దేవకన్యా.. దిగిరావా | Indian actress Sridevi dies at 54 of heart attack in Dubai | Sakshi
Sakshi News home page

దేవకన్యా.. దిగిరావా

Published Mon, Feb 26 2018 2:26 AM | Last Updated on Mon, Feb 26 2018 11:41 AM

Indian actress Sridevi dies at 54 of heart attack in Dubai - Sakshi

స్వర్గలోకపు దారుల్ని వెతుక్కుంటూ.. ఆసేతు హిమాచలాన్ని శోకసంద్రంలో ముంచేస్తూ.. దివికేగిన ఓ దేవకన్యా.. అంగుళీయకము లేదని స్వర్గలోక ప్రవేశానికి ఇంద్రుడు నిరాకరిస్తే.. మళ్లీ భూలోకానికి దిగిరావా...!!  

సాక్షి, హైదరాబాద్‌/దుబాయ్‌/ముంబై: ఐదు దశాబ్దాలపాటు వెండితెరను ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి (54) ఇక లేరు. శనివారం రాత్రి దుబాయ్‌లో ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం తెలతెలవారుతుండగా ఈ చేదువార్త విని యావత్‌ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. సినీలోకం మూగబోయింది. తన మేనల్లుడు మోహిత్‌ మార్వా వివాహం కోసం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీతో కలసి శ్రీదేవి దుబాయ్‌ వెళ్లారు. పెద్ద కూతురు జాహ్నవి షూటింగ్‌ కారణంగా ముంబైలోనే ఉండిపోయారు. శనివారం రాత్రి శ్రీదేవి వేడుకల్లో హుషారుగానే పాల్గొన్నారు. కొందరు బంధువులు తిరిగి స్వదేశం చేరుకున్నా ఆమె అక్కడే ఆగిపోయారు. జుమైరా ఎమిరేట్స్‌ టవర్‌ హోటల్‌లోని తన స్నానాల గదిలో రాత్రి 11 గంటల సమయంలో ఆమె కుప్పకూలి కనిపించారని సమాచారం. వెంటనే రషీద్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మరణించారని డాక్టర్లు ధ్రువీకరించారు. శ్రీదేవికి భర్త బోనీకపూర్, ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, ఖుషీ ఉన్నారు. శ్రీదేవి భౌతికకాయానికి దుబాయ్‌లోనే పోస్టుమార్టం పూర్తయింది. సోమవారం ఉదయం భౌతికకాయాన్ని ముంబైకి తీసుకురానున్నట్లు ఆమె కుటుంబీకులు ఒక ప్రకటనలో తెలిపారు. 

నాలుగేళ్ల వయసు నుంచే.. 
తమిళనాడులోని శివకాశిలో 1963 ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి(అసలు పేరు అమ్మయంగార్‌ అయ్యప్పన్‌) నాలుగేళ్ల వయసు నుంచే వెండితెరపై వెలిగారు. 1967లో ‘కందన్‌ కరుణై’ చిత్రంలో బాలనటిగా రంగప్రవేశం చేశారు. ‘కొందరు సిల్వర్‌ స్పూన్‌తో పుడతారు.. శ్రీదేవి సిల్వర్‌ స్క్రీన్‌తో పుట్టింది’ అనే నానుడి స్థిరపడేలా బాలనటిగా దూసుకుపోయారు. ఎన్టీఆర్, శివాజీ గణేశన్, ఎస్వీఆర్‌ వంటి హేమాహేమీల నడుమ, గంభీరమైన రూపు– వాచకం ఉన్న అంత పెద్ద నటుల మధ్య ఏమాత్రం తొట్రుపడకుండా అలవో కగా శ్రీదేవి నటించారు. ‘బడిపంతులు’లో ‘బూచాడమ్మ బూచాడు’ పాటతో తెలుగు ప్రేక్షకులు ముచ్చటపడే చిన్నారిగా మారారు. 11వ ఏటనే మలయాళంలో హీరోయిన్‌గా నటించినా 13వ ఏట తెలుగులో ‘అనురాగాలు’ (1976), 14వ ఏట ‘మా బంగారక్క’ (1977) సినిమాలతో తెలుగు హీరోయిన్‌గా మారారు. ‘పదహారేళ్ల వయసు’ (1978) ఘన విజయంతో ఆమె దశ తిరిగింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు ఇటు దక్షిణాదిని, అటు ఉత్తరాదిని ఏలారు. ‘ప్రేమాభిషేకం’, ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’, ‘దేవత’ వంటి సూపర్‌ హిట్స్‌ ఆమె ఖాతాలో ఉన్నాయి. నాగార్జునతో ‘ఆఖరి పోరాటం’, చిరంజీవితో ‘జగదేకవీరుడు–అతిలోక సుందరి’ వంటి భారీ హిట్స్‌ ఇచ్చారు. హిందీలో ‘సద్మా’, ‘చాందినీ’, ‘చాల్‌బాజ్‌’, ‘ఖుదాగవా’, ‘లమ్హే’ వంటి సినిమాలు ఆమె వల్లే హిట్‌ అయ్యాయి. 2013లో శ్రీదేవి ‘పద్మశ్రీ’ అందుకున్నారు.  

సిసలైన తెలుగు నటి 
శ్రీదేవి తండ్రి అయ్యప్పన్‌ శివకాశిలో స్థిరపడ్డ తెలుగు వ్యక్తి. ఆయన తెలుగు స్పష్టంగా మాట్లాడేవారు. తల్లి రాజేశ్వరి చిత్తూరు జిల్లా నుంచి సినీ రంగ అవకాశాలను వెతుక్కుంటూ చెన్నై వెళ్లారు. శ్రీదేవికి శ్రీలత అనే సోదరి ఉంది. నటి మహేశ్వరి కజిన్‌. బోనీ కపూర్‌ను వివాహమాడారు. నటుడు అనిల్‌ కపూర్‌ ఆమెకు మరిది. శ్రీదేవి చివరి సినిమా ‘మామ్‌’ (2017). పదిహేనేళ్లపాటు చిత్రాలకు విరామం ఇచ్చిన అనంతరం ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. కుమార్తె జాహ్నవి నటిస్తున్న తొలి చిత్రం ‘ధడక్‌’ ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. కుమార్తెను హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి ఎంతో పరితపించారు. ఆ సినిమా విడుదల కాకముందే ఆమె మరణించడం విషాదం. 

కన్నీరు పెట్టిన చిత్రపరిశ్రమ 
శ్రీదేవి హఠాన్మరణంతో భారత చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. అమితాబ్‌ బచ్చన్, ప్రియాంక చోప్రా, సుస్మితాసేన్, సిద్ధార్థ్‌ మల్హోత్రా, రితీశ్‌ దేశ్‌ముఖ్‌ తదితరులు ట్వీటర్‌ ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీదేవి మృతిపై అందరికన్నా ముందుగా స్పందించింది అమితాబే. ‘ఈ బాధను వర్ణించేందుకు మాటల్లేవు. శ్రీదేవిని అభిమానించే అందరికీ నా సానుభూతి. ఇదో చీకటి దినం’ అని ప్రియాంక చోప్రా ట్వీటర్‌ ద్వారా విచారం వ్యక్తం చేశారు. ‘షాక్‌కు గురయ్యా. చాలా బాధగా ఉంది. శ్రీదేవి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢసానుభూతి’ అని హాస్యనటుడు జానీ లివర్‌ పేర్కొన్నారు. ‘శ్రీదేవి లేరనే వార్త తెలిసినప్పటినుంచీ ఏడుపాగటం లేదు. చాలా బాధగా ఉంది’ అని సుస్మితా సేన్‌ తెలిపారు. ‘భారత లెజెండరీ నటి శ్రీదేవి ఇకలేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నా’ అని టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆర్టిస్టిక్‌ డైరెక్టర్‌ కెమరాన్‌ బైలీ పేర్కొన్నారు. 

ఇంటి వద్ద భారీగా అభిమానులు..
ముంబైలోని లోఖండ్‌వాలాలో ఉన్న శ్రీదేవి ఇంటివద్ద విషా దఛాయలు అలుముకున్నాయి. ఆమెను కడసారి చూసేం దుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఈ ఇంట్లో శ్రీదేవి తన భర్త, ఇద్దరు కూతుళ్లతో కలసి నివ సించేవారు.  

‘నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని’ అంటూ ఒకతరం ఆమె వెంటపడింది 
‘జాబిలితో చెప్పనా’ అంటూ ఒక శకం ఆమెతో పరుగు తీసింది 
‘పందొమ్మిది వందల ఎనభై వరకు’ ఇట్టాంటి అందం ఎవరూ చూడలేదని అందరూ అన్నారు 
దేవేంద్రునికి కూతురు ఉంటే ఇలాగే ఉంటుందని ‘అహోమహో’లు పాడారు 
ఈ అతిలోక సుందరి వేయి పుంజాల వెలుతురు 
ఇవాళ ఆమె లేరు.. వెండితెర వెలవెలబోయింది..  

ఆమెకు హృద్రోగ సమస్యల్లేవు
శ్రీదేవికి హృద్రోగ సమస్యలేమీ లేవని ఆమె మరిది, నటుడు సంజయ్‌ కపూర్‌ తెలిపారు. ‘శనివారం రాత్రి 11 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆ సమయంలో ఆమె హోటల్‌ గదిలో ఉన్నారు’ అని ఆయన చెప్పారు. 

పోస్టుమార్టం నివేదిక ఆలస్యం 
శ్రీదేవి భౌతికకాయానికి దుబాయ్‌లోనే పోస్టుమార్టం పూర్తయినా ఆదివారం రాత్రి వరకు పోలీసుల విచారణ నివేదిక రాలేదు. దీంతో ఆమె భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దుబాయ్‌ చట్టాల ప్రకారం.. ఆసుపత్రిలో కాకుండా వేరేచోట మృతిచెందిన వారి పోస్టుమార్టం పూర్తయ్యేందుకు కనీసం 24 గంటలు పడుతుంది. 

మార్చురీలో భౌతికకాయం 
శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్‌కు వీలైనంత తొందరగా తరలించేందుకు దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు అక్కడి పోలీసులతో కలసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పార్థివదేహం దుబాయ్‌ పోలీసు ప్రధాన కార్యాలయంలోని మార్చురీలో ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement