమయ్యారు.  

పుతిన్‌ కోసం విలాసవంతమైన వేడుక 
1991లో సోవియట్‌ పతనం తర్వాత ఉత్తర కొరియాతో రష్యా సంబంధాలు బలహీనపడ్డాయి. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తొలిసారిగా 2019లో రష్యాలోని తూర్పు నౌకాశ్రయం వ్లాడివోస్టాక్‌లో పుతిన్‌తో సమావేశమయ్యారు. మళ్లీ పుతిన్, కిమ్‌లు ఇరుదేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో పుతిన్‌.. కిమ్‌కు హై–ఎండ్‌ ఆరస్సెనాట్‌ కారును పంపారు. 

ఇప్పుడు ఇరు దేశాల మధ్య అనుబంధాన్ని బయటి ప్రపంచానికి తెలిపేందుకు పుతిన్‌ కోసం విలాసవంతమైన వేడుకను కిమ్‌ సిద్ధం చేస్తున్నారు. రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని ఒక చౌరస్తాలో భారీ కవాతు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు తెలుపుతున్నాయని ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌ విశ్లేíÙంచింది. ఉక్రెయిన్‌పై యుద్ధం తరువాత పుతిన్‌ను స్వాగతించే దేశాలు తక్కువగా ఉన్నా.. ఉత్తర కొరియాలో పుతిన్‌ పర్యటన కిమ్‌ విజయం అంటున్నారు ఉత్తరకొరియా రాజకీయ విశ్లేషకులు. మాస్కోతో ఆర్థిక, ఇతర సహకారాలను పెంపొందించుకోవడానికి ఈ పర్యటనలు ఉపయోగపడతాయని  చెబుతున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement