అంతరిక్షంలో మేటి.. మరి రక్షణలోనో..!
అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న భారత్.. రక్షణ ఆయుధాల విషయంలో బాగా వెనుకబడింది. ప్రపంచంలోనే ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ప్రధమ స్ధానంలో నిలిచింది. గత ఐదేళ్లుగా ఇదే పొజిషన్‌లో భారత్ ఉంటోందని స్టాక్‌హోమ్‌కు చెందిన అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్ధ(ఎస్‌ఐపీఆర్‌ఐ) పేర్కొంది. 2012 నుంచి 2016 మధ్య ప్రపంచంలో ఎగుమతైన ఆయుధాల్లో 13శాతం భారతే దిగుమతి చేసుకున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని చెప్పింది. 2007-2011ల మధ్య ఇది 43 శాతంగా నమోదైనట్లు తెలిపింది. ఇది ప్రపంచదేశాలన్నింటిలో కల్లా చాలా ఎక్కువని చెప్పింది.
సొంతంగా ఆయుధాలను తయారు చేసుకుంటూ చైనా ఆయుధాల దిగుమతిని చాలా వరకూ తగ్గించుకుందని తెలిపింది. కానీ భారత్ మాత్రం అందుకు విభిన్నంగా రష్యా, అమెరికా, యూరప్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియాల్లాంటి దేశాలపై ఆయుధాల కోసం ఆధారపడుతోందదని చెప్పింది. కోల్డ్‌వార్ తర్వాతి నుంచి ఆయుధాల రంగంలో గుర్తించదగిన మార్పులు వచ్చినట్లు పేర్కొంది. భారత్ తర్వాత సౌదీ అరేబియా, ఖతార్‌లు ఆయుధాల దిగుమతిలో ముందున్నట్లు తెలిపింది. గతంతో పోలిస్తే 2012-2016ల మధ్య సౌదీ ఆయుధాల కొనుగోళ్లు 212 శాతం పెరగ్గా.. ఖతార్ కొనుగోళ్లు 245 శాతం పెరిగాయి.
ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశాల్లో అమెరికా ముందుంది. ప్రపంచంలో ఎగుమతి అవుతున్న ఆయుధాల్లో అమెరికా షేర్ మూడింట ఒక వంతుగా ఉంది. ఆ తర్వాతి స్ధానంలో రష్యా ఉంది. 2012-2016ల మధ్య ఆయుధాల ఎగుమతిలో రష్యా 23 శాతం వృద్ధిని చూసింది. రష్యా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న వారిలో భారత్, వియత్నాం, చైనా, అల్జీరియాలు వరుసగా ఉన్నాయని వెల్లడించింది.