అదను చూసి బదులు చెబుతాం!
► పాక్ అమానుషత్వంపై ఆర్మీచీఫ్ జనరల్ బిపిన్ రావత్
► భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వంతోనే భారత్ మాటకు విలువ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పాక్ సైన్యం ఇద్దరు భారత జవాన్ల తలలు నరికిన ఘటనపై అదను చూసుకుని సరైన రీతిలో బదులు చెబుతామని ఆర్మీచీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. శత్రువుపై ప్రతీకారం తీర్చుకునేందుకు వేస్తున్న పథకాలను ముందస్తుగా వెల్లడించాల్సిన అవసరంలేదన్నారు. భారత సైన్యం భవిష్యత్తు ప్రణాళికల గురించి ముందుగా మాట్లాడదని, పథకం అమలు చేసిన తరువాతే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ విషయంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ శరత్ చంద్ ఈ ఘటనపై స్పందిస్తూ సరైన సమయం, ప్రదేశం ఎన్నుకున్న తరువాత భారత సైన్యం తగిన రీతిలో బదులు చెబుతుందన్నారు. నాయిబ్ సుబేదార్ పరంజీత్ సింగ్, బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ప్రేమ్‌సాగర్‌ను పాక్‌కు చెందిన బోర్డర్ యాక్షన్ టీం మే 1న అత్యంత పాశవికంగా చంపిన ఘటనపై ప్రతీకారం తీర్చుకునేందుకు గల అన్ని అవకాశాలనూ భారత సైన్యం నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత వ్యూహాత్మక బలం పెరిగేందుకు రక్షణరంగ వ్యయాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని రావత్ అభిప్రాయపడ్డారు. సాయుధ బలగాలను బలోపేతం చేసుకునేందుకు మరిన్ని పెట్టుబడుల అవసరం ఉందని రావత్ తెలిపారు. పాకిస్తాన్, చైనాలకు సరైన రీతిలో బదులిస్తామన్నారు.
‘భద్రతామండలి’ కీలకం: ఇరాన్, ఇరాక్, అఫ్గానిస్తాన్ దేశాలతో రక్షణ రంగంలో సంబంధాలు నెలకొల్పటం వల్ల పాకిస్తాన్‌ను అయోమయంలోకి నెట్టడంతోపాటు చైనాను నియంత్రణలో ఉంచే అవకాశముందని రావత్ చెప్పారు. అన్ని ప్రధాన సమస్యల్లో భారత్ తన మాటను చెల్లుబాటు చేసుకునేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం పొందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బలమైన మిలటరీ.. ఆర్థికాభివృద్ధికి కీలకమన్నారు.