
నల్లధనంలో మనది మూడోస్థానం
పదేళ్లలో రూ.28 లక్షల కోట్లు తరలింపు
వాషింగ్టన్: విదేశాలకు నల్లధనం తరలింపులో భారత్ మూడోస్థానంలో నిలిచినట్లు వాషింగ్టన్‌కు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ అధ్యయనంలో తేలింది. 2012లో భారత్‌నుంచి రూ.ఆరు లక్షల కోట్లు నల్లధనం అక్రమంగా విదేశాలకు చేరినట్లు వెల్లడైంది. 249.57 బిలియన్ డాలర్లతో చైనా అగ్రస్థానంలో ఉండగా, 122.86 బిలియన్ డాలర్లతో రష్యా రెండో స్థానంలో నిలిచింది. వర్ధమాన దేశాలనుంచి 2012లో 991.2 బిలియన్ డాలర్లు అక్రమంగా విదేశాలకు తరలగా అందులో పదిశాతం భారత్‌నుంచే తరలిందని పేర్కొంది. 2003- 2012 మధ్య భారత్‌నుంచి రూ.28 లక్షల కోట్లు విదేశాలకు చేరినట్లు జీఎఫ్‌ఐ పేర్కొంది.
‘సమన్వయం అవసరం’
న్యూఢిల్లీ: నల్లధన నియంత్రణకు వివిధ సంస్థల మధ్య చురుకైన సమన్వయం అవసరమని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. రిజర్వ్ బ్యాంకు, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, ఆదాయపన్ను, సెబీ తదితర సంస్థల మధ్య సమన్వయం నెలకొల్పాలని తన నివేదికలో పేర్కొంది.