త్వరలో జరగనున్న సార్క్ సమావేశాలకు భారత్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. భారత్ బాటలో బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్తాన్ కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు సార్క్ దేశాలు ఈ సమావేశాలకు దూరం కావడం పాక్ కు నిజంగానే పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.
ఇటీవల జరిగిన ఉడీ ఉగ్రదాడికి నిరసగా భారత్ సార్క్ సదస్సుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు విదేశాంగశాఖ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. సార్క్ సమావేశాలు వచ్చే నవంబర్ లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఉగ్రదాడుల నేపథ్యంలో పాక్ కు బుద్ధిచెప్పాలంటే ఇలాంటి చర్యలకు సిద్ధమవ్వాలన్నట్లు కేంద్రం సంకేతాలు పంపింది. భవిష్యత్తులో దౌత్యపరంగా దాయాది పాక్ కు ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.