బాలాసోర్(ఒడిశా): గగనతల రక్షణ కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తక్కువ ఎత్తు నుంచి (30 కిలోమీటర్ల లోపు) వచ్చే ఎటువంటి ఖండాంతర క్షిపణులనైనా ఇది ధ్వంసం చేయగలదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఇలాంటి మూడు క్షిపణులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. వివిధ ఎత్తుల్లో ఖండాంతర క్షిపణుల నుంచి పూర్తి స్థాయి రక్షణ కోసం ఈ ఏడాది మార్చి 1న, ఫిబ్రవరి 11న రెండు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రదేశం నుంచి పృథ్వీ క్షిపణిని ప్రయోగించారు.
రాడార్స్ నుంచి సిగ్నల్స్ రాగానే బంగాళాఖాతంలోని అబ్దుల్ కలాం (వీలర్ ద్వీపం) ద్వీపంలో ఉన్న సూపర్‌సోనిక్ క్షిపణి వెంటనే పృథ్వీ క్షిపణిని అడ్డుకుని ధ్వంసం చేసిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భూమికి సుమారు 15 కిలోమీటర్ల ఎత్తులోనే ఏఏడీ పృథ్వీని అడ్డుకుని ధ్వంసం చేసిందని పేర్కొన్నాయి. 7.5 మీటర్ల పొడవుండే ఈ క్షిపణిలో నావిగేషన్ సిస్టంతో పాటు హైటెక్ కంప్యూటర్‌ను కూడా అనుసంధానం చేసినట్లు పేర్కొన్నాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ తర్వాత ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న నాలుగో దేశం భారత్ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment