కొత్త శిఖరాలకు ద్వైపాక్షిక బంధం | India, Russia to set up study group to push FTA | Sakshi
Sakshi News home page

కొత్త శిఖరాలకు ద్వైపాక్షిక బంధం

Published Thu, Jun 19 2014 3:22 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

కొత్త శిఖరాలకు ద్వైపాక్షిక బంధం - Sakshi

కొత్త శిఖరాలకు ద్వైపాక్షిక బంధం

* మరింత సహకారానికి భారత్-రష్యా సై
* సుష్మాతో రష్యా ఉప ప్రధాని దిమిత్రీ రోగోజిన్ భేటీ

 
 న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్-రష్యా మధ్య విస్తృతస్థాయి చర్చలు చోటుచేసుకున్నాయి. రక్షణ, వాణిజ్యం, హైడ్రోకార్బన్లు అణు ఇంధనం వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల మధ్య బుధవారం అత్యన్నత స్థాయి సమావేశం జరిగింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రష్యా ఉప ప్రధాని డిమిత్రీ ఓ రోగోజిన్ మధ్య ఢిల్లీలో దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘ చర్చలు సాగాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రష్యా, బెలారస్, కజకిస్థాన్ యూనియన్‌కు భారత్‌కు మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సాధ్యాసాధ్యాలపై అధ్యయన బృందాన్ని నియమించాలని నిర్ణయించారు.
 
  అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఈ ఏడాదిలోనే తలపెట్టిన వార్షిక సదస్సుకు ఏర్పాట్లపైనా ఇరువురూ చర్చించారు. ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య తరచూ చర్చలు జరిగేలా ఈ ఏడాది షెడ్యూల్‌ను ఖరారు చేయడంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు సమాచారం. భారత్-రష్యాల మధ్య అనేక అంశాలపై అన్ని కోణాల్లో విస్తృతమైన ద్వైపాక్షిక చర్చలు జరిగాయని, ఈ సందర్భంగా ఆద్యంతం సుహృద్భావ వాతావరణం నెలకొందని ఈ సమావేశం అనంతరం విదేశాంగ శాఖ పేర్కొంది. పాక్‌కు రష్యా తయారీ ఎంఐ-35 హెలికాప్టర్ల విక్రయం అంశాన్ని కూడా భారత్ ప్రస్తావించినట్లు ఆ శాఖ ప్రతినిధి తెలిపారు. రక్షణ విషయాలతో పాటు ఆర్థిక,  వాణిజ్య సంబంధాల బలోపేతంపైనే ఇరువురు నేతలు ఎక్కువగా దృష్టి సారించినట్లు వివరించారు.
 
 జోషీకి రష్యా అత్యున్నత పురస్కారం
 బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీకి విదేశీయులకు రష్యా అందించే అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్’గా పిలిచే ఈ పురస్కారాన్ని ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న రష్యా ఉప ప్రధాని దిమిత్రీ ఓ రోగోజిన్ బుధవారం నాడు ఇక్కడి రష్యన్ రాయబార కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జోషీకి అందజేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement