![Indian Air Force Pre Plan Attack On POK - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/26/blast.jpg.webp?itok=_ZTratBb)
సాక్షి, న్యూఢిల్లీ : 40 మంది పైగా భారత సైనికులను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై భారత్ తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకుంది. అత్యాధునిక మిరాజ్ 2000 యుద్ధ విమానాల ద్వారా 1000 కిలోలబాంబులను ఉగ్ర స్థావరాలపై జార విడిచారు. దీంతో వందల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు భారత్ చెబుతోంది. దీనిని సర్జికల్ స్ట్రైక్ 2గా వర్ణిస్తూ యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో భారతవాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకులు, సీనీ ప్రముఖులు, క్రీడాకారులు.. ప్రతి ఒక్కరు ఈ దాడిపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పక్కా ప్లాన్‌తోనే భారత్ ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది.
2016 సెప్టెంబరులో కశ్మీర్‌లోని ఉడి సైనిక శిబిరంపై ఉగ్రదాడికి ప్రతీకారకంగాభారత్ తొలిసారిగా సర్జికల్ స్ట్రైక్ చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపి ముష్కరులను మట్టుబెట్టింది. అయినా ఉగ్రవాదు ఆడగాలు ఆగలేదు. దీంతో ఈ సారి పాక్‌కు గట్టిగా బదులిచ్చింది. తమ దేశంపై భారత్ దాడి చేయాలని చూస్తే ప్రతిదాడికి తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ..భారత్ వ్యూహాత్మకంగా మెరుపుదాడులకు దిగి జైషే ఏ మహ్మద్ ఉగ్రవాదులకు బుద్ధిచెప్పింది.(బాంబుల వర్షం కురిసేటప్పుడు మోదీ అక్కడే ఉన్నారా..!)
పక్కా ప్లాన్‌తో..
పుల్వామా ఉగ్రదాడిని భారత్ సిరియస్‌గా తీసుకుంది. భారత జవాన్ల మరణం వృధా కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. పుల్వామ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే ప్రధాన మంత్రి నేతృత్వంతో కేంద్ర పెద్దలు భేటీ అయ్యారు. 40 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న పాక్‌కు ఎలా బుద్ది చెప్పాలన్న విషయంపై చర్చించారు. ముష్కర మూకల కోరలు పీకేందుకు భారత్ పక్కా ప్రణాళిక రచించింది. ఈ దాడి బాధ్యతలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు అప్పగించారు. ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలోనే దాడులు చేయలాని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిఘా వర్గాల ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాల సమాచారాన్ని సేకరించారు. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఒక్కో స్థావరంలో ఎంత మంది ఉన్నారో అంచనా వేశారు. వివిధ దేశాల గూఢచర్య సంస్థలలో సమన్వయం చేసుకున్న భారత్.. జైష్ ఏ మహ్మద్‌కు సంబంధించిన టాప్ కమాండర్ల ఉనికిని గుర్తించింది. వ్యూహం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో గల జైష్ ఏ మహ్మద్ ఉగ్ర స్థావరంపై భారత వాయుసేన విరుచుకుపడింది. (12 రోజుల ముందే సర్జికల్ దాడులు జరిగి ఉంటే..)
జైషేకు ఇది గట్టి ఎదురుదెబ్బే
ఇక భారత్ లక్ష్యంగా చేసుకున్న బాలాకోట్ ఉగ్ర స్థావరం జైష్ ఏ మహ్మద్‌కు చెందిన అతిపెద్దది. జైషే అధినేత మసూద్ అజార్ బావమరిది మౌలానా యూసఫ్ అజార్ ఆధ్వర్యంలో ఇది నడుస్తోంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ శిబిరంలో ఉగ్రవాదులకు ఆత్మాహుతి దాడిలో శిక్షణ ఇస్తుంటారు. భారత్ జరిపిన దాడులలో కశ్మీర్ ఆపరేషన్ అధినేత ముఫ్తి అజార్ ఖాన్ కశ్మీరీ, జైషే అధినేత మసూద్ అజార్ సోదరుడు ఇబ్రహీం అజార్, మౌలానా తల్హా సైఫ్, మౌలానా అమ్మార్‌తో సహా వందల సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇది జైషేకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.
ఆరు బాంబులతో మెరుపు దాడి!
భారత వైమానిక దళం మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని పాక్ ప్రేరేపిత ఉగ్రస్థావరాలపై12 మిరేజ్ 2000 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాద స్థావరాలను సమూలంగా నేలమట్టం చేసింది. ఈ దాడిలో వైమానిక దళం ఆరు బాంబులను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఉన్న అతిముఖ్యమైన యుద్ధవిమానాల్లో మిరాజ్ 2000 ఒకటి. 1985లో ఇవి భారత వైమానిక దళంలో చేరాయి. వీటిని దసాల్ట్ ఏవియేషన్ సంస్థ అభివృద్ధి చేసింది. అప్పుడు వీటికి ‘వజ్ర’ అని నామకరణం చేశారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా భారత్ వీటిని ఉపయోగించింది. ఈ యుద్ధంలో భారత దేశం విజయం సాధించడానికి కారణం మిరాజ్ 2000 విమానాలే అని చెప్పవచ్చు. (ఇప్పుడు నా భర్త ఆత్మకు శాంతి దొరికింది)
Comments
Please login to add a commentAdd a comment