భారత్‌పై ఉరుముతున్న చైనా!
సరిహద్దుల్లో పెరిగిన సైనిక మోహరింపు
వేగంగా అణ్వాయుధాల ఆధునీకరణ
చైనా ఇటీవలికాలంలో తన రక్షణ సామర్థ్యాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతున్నది. అంతేకాకుండా భారత సరిహద్దుల్లో సైనిక మోహరింపు మరింతగా పెంచింది. ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో చైనా సైనిక స్థావరాల ఉనికి కూడా పెరిగిపోతున్నది. మరీ, ముఖ్యంగా పాకిస్థాన్‌లో ఆ దేశ ప్రమేయం భారీగా ఉన్నదని అమెరికా రక్షణవిభాగం పెంటాగాన్ హెచ్చరించింది.
'భారత సరిహద్దులకు సమీపంలో చైనా సైనిక మోహరింపు బాగా పెరిగిపోవడం, ఇక్కడ రక్షణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడం మేం గుర్తించాం' అని ఈస్ట్ ఆసియా వ్యవహారాలపై అమెరికా రక్షణశాఖ డిప్యూటీ సెక్రటరీ అబ్రహం డెన్మార్క్ తెలిపారు. 'చైనా సైనిక, రక్షణ అభివృద్ధి'పై ఆయన అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు 2016 వార్షిక నివేదికను సమర్పించారు. అయితే, ఇలా రక్షణ సామర్థ్యాలు పెంచుకోవడం, సైనిక మోహరింపు ఎక్కువ చేయడంపై చైనా అసలు ఉద్దేశాలేమిటో కనుగొనడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
చైనా అణ్వాయుధాల గురి ఆ 3 దేశాలపైనే
అమెరికా, రష్యా, భారత్ రక్షణ సామర్థ్యానికి పోటీగానే చైనా ఇటీవలికాలంలో తన అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింతగా ఆధునీకరించుకుంటున్నదని పెంటాగాన్ తెలిపింది. ఈ మూడు దేశాలతో పోటీ వల్ల తన వ్యూహాత్మక దాడి సామర్థ్యాన్ని చైనా మరింత విస్తృత పరుచుకుంటున్నదని వివరించింది. అణ్వాయుధ రంగంలోని వివిధ యూనిట్లపై మరింత నియంత్రణ సాధించడానికి ఆ దేశం ప్రయత్నిస్తున్నదని, ఇందులో భాగంగానే అణ్వాయుధాల కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్‌ను మరింత ఆధునీకరిస్తున్నదని పెంటాగాన్ తెలిపింది. మొబైల్ క్షిపణలు, వార్‌హేడ్స్, వాటిని స్వతంత్రంగా మోసుకెళ్లే రీ ఎంట్రీ వెహికిల్స్, వాటికి సహాయపడే యంత్రాలు.. తదితర వాటిని నూతన తరం సాకేంతకతతో విసృత పరుచుకొని.. అమెరికా, రష్యాకు దీటుగా అణ్వాయుధ నిరోధ వ్యవస్థను చైనా పటిష్టం చేసుకుంటున్నదని వివరించింది.