
మేనకాగాంధీ సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల విషయమై ప్రపంచ వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ అగ్రదేశాలపై విరుచుకుపడ్డారు. వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలను తగ్గించే భారాన్ని భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదలాయించడం తప్పే అవుతుందని ఆయన పారిస్ లో జరిగిన వాతావరణ మార్పుల సదస్సులో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే ప్రధాని మోదీ వ్యాఖ్యలతో సాక్షాత్తు ఆయన క్యాబినెట్ సీనియర్ మంత్రి ఒకరు తీవ్రంగా విభేదించారు.
'వాతావరణ మార్పులకు పశ్చిమ దేశాలే కారణమని మనం నిందిస్తూ కూర్చోకూడదు. అవి వంద ఏళ్ల కిందట అలా చేసి ఉంటాయి. ప్రస్తుతం వాతావరణాన్ని ధ్వంసచేస్తున్న ప్రధాన శక్తుల్లో భారత్ కూడా ఉంది' అని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ తేల్చి చెప్పారు.
'చైనా, బ్రెజిల్ తోపాటు మనం భారీగా రసాయన వాయువైన మెథీన్ ను విడుదల చేస్తున్నాం. అయినప్పటికీ దీని గురించి మనం ఆలోచించడం లేదు. వాతావరణ మార్పులకు కార్బన్ డై యాక్సెడ్ కన్నా ఇది 26 రెట్లు ఎక్కువ బలంగా కారణమవుతున్నది' అని మేనక పేర్కొన్నారు. చెన్నైలో వరదలు, వాతావరణ మార్పులపై ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి వాతావరణ మార్పులకు కారణమవుతున్నది మేము కాదు మీరేనంటు అగ్రదేశాలను ఉద్దేశించి మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే.